Rilox EV : సరుకులను తీసుకెళ్లేందుకు పొట్టి ఎలక్ట్రిక్ త్రీ వీలర్.. 500 కిలోలను ఈజీగా మోయగలదు!
02 December 2024, 9:30 IST
- Rilox EV : కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా రిలాక్స్ ఈవీ నుంచి పొట్టి త్రీ వీలర్ వచ్చింది. ఇది సరుకులను తీసుకెళ్లేందుకు బాగా పని చేస్తుంది.
ఎలక్ట్రిక్ త్రీ వీలర్
ఇండియాలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలలో రిలాక్స్(Rilox) ఈవీ ఒకటి. ఈ కంపెనీ ఇప్పుడు బిజిలీ ట్రియో అనే మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసింది. దీనిని కార్గో, భారీ వస్తువులను తీసుకెళ్లడంలో సహాయపడే వాహనంగా తయారు చేశారు. ప్రారంభ ధర రూ. 1.35 లక్షలుగా(ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు.
అయితే ఈ ధర రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. రిలాక్స్ ఈవీ ఈ వాహనాన్ని కేవలం సరుకులను తీసుకెళ్లేందుకు మాత్రమే కాకుండా డెలివరీ సేవలకు కూడా వాడుకోవచ్చు. వ్యక్తిగత ఉపయోగం కోసం ఇది పని చేయదు. ఈ వాహనంలో డ్రైవర్ సీటు మినహా ఇతర సీటింగ్ ఏర్పాటు లేదు. పట్టణ ప్రాంతాల్లో కార్గో హ్యాండ్లింగ్ సమస్యలను పరిష్కరించేందుకు రిలాక్స్ ఈవీ ఈ వాహనాన్ని తీసుకొచ్చింది. ఈ వాహనం 500 కిలోల బరువున్న వస్తువులను తీసుకెళ్లగలదు.
ఈ వాహనం ఫుల్ ఛార్జింగ్ తో 100 కి.మీ నుండి 120 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఈ వాహనంలో 3 KW ఎన్ఎంసీ రకం బ్యాటరీ ప్యాక్ వాడారు. 500 కిలోల బరువును లాగడానికి 1200W మోటార్‌తో అమర్చారు. ఇది IP67 సర్టిఫైడ్ మోటార్. ఇందులో అదనంగా 15 ట్యూబ్ సిన్ వేవ్ కంట్రోలర్, MCP (40 ఆంప్స్ రేట్) అమర్చారు.
టెలిస్కోపిక్ సస్పెన్షన్, రూమి బ్యాక్ కార్గో ఏరియా, మన్నికైన అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌ని ఉపయోగించారు. అందుకే 500 కిలోల బరువును ఎక్కువ సేపు మోసుకెళ్లినా ఈ వాహనానికి ఎలాంటి నష్టం వాటిల్లదని తెలుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు తమ డెలివరీ సేవల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం మెుదలుపెట్టాయి. రిలాక్స్ ఈవీ అలాంటి కంపెనీలకు ఉపయోగపడతాయి.