RBI MPC Meeting : యథాతథంగా వడ్డీ రేట్లు- 21వేల మార్క్‌ను తాకిన నిఫ్టీ..!
08 December 2023, 12:09 IST
- RBI MPC Meeting : వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. అయితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా పుంజుకోవాలని అభిప్రాయపడ్డారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
RBI MPC Meeting : వడ్డీ రేట్లను వరుసగా 5వసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మేరకు.. మొనేటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం ఓ ప్రకటన చేశారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. వడ్డీ రేట్లు.. 6.5శాతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
"కీలక వడ్డీ రేట్లను 6.5శాతం దగ్గరే ఉంచాలని మొనేటరీ పాలసీ మీటింగ్‌లో ఏకగ్రీవంగా అంగీకరించాము. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉంది. అప్పులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు వంటివి ఇందుకు కారణం," అని శక్తికాంత దాస్ అన్నారు.
RBI MPC Meeting live updates : 2024 ఆర్థిక ఏడాదికి సంబంధించి.. భారత దేశ వాస్తవ జీడీపీ అంచనాలను 6.5శాతం నుంచి 7శాతానికి పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. ఎఫ్వై25 క్యూ1 రియల్ జీడీపీ 6.7శాతంగా నమోదవుతుందని అంచనా వేశారు. అదే సమయంలో.. 2024 ఆర్థిక ఏడాదిలో ద్రవ్యోల్బణం 5.4శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు స్పష్టం చేశారు.
భారత దేశ ఆర్థిక వ్యవస్థ శక్తివంతంగానే ఉన్నప్పటికీ.. కోర్ ఇన్ఫ్లేషన్ అనేది కాస్త సమస్యగానే ఉందన్నారు శక్తికాంత దాస్.
యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్ పెంపు..
హాస్పిటల్స్, విద్యాసంస్థలకు చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ లిమిట్‌ని పెంచుతున్నట్టు శక్తికాంతదాస్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రూ. 1లక్ష లిమిట్‌ని రూ. 5లక్షలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
ద్రవ్యోల్బణం కారణంగా.. గతేడాది నుంచి వడ్డీ రేట్లను 2.5శాతం పెంచుతూ వచ్చింది ఆర్బీఐ. ఆ తర్వాత నుంచి వరుసగా ఐదోసారి.. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది.
RBI rate cuts : అమెరికా ఫెడ్‌తో పాటు అనేక దేశాల బ్యాంక్‌లు.. ఏడాది కాలంగా వడ్డీ రేట్లను పెంచాయి. ఇటీవలి కాలంలో వాటిని యథాతథంగా ఉంచుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియ మొదలైతే.. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా రేట్ కట్స్‌ని చూసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నిఫ్టీ ఆల్ టైమ్ హై..
మరోవైపు.. ఆర్బీఐ మొనేటరీ పాలసీ కమిటీ ప్రకటనతో నిఫ్టీ మరో ఆల్‌టైమ్ హైని తాకింది. ఉదయం 10:10 నిమిషాల సమయంలో 21వేల మార్క్‌ను టచ్ చేసింది.