Skoda Cars : జనవరి నుంచి స్కోడా కార్లు కాస్త కాస్ట్‌లీ.. కానీ ఈ ఎస్‌యూవీకి మాత్రం ప్రత్యేక బెనిఫిట్
18 December 2024, 11:03 IST
Skoda Cars Price Hike : కొత్త ఏడాదిలో కొన్ని కార్ల కంపెనీలు తమ ఉత్పత్తులపై ధరలు పెంచుతున్నట్టుగా ప్రకటించాయి. ఈ లిస్టులో స్కోడా కారు కూడా చేరిపోయింది. స్కోడా తన వాహనాలపై 3 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టుగా తెలిపింది.
స్కోడా కైలాక్ కారు
స్కోడా ఆటో ఇండియా జనవరి 2025 నుండి తన వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచనుంది. దీంతో కుషాక్, స్లావియా, సూపర్బ్, కైలాక్ ధరలపై ప్రభావం పడనుంది. ఈ పెంపు ఎక్స్-షోరూమ్ ధరలకు వర్తిస్తుంది. ఈ పెరుగుదల ప్రభావం కంపెనీ కొత్త కైలాక్ మీద కొన్ని రోజులవరకు ఉండదు. కానీ కైలాక్ తీసుకునేవారికి ప్రత్యేక ప్రయోజనం లభిస్తుంది. దాని వివరాలు తెలుసుకుందాం.
కైలాక్ అనేది స్కోడా కొత్త సబ్ 4ఎమ్ ఎస్‌యూవీ. ఇది భారత మార్కెట్లో కంపెనీకి ప్రత్యేకమైనది. అధునాతన డిజైన్, సేఫ్టీ ఫీచర్లతో లాంచ్ అయిన ఈ కారు యువత, ఫ్యామిలీ కొనుగోలుదారుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్కోడా 2026 నాటికి 1 లక్ష కైలాక్ యూనిట్లను విక్రయించడం ద్వారా కొత్త మైలురాయిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే స్కోడా 3 శాతం ధరలు పెంచుతున్నట్టుగా ప్రకటించింది. కానీ స్కోడా కైలాక్ మీద మాత్రం దీని ప్రభావం మెుదట్టో ఉండదు. ఎందుకంటే 33,333 బుకింగ్స్ వరకు కైలాక్ ధరలో ఎలాంటి పెరుగుదల ఉండదు. అంటే ఈ నెంబర్ దాటిన తర్వాత పెరుగుదల ప్రభావం ఉంటుంది. భారత మార్కెట్లో కైలాక్ వేగంగా గుర్తింపు పొందేలా చూడటానికి స్కోడా మార్కెట్ వ్యూహంలో ఇది భాగం. ఈ చర్యతో కైలాక్ అమ్మకాలు పెంచాలని చూస్తోంది.
పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల కారణంగా స్కోడా ఈ నిర్ణయం తీసుకుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో ముడిసరుకులు, లాజిస్టిక్స్, తయారీ వ్యయం నిరంతరం పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలో కంపెనీలు తమ కార్యకలాపాలను స్థిరంగా ఉంచడానికి ధరలను పెంచాల్సి వస్తుంది.
గత రెండేళ్లలో చూస్తే.. స్కోడా భారత మార్కెట్లో 1 లక్ష వాహనాలను విక్రయించిన మైలురాయిని సాధించింది. స్కోడా దేశంలోని 150కి పైగా నగరాల్లో 260కి పైగా డీలర్ షిప్‌లతో నడుస్తోంది. దీంతో స్కోడా కస్టమర్లకు అందుబాటులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
కైలాక్ తన విభాగంలో సేఫ్టీ, ఆధునిక ఫీచర్ల కారణంగా బలమైన పోటీదారుగా ఎదుగుతోంది. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్(ఏడీఏఎస్), స్ట్రాంగ్ స్కోడా బాడీ ఉంటాయి. ముఖ్యంగా చిన్న సైజ్ కారులో కూడా సేఫ్టీ, స్టైల్ ఆశించే వారికి ఈ కారు ఎంతో నచ్చుతుంది.
టాపిక్