Paytm Crisis : ఆర్థికశాఖ తలుపు తట్టిన పేటీఎం సీఈవో - దొరకని ఉపశమనం...!
Paytm crisis Updates :పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.ఆర్‌బీఐ విధించిన ఆంక్షల అంశాన్ని ప్రస్తావించగా… కేంద్రమంత్రి జోక్యం చేసుకోలేమని చెప్పినట్లు తెలిసింది.
Paytm Crisis Updates: పేటీఎంపై భారత రిజర్వు బ్యాంక్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. తాజా సంక్షోభం నేపథ్యంలో పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ మంగళవారం ఆర్థికశాఖ తలుపు తట్టారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై… తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశం సందర్భంగా… కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు లైవ్ మింట్ పేర్కొంది. ఆర్‌బీఐ విధించిన ఆంక్షల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసినట్లు రాసుకొచ్చింది.
ఇక పేటీఎం ఎదుర్కొంటున్న సంక్షోభం నేపథ్యంలో… మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులను ఆ కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ కలిసినట్లు సమాచారం. మనీ కంట్రోల్ కథనం ప్రకారం…. వినియోగదారుల ఖాతాలను ఇతర బ్యాంకులకు తరలించడం, ఫిబ్రవరి 29 తర్వాత గడువు పొడిగింపుతో పాటు ఎటువంటి రాయితీని మంజూరు చేయడానికి ఆర్బీఐ నిరాకరించినట్లు ప్రస్తావించింది.
వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించింది. ప్రీ పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా అప్పటి నుంచి చేయకూడదని పేర్కొంది.
పేటీఎం సంస్థ సంక్షోభం ఎదుర్కొటున్న నేపథ్యంలో…. పలు స్టార్టప్‌లు ప్రధాని నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్ తో పాటు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు లేఖలు రాశాయి. ఆర్బీఐ ఆంక్షల నిర్ణయం పేటీఎం వ్యవహారాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నాయి. వినియోగదారులపై కూడా ఈ ప్రభావం ఉంటుందని… వ్యాపారులు, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్బీఐ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తెలిపాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ తీసుకున్న చర్యలు, పెట్టిన ఆంక్షలు యావత్తు ఫిన్‌టెక్ ఎకోసిస్టమ్‌ను కలవరపర్చే విధంగా ఉన్నాయని ఆందోళనను వ్యక్తం చేశాయి.
ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం ఫాస్టాగ్ పనిచేస్తుందా?
ఫిబ్రవరి 29 తర్వాత.. ఈ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్.. ఇక ఎలాంటి డిపాజిట్లను స్వీకరించలేదనే వార్తలతో.. పేటీఎం యూజర్లలో ఆందోళన మొదలైంది. మరీ ముఖ్యంగా.. పేటీఎం ఫాస్టాగ్ విషయంలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో.. మీ ప్రశ్నలకు సమాధానాలను ఇక్కడ తెలుసుకోండి..
ఫిబ్రవరి 29 తర్వాత కూడా పేటీఎం ఫాస్టాగ్ పనిచేస్తుంది. కానీ అందులో మీరు డబ్బులను యాడ్ చేసుకోలేరు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించడమే ఇందుకు కారణం. ఫలితంగా.. పేటీఎం ఫాస్టాగ్‌ని మీరు టాప్-అప్ చేసుకోలేరు. వాలెట్లో డబ్బులు అయిపోతే ఇక కష్టమే! ఫిబ్రవరి 29లోపు ఆర్బీఐ.. తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. ఇక అంతే. పేటీఎం ఫాస్టాగ్ మాత్రమే కాదు. ఏ ఫాస్టాగ్‌ని కూడా పోర్ట్ చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఇండియాలో లేదు. ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్‌కు పోర్ట్ చేసుకోలేము. వాలిడ్ ఫాస్టాగ్ లేకపోతే.. ఇతర బ్యాంక్‌లలో కొత్తది తీసుకోవాల్సిందే! ప్రస్తుతానికైతే.. ఆర్బీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు చాలా తక్కువే అని తెలుస్తోంది. అంటే.. మార్చ్ నుంచి సరైన బ్యాలెన్స్ లేకపోతే, మీ పేటీఎం ఫాస్టాగ్స్ పనిచేయకపోవచ్చు! వేరే బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ కొనుక్కోవడం బెటర్!
సంబంధిత కథనం