Business idea : ఈ ఆంధ్ర అబ్బాయి ఒక ట్రెండ్ సెట్టర్! 'స్విగ్గీ'తో బిలియన్ డాలర్ల వ్యాపారం..
07 November 2024, 12:23 IST
- Swiggy IPO : స్విగ్గీ సక్సెస్ జర్నీలో ఓ ఆంధ్ర అబ్బాయి కీలక పాత్ర పోషించాడని మీకు తెలుసా? ఆయనే శ్రీహర్ష మాజేటి. స్విగ్గీ సీఈఓ గురించి, ఆయన గురించి మీకు తెలియని ఎన్నో వివరాలను ఇక్కడ చూసేయండి..
స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష..
‘స్విగ్గీ’.. భారత దేశంలో ఈ పేరు వినని వ్యక్తి బహుశా ఎవరూ ఉండకపోవచ్చు! ఒక విప్లవాత్మక ఆలోచనతో పుట్టుకొచ్చిన ఈ ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ఇప్పుడు దేశ నలుమూలలకు విస్తరించి సక్సెస్ఫుల్ బిజినెస్‌గా నడుస్తోంది. అయితే, స్విగ్గీ జర్నీలో ఓ ఆంధ్ర అబ్బాయి కీలక పాత్ర పోషించాడని మీకు తెలుసా? ఆయనే శ్రీహర్ష మాజేటి. స్విగ్గీ ఐపీఓ సబ్స్క్రిప్షన్, లిస్టింగ్ నేపథ్యంలో కంపెనీ కో-ఫౌండర్, సీఈఓ శ్రీహర్ష గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇక్కడ చూసేయండి..
స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మాజేటి..
ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన శ్రీహర్ష ప్రస్తుత వయస్సు 38ఏళ్లు. ఆయన తల్లి డాక్టర్ అని, తండ్రికి రెస్టారెంట్ వ్యాపారం ఉండేదని తెలుస్తోంది. శ్రీహర్ష మాజేటి 2008లో బిట్స్ పిలానీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేసి, భౌతిక శాస్త్రంలో మాస్టర్స్‌ను కూడా అభ్యసించారు. తరువాత సీఎఫ్ఏ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్నారు. కానీ అది తనకు సూట్ అవ్వడం లేదని తెలుసుకున్నారు. తరువాత ఆయన ఐఐఎం కోల్‌కతా నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. అక్కడ రిక్రూట్‌మెంట్ కోఆర్డినేటర్‌గానూ కూడా ఉన్నాడు.
నోమురా ఇంటర్నేషనల్‌లో అసోసియేట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు శ్రీహర్ష. లండన్‌లో ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత, తనకు ఇష్టమైన పని చేయాలని నిర్ణయించుకుని ఉద్యోగాన్ని విడిచిపెట్టారు.
“నేను పోర్చుగల్ నుంచి గ్రీస్‌కు 3 నెలల పాటు సైకిల్‌పై 3500 కిలోమీటర్లు ప్రయాణించాను. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్- హిచ్‌హైకింగ్ ద్వారా టర్కీ నుంచి కజాఖ్‌స్థాన్ వరకు ట్రావెల్ చేశాను. కెరీర్ స్విచ్ నుంచి కొంత దృక్పథాన్ని పొందడానికి, మనం నివసించే ప్రపంచం గురించి మరింత తెలుసుకోవడానికి సమయాన్ని ఉపయోగించడం ఇప్పటి వరకు నా అత్యంత ప్రతిఫలదాయకమైన నిర్ణయం," అని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష గతంలో తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో రాసుకున్నారు.
2013లో లాంచ్ అయిన బండల్ అనే కంపెనీకి శ్రీహర్ష సహ-స్థాపించారు. ఇది భారతదేశం అంతటా బహుళ కొరియర్ భాగస్వాములను సమీకరించడానికి, వారికి 1-స్టాప్ సెల్యూషన్ అందించడానికి, ఈ-కామర్స్ వ్యాపారులకు సహాయపడే శక్తివంతమైన కంపెనీగా మారింది.
స్విగ్గీని నిర్మిస్తూ, శ్రీహర్ష మార్కెట్‌ను లోతుగా విశ్లేషించారు. ప్రత్యేకమైన డెలివరీ సిస్టమ్ అవసరాన్ని గ్రహించారు.బండల్ని ఆన్-డిమాండ్ ఫుడ్ డెలివరీ సిస్టమ్‌గా రీబ్రాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా.. 2014లో దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ ప్లాట్‌ఫామ్‌గా స్విగ్గీ పుట్టుకొచ్చింది. బెంగళూరులోఒక చిన్న గదిలో ఆపరేషన్స్ జరిగేవి. 2014లోనే 12 నగరాల్లో స్విగ్గీ యాప్‌ని లాంచ్ చేశారు. అప్పటికి జొమాటో ఇంకా ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టలేదు. చాలా తక్కువ కాలంలోనే 9 రాష్ట్రాలు, 40 నగరాలకు స్విగ్గీ విస్తరించింది.
స్విగ్గీ సక్సెస్‌ని చూసి వెంచర్ క్యాపిటలిస్ట్‌లు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చారు. ఫలితంగా 2016 స్విగ్గీ అనేక రౌండ్స్ ద్వారా ఫండ్స్‌ని సమకూర్చుకోగలిగింది. ఇప్పుడు ఐపీఓగా స్విగ్గీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
అయితే, ఇక్కడ శ్రీహర్షతో పాటు మరో ఇద్దరు కో-ఫౌండర్స్ దూరదృష్టిని మెచ్చుకోవాలి. అసలు ఎలాంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌ని భారతీయులు కనీవినీ ఎరుగని కాలంలో వీరు రిస్క్ చేశారు. సంస్థను అంచెలంచెలుగా బిల్డ్ చేశారు. కడుపు నిండితేనే కస్టమర్ సంతృప్తి చెందుతాడని సర్వీస్ క్వాలిటీకి ఎప్పుడూ టాప్ ప్రయారిటీని ఇస్తూ సంస్థను ముందుకు తీసుకెళ్లారు. ఫలితంగా ఇప్పుడు ఇండియాలోనే అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా స్విగ్గీ నిలిచింది.
సొంతంగా వ్యాపారం చేద్దామని భావిస్తున్న వారందరికి స్విగ్గీ, శ్రీహర్ష జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం!