RBI bars Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ నిషేధం
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై ఆర్బీఐ పరిమితులను విధించింది. ఫిబ్రవరి 29 తరువాత పేటీఎంకు సంబంధించిన కొన్ని కార్యకాలాపాలను అంగీకరించబోమని తెలిపింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం నిషేధం విధించింది. ఫిబ్రవరి 29వ తేదీ తరువాత కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, NCMC కార్డ్‌లు మొదలైన వాటిలో డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్ అప్‌లు అనుమతించబోమని ఆర్బీఐ స్పష్టం చేసింది. కస్టమర్ల ఖాతాల్లో జమచేసే ఏవైనా వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు లేదా రీఫండ్‌లకు మాత్రం అనుమతిస్తామని తెలిపింది.
నిబంధనల ఉల్లంఘనలు
సమగ్ర సిస్టమ్ ఆడిట్ నివేదిక, ఆ తరువాత ఎక్స్ టర్నల్ ఆడిటర్‌ల ధ్రువీకరణ నివేదిక అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంక్ లో పలు అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని ఈ నివేదిక వెల్లడించిందని తెలిపింది. అందువల్ల పేటీఎం బ్యాంక్ కార్యకలాపాలపై పర్యవేక్షణ అవసరమని భావించామని తెలిపింది.
ఇవి అనుమతిస్తారు..
అయితే, పేటీఎం (paytm) లోని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లతో సహా తమ ఖాతాల నుండి తమ ఖాతాదారుల బ్యాలెన్స్‌లను ఉపసంహరించుకోవడం లేదా ఉపయోగించడం వంటివి ఎటువంటి పరిమితులు లేకుండా, అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ వరకు అనుమతించబడతాయని ఆర్బీఐ తెలిపింది. కాగా, 2022 మార్చిలో కూడా కొత్త కస్టమర్లను చేర్చుకోవడం తక్షణమే నిలిపివేయాలని ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) ను ఆదేశించింది.