Zomato Q1 results: అదిరిపోయిన జొమాటో క్యూ 1 రిజల్ట్స్; 74% పెరిగిన ఆదాయం-zomato q1 results profit jumps to rs 253 crore revenue soars 74 percent yoy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato Q1 Results: అదిరిపోయిన జొమాటో క్యూ 1 రిజల్ట్స్; 74% పెరిగిన ఆదాయం

Zomato Q1 results: అదిరిపోయిన జొమాటో క్యూ 1 రిజల్ట్స్; 74% పెరిగిన ఆదాయం

HT Telugu Desk HT Telugu
Aug 01, 2024 10:34 PM IST

Zomato Q1 results: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో లాభాల్లో దూసుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY25) ఫలితాలను జొమాటో గురువారం ప్రకటించింది. ఈ క్యూ 1 లో జొమాటో నికర లాభం గతేడాది క్యూ 1 తో పోలిస్తే 126.5 రెట్లు పెరిగింది.

అదిరిపోయిన జొమాటో క్యూ 1 రిజల్ట్స్
అదిరిపోయిన జొమాటో క్యూ 1 రిజల్ట్స్

Zomato Q1 results: జూన్ 30, 2024తో ముగిసిన త్రైమాసికం (Q1FY25) లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో ఏకీకృత నికర లాభం రూ. 253 కోట్లకు పెరిగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ1)లో కంపెనీ నికర లాభం అంతక్రితం ఏడాదితో పోలిస్తే 126.5 రెట్లు పెరిగింది. ఫుడ్ అగ్రిగేటర్ జొమాటో ఆదాయం వరుసగా ఐదో త్రైమాసికం వృద్ధి చెందడం గమనార్హం. జొమాటో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 74 శాతం పెరిగి రూ.4,206 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో జొమాటో తొలిసారి రూ.2 కోట్ల నికర లాభం, రూ.2,416 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

జొమాటో స్టాక్ జోరు

జోమోటో (zomato) ప్రధాన వ్యాపారంలో లాభదాయకత పెరగడంతో పాటు దాని శీఘ్ర వాణిజ్య విభాగమైన బ్లింకిట్ వేగంగా వృద్ధి చెందుతున్న కారణంగా గత ఏడాదిలో జోమోటో షేరు ధర గణనీయంగా పెరిగింది. గత ఏడాది కాలంలో జొమాటో షేరు ధర 137 శాతం పెరిగింది. ఈ ఏడాది జూలై 15న బీఎస్ఈలో 52 వారాల గరిష్ట స్థాయి రూ.232ను, గత ఏడాది ఆగస్టు 3న 52 వారాల కనిష్ట స్థాయి రూ.80.99ను తాకింది.

ఫుడ్ డెలివరీ మార్కెట్ వృద్ధి

ఫుడ్ డెలివరీ మార్కెట్ లో జొమాటో తన ఉనికిని బలోపేతం చేసుకుంటుందని, నిరంతరం కొత్త టెక్నాలజీని స్వీకరించడం, కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకుంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఫుడ్ డెలివరీ వ్యాపారంలో వృద్ధికి భారీ అవకాశాలు ఉండటంతో జొమాటో పట్ల ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉన్నారు.

పట్టణ జనాభా టార్గెట్

ప్రస్తుతం భారత్ లో పట్టణ జనాభా మొత్తం జనాభాలో 34-35 శాతంగా ఉంది. 2030 నాటికి, ఈ పట్టణ జనాభా గణనీయమైన పెరుగుదలను చూస్తుందని అంచనాలు సూచిస్తున్నాయి, ఇది భారతదేశ మొత్తం జనాభాలో దాదాపు 42-43 శాతానికి చేరుకుంటుంది. ఈ పెరుగుదల జొమాటో వ్యాపారాభివృద్ధికి దోహదపడుతుంది. భారత్ లో ఆహార వినియోగం భారత జీడీపీలో నాలుగో వంతుకు దోహదం చేస్తుందని, ఇందులో 10 శాతం రెస్టారెంట్ ఫుడ్ ద్వారానే జరుగుతోంది. భారతదేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వ్యాప్తి ఫుడ్ డెలివరీ వ్యాపారం వృద్ధికి దోహదపడుతుంది.

Whats_app_banner