Tata Ace EV 1000: టాటా ఏస్ ఈవీ 1000 ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ లాంచ్; రేంజ్ 161 కిమీ..
16 May 2024, 18:36 IST
Tata Ace EV 1000 cargo: ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను మార్కెట్లో తీసుకువస్తున్న టాటా.. తాజాగా టాటా ఏస్ ఈవీ 1000 ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇంట్రా-సిటీ డెలివరీలకు ఎంతో ఉపయుక్తమైన ఈ కార్గో వాహనం సింగిల్ చార్జ్ తో 161 కిమీలు ప్రయాణిస్తుందని టాటా మోటార్స్ చెబుతోంది.
టాటా ఏస్ ఈవీ 1000
Tata Ace EV 1000 cargo: టాటా మోటార్స్ కొత్త ఏస్ ఈవీ 1000 ఇ-కార్గో వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది లాస్ట్ మైల్ డెలివరీకి ఎలక్ట్రిక్ మొబిలిటీ పరిష్కారాలను తీసుకువస్తుంది. కొత్త టాటా ఏస్ ఈవీ 1000.. ఒక టన్ను పేలోడ్ తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 161 కిలోమీటర్లు (సర్టిఫైడ్) పరిధిని అందిస్తుంది. కొత్త జీరో-ఎమిషన్ ఏస్ ఎలక్ట్రిక్ వెహికిల్ ను తమ వినియోగదారుల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ లను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి చేశామని, కొత్త వెర్షన్ ఎఫ్ఎంసీజీ, బేవరేజెస్, పెయింట్ అండ్ లూబ్రికెంట్స్, ఎల్పీజీ మరియు డెయిరీ రంగాల అవసరాలను తీరుస్తుందని టాటా మోటార్స్ చెబుతోంది.
బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్
కొత్త టాటా ఏస్ ఈవీ లో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్స్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. వీటిని టాటా గ్రూప్ కంపెనీలు కలిసి అభివృద్ధి చేశాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్గో మోడల్ దేశవ్యాప్తంగా కంపెనీ వాణిజ్య వాహన డీలర్ షిప్ ల ద్వారా అందుబాటులో ఉంటుంది. 150 కి పైగా ఎలక్ట్రిక్ వెహికల్ సపోర్ట్ సెంటర్ల ద్వారా సర్వీస్ సపోర్ట్ ఉంటుంది. వినియోగదారుల కార్గో అవసరాలను టాటా ఏస్ 1000 కార్గో ఈవీ పూర్తి స్థాయిలో తీర్చగలదని టాటా మోటార్స్ కమర్షియల్ వెహికిల్స్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ వినయ్ పాఠక్ తెలిపారు.ముఖ్యంగా ప్రధాన నగరాల్లో అంతర్గత కార్గొ రవాణాకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
ఏడేళ్ల బ్యాటరీ వారంటీ
టాటా ఏస్ ఈవీ 1000 కార్గో ఈవీ కి ఏడేళ్ల బ్యాటరీ వారంటీ, ఐదేళ్ల కాంప్రహెన్సివ్ మెయింటెనెన్స్ ప్యాకేజీ ని అందిస్తున్నారు. అధునాతన బ్యాటరీ కూలింగ్ సిస్టమ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లతో అన్ని వాతావరణ పరిస్థితులకు ఇది అనుకూలమని టాటా సంస్థ తెలిపింది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 27 కిలోవాట్ల (36.2బిహెచ్ పి), 130ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త టాటా ఏస్ ఈవీ 1000 ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్ సెగ్మెంట్లో పియాజియో, బజాజ్, యూలర్, ఆల్టిగ్రీన్ తదితర బ్రాండ్లు ఎలక్ట్రిక్ కార్గో వాహనాలు మార్కెట్లో ఉన్నాయి.