PM Mudra Yojana Loans: చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.20 లక్షల వరకు రుణాలు-పీఎం ముద్ర యోజన దరఖాస్తు విధానం ఇలా
14 August 2024, 13:56 IST
- PM Mudra Yojana Loans : చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు కేంద్రం పీఎం ముద్ర యోజన పథకం కింద రూ.50 వేలు నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల ద్వారా రూ.20 లక్షల రుణాలు పొందవచ్చు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు వడ్డీ రేట్లు నిర్ణయిస్తాయి.
చిరు వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్, రూ.20 లక్షల వరకు రుణాలు-పీఎం ముద్ర యోజన దరఖాస్తు విధానం ఇలా
PM Mudra Yojana Loans : చిరు వ్యాపారులు, సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు రుణాలు అందించాలనే లక్ష్యంతో 2015 ఏప్రిల్ 8న ప్రధాని మోదీ ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రూ.20 లక్షల వరకు మైక్రో క్రెడిట్/లోన్‌ను అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. పౌల్ట్రీ, డైరీ, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో పాటు తయారీ, వ్యాపారం లేదా సేవా రంగాలలోని సూక్ష్మ సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు ఇస్తారు. మొదట్లో ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వ్యక్తులు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు లోన్ పొందేవారు. 2024-25 బడ్జెట్‌లో ఈ లోన్ పరిమితిని కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ముద్ర యోజన పథకం కింద రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు ఇస్తున్నారు.
సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు, చిన్న తయారీ యూనిట్లు, సేవా రంగ యూనిట్లు, దుకాణాలు, పండ్లు / కూరగాయాల షాపులు, ట్రక్ ఆపరేటర్లు, ఆహార-సేవ యూనిట్లు, మరమ్మతు దుకాణాలు, మెషిన్ ఆపరేటర్లు, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులవారు, ఆహార సంస్థలు ఈ పథకం కింద లోన్లు పొందవచ్చు. అర్హులకు ప్రభుత్వ, ప్రైవేట్, సహకార, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల నుంచి రుణాలు అందిస్తారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం వడ్డీ రేట్లను బ్యాంకులు నిర్ణయిస్తాయి. శిశు రుణాలకు 1%-12% వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. ఆర్ఆర్బీ, ఎస్సీబీలు 3.5 శాతం, ఎన్బీఎఫ్సీలు 6 శాతానికి రుణాలు అందిస్తున్నాయి. కిషోర్ రుణాల వడ్డీ శాతం 8.6 నుంచి ప్రారంభం అవుతుంది. తరుణ్ రుణాలకు 11.15%-20% వరకు వడ్డీ రేట్లు ఉంటాయి.
శిశు, కిషోర్, తరుణ్ లోన్లు
ఈ పథకంలో మూడు రకాల లోన్లు అందజేస్తున్నారు. అవి శిశు, కిషోర్, తరుణ్ లోన్లు. శిశు విభాగంలో దరఖాస్తుదారులు రూ.50 వేల వరకు లోన్ పొందవచ్చు. కిషోర్ విభాగంలో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు, తరుణ్ విభాగంలో రూ. 5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు పొందవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తు విధానం
- Step 01 : PMMY(https://mudra.org.in/ ) లోన్ దరఖాస్తు కోసం ముందుగా ఉద్యమమిత్ర పోర్టల్ https://www.udyamimitra.in/ పై క్లిక్ చేయండి.
- Step 02 : ముద్ర లోన్ అప్లై క్లిక్ చేయండి.
- Step 03 : న్యూ రిజిస్ట్రేషన్ దరఖాస్తుదారుడి పేరు, ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. మీ మొబైల్ నంబర్ కు OTP వస్తుంది.
- Step 0 4 : మీ వ్యక్తిగత వివరాలు, వృత్తి, వ్యాపారపరమైన వివరాలను నమోదు చేయండి.
- Step 05 : ప్రాజెక్ట్ ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి హ్యాండ్ హోల్డింగ్ ఏజెన్సీలను ఎంచుకోండి లేదా "లోన్ అప్లికేషన్ సెంటర్"ని క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
- Step 06 : మీకు ఏ విభగంలో రుణం కావాలో ఎంచుకోండి - ముద్ర శిశు / ముద్ర కిషోర్ / ముద్ర తరుణ్.
- Step 07 : దరఖాస్తుదారుడి వ్యాపారం పేరు, కార్యకలాపాలు ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి. తయారీ, సేవ, వ్యాపారం లేదా వ్యవసాయ అనుబంధంగా ఉన్న కార్యకలాపాలను ఎంచుకోవాలి.
- Step 08: దరఖాస్తుదారుడి వివరాలు, బ్యాంకింగ్/క్రెడిట్ వివరాలు ఇతర సమాచారాన్ని అందించాలి.
- Step 09 : అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అటాచ్ చేయండి. అంటే గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, దరఖాస్తుదారుడి ఫొటో, సంతకం, బిజినెస్ ఎంటర్‌ప్రైజ్ చిరునామా మొదలైనవి.
- Step 10 : అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. దీనిని భవిష్యత్తు సూచన కోసం భద్రపరుచుకోవాలి.
శిశు లోన్ కోసం అవసరమయ్యే పత్రాలు
- గుర్తింపు కార్డులు - ప్రభుత్వం జారీ చేసిన ఓటర్ ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్ / పాన్ కార్డ్ / ఆధార్ కార్డ్ / పాస్‌పోర్ట్ / ఫొటో ఐడీ కాపీలు
- నివాస రుజువు : ఇటీవలి టెలిఫోన్ బిల్లు / విద్యుత్ బిల్లు / ఆస్తి పన్ను రసీదు (2 నెలల కంటే పాతది కాకుండా) / ఓటరు ఐడీ/ ఆధార్ కార్డు /పాస్‌పోర్టు/ బ్యాంక్ పాస్‌బుక్ లేదా బ్యాంక్ తాజా ఖాతా స్టేట్‌మెంట్
- ఇటీవల దిగిన రంగు పాస్ పోర్టు సైజు ఫొటోలు (2 కాపీలు)
- కొనుగోలు చేయవలసిన యంత్రాలు / ఇతర వస్తువుల కొటేషన్
- వ్యాపార సంస్థ గుర్తింపు కార్డు/ చిరునామా – సంబంధిత లైసెన్స్‌లు / రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు / యాజమాన్యానికి సంబంధించిన ఇతర పత్రాలు, వ్యాపార యూనిట్ అడ్రస్
కిషోర్, తరుణ్ లోన్ కోసం అవసరమయ్యే పత్రాలు
- గుర్తింపు కార్డులు - ఓటరు ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్ / పాన్ కార్డు / ఆధార్ కార్డు / పాస్‌పోర్ట్
- నివాస రుజువు - ఇటీవలి టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను రసీదు (2 నెలల కంటే పాతది కాకుండా), ఓటరు ఐటీ, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు
- 2 పాస్ పోర్టు సైజు ఫొటోలు
- వ్యాపార సంస్థ గుర్తింపు/చిరునామా రుజువులు, సంబంధిత లైసెన్స్‌లు/రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు/ఇతర పత్రాలు
- దరఖాస్తుదారుడు ఏ బ్యాంకు/ఆర్థిక సంస్థలో డిఫాల్టర్‌గా ఉండకూడదు.
- గత ఆరు నెలల అకౌంట్ స్టేట్‌మెంట్
- ఆదాయపు పన్ను/సేల్స్ ట్యాక్స్ రిటర్న్స్, గత రెండు సంవత్సరాల బ్యాలెన్స్ షీట్‌లు (రూ. 2 లక్షలు, అంతకంటే ఎక్కువ రుణాలు)
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వివరాలు
- ప్రాజెక్ట్ నివేదిక, సాంకేతిక, ఆర్థిక వివరాలు