Tata Power Q1 results: క్యూ1 లో టాటా పవర్ ఆదాయం రూ.17,294 కోట్లు; నికర లాభంలో స్వల్ప వృద్ధి
06 August 2024, 18:35 IST
Tata Power Q1 results: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY25) లో టాటా పవర్ రూ. 1,189 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో (Q1FY24) నమోదైన రూ .1,141 కోట్లతో పోలిస్తే, ఇది 4 శాతం పెరిగింది.
క్యూ1 లో టాటా పవర్ ఆదాయం రూ.17,294 కోట్లు
Tata Power Q1 results: జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసికం (Q1FY25) లో టాటా పవర్ రూ. 1,189 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో (Q1FY24) నమోదైన రూ .1,141 కోట్లతో పోలిస్తే 4 శాతం ఎక్కువ. అలాగే, ఈ క్యూ 1 లో టాటా పవర్ ఆదాయం రూ. 17,294 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం క్యూ 1 లో టాటా పవర్ ఆదాయం రూ.15,213 కోట్లు.
వరుసగా 19 క్వార్టర్స్ లో లాభాలు
భారతదేశపు అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీల్లో ఒకటైన టాటా పవర్ ఈ క్యూ1 లో తన అత్యధిక నికర లాభాలను నివేదించింది. ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక వ్యాపారాలలో బలమైన పనితీరును కనబరిచింది. వరుసగా 19 వ త్రైమాసిక వృద్ధిని నమోదు చేసింది. ‘‘ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్, స్థిరమైన వ్యాపార వేగం కారణంగా మా వ్యాపారాలన్నీ లాభదాయకంగా పెరిగాయి'' అని టాటా పవర్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా అన్నారు.
పటిష్టమైన ఆర్డర్ పైప్ లైన్
వడ్డీ, పన్నులు, తరుగుదల, అమోర్టైజేషన్ (EBITA)లకు ముందు కంపెనీ రాబడులు 11 శాతం పెరిగి రూ.3,350 కోట్లకు చేరుకున్నాయి. పటిష్టమైన ఆర్డర్ పైప్ లైన్ తమ వృద్ధికి కారణమని, ఇది సమగ్ర వ్యాపార విస్తరణకు దోహదపడుతుందని కంపెనీ పేర్కొంది. Q1FY25 నాటికి, కంపెనీ 6.1 గిగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఇన్ స్టాల్డ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఇది దాని మొత్తం సామర్థ్యంలో 41 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుతం అదనంగా 5.3 గిగావాట్లు అభివృద్ధిలో ఉన్నాయి. గ్రూప్ క్యాప్టివ్ సహా యుటిలిటీ స్కేల్ ఈపీసీ, సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులకు మొత్తం ఆర్డర్ పైప్ లైన్ విలువ రూ.15,500 కోట్లుగా ఉంది.
రూఫ్ టాప్ రంగంలో 20 శాతం మార్కెట్ వాటా
టాటా పవర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రెసిడెన్షియల్ రూఫ్ టాప్ రంగంలో కంపెనీ 20 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకోగలిగింది, దాని కొత్త సోలార్ తయారీ సదుపాయం, భారతదేశం అంతటా విస్తృత నెట్ వర్క్ కు అందుకు కారణమని కంపెనీ పేర్కొంది. సుస్థిర మొబిలిటీ సొల్యూషన్స్ ను ముందుకు తీసుకెళ్లే దిశగా గణనీయమైన పురోగతి సాధించామని, లక్ష హోమ్ ఈవీ ఛార్జర్ల ఇన్ స్టలేషన్ ను అధిగమించిన తొలి ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ గా అవతరించామని టాటా పవర్ తెలిపింది.