Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖేల్ ఖతం! ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..
12 February 2024, 17:17 IST
- RBI governor on Paytm Payments bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకునే యోచనలో ఆర్బీఐ లేదని సంకేతాలిచ్చారు కేంద్ర బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్. ఆయన మాటలతో పేటీఎంకు ఎదురుదెబ్బ తగలొచ్చు!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖేల్ ఖతం! ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు..
Paytm Payments bank : సంక్షోభంలో కూరుకుపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఆ బ్యాంక్‌పై తాము విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదని తేల్చిచెప్పేశారు! తాము ఏం నిర్ణయం తీసుకున్నా.. ముందు, వెనుక ఆలోచించే అమలు చేస్తామని స్పష్టం చేశారు.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖేల్ ఖతం..!
కొన్ని రోజుల క్రితం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై కఠిన నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ. ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్లను తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇది.. యావత్ ఫిన్‌టెక్ సెక్టార్‌నే కుదిపేసింది. అప్పటి నుంచి బ్యాంక్‌ని కస్టమర్లు, ఉద్యోగులు వదిలేసి వెళ్లిపోతున్నారు. పేటీఎం పనితీరుపై సర్వత్రా గందరగోళం నెలకొంది. పేటీఎం షేర్లు దారుణంగా పతనమయ్యాయి. పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ.. పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Paytm Payments bank latest news : ఈ పరిస్థితుల నేపథ్యంలో.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని ఆర్బీఐ శక్తికాంత దాస్ సంకేతాలివ్వడం చర్చలకు దారితీసింది. దిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"పరిస్థితులను పూర్తింగా పరిశీలించి, దర్యాప్తు చేపట్టిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాము. ఫిన్‌టెక్ సెక్టార్‌కి మేము మద్దతిస్తాము. కానీ కస్టమర్ల భద్రత, ప్రయోజనాలు కూడా మాకు ముఖ్యమే. ఫైనాన్షియల్ స్టెబులిటీ మాకు చాలా ముఖ్యం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకోవడం జరగకపోవచ్చు," అని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు.
పేటీఎం వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని.. త్వరలోనే ఎఫ్ఏక్యూ (తరచూ అడిగే ప్రశ్నలు)లను విడుదల చేసేందుకు ఆర్బీఐ ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం.
Paytm Payments bank RBI : "ముందు మేము నోటిసులు ఇస్తాము. తప్పులను సరిచేసుకునేందుకు సమయాన్ని ఇస్తాము. అప్పటివరకు అంతా సద్దుకుంటే.. మేము ఇంకా చర్యలు ఎందుకు తీసుకుంటాము? పేటీఎం వ్యవహారంలో ఒక విషయం చెబుతాను. ఫిన్‌టెక్ సిస్టెమ్ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క సంస్థకు చెందిన సమస్య మాత్రమే," అని కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించారు శక్తికాంత దాస్.
Paytm share price : ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎంపై భారీ ప్రతికూల ప్రభావమే పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. యూజర్లు ఇప్పటికే పేటీఎంని క్విట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. 2021లో ఐపీఓగా వచ్చిన సమయంలో ఈ సంస్థ రైజ్ చేసిన రూ. 2వేల కోట్లు.. ఇప్పుడు ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.