PM Mudra Yojana | ముద్ర యోజన రుణం ఎంతిస్తారు? ఎలా పొందాలి? ఎవరు అర్హులు?-how to get loan from mudra yojana and its limitations ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Mudra Yojana | ముద్ర యోజన రుణం ఎంతిస్తారు? ఎలా పొందాలి? ఎవరు అర్హులు?

PM Mudra Yojana | ముద్ర యోజన రుణం ఎంతిస్తారు? ఎలా పొందాలి? ఎవరు అర్హులు?

Praveen Kumar Lenkala HT Telugu
Jan 03, 2022 08:01 PM IST

PM Mudra Yojana.. ప్రధాన మంత్రి ముద్ర యోజన : ష్యూరిటీ లేకుండా రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి ముద్ర యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ముద్ర అంటే మైక్రో యూనిట్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీఫైనాన్స్‌ ఏజెన్సీ లిమిటెడ్‌ అనే పథకానికి సంక్షిప్త రూపం.

ప్రతీకాత్మక చిత్రం: చిరు వ్యాపారాలకు ముద్ర లోన్
ప్రతీకాత్మక చిత్రం: చిరు వ్యాపారాలకు ముద్ర లోన్ (unsplash)

ముద్ర అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్‌. మైక్రో యూనిట్స్, ఎంటర్‌ప్రైజెస్‌ కోసం రుణాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన సంస్థ ఇది.

బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల ద్వారా రుణాలు ఇచ్చేలా ఈ సంస్థ ఏర్పాటైంది.

ముద్ర యోజన ద్వారా ఏయే రకాల రుణాలు ఇస్తారు?

ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) ద్వారా శిశు, కిశోర్, తరుణ్‌ పేరుతో మూడు రకాల పథకాలు ఉన్నాయి. యూనిట్‌ స్థాయి, దశను బట్టి వీటిని మంజూరు చేస్తారు.

శిశు స్కీమ్‌ అయితే రూ. 50 వేల వరకు రుణం ఇస్తారు. కిశోర్‌ స్కీమ్‌ ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు రుణం ఇస్తారు. తరుణ్‌ స్కీమ్‌ అయితే రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం ఇస్తారు.

PMMY రుణం ఎవరెవరికి ఇస్తారు?

నాన్‌ – కార్పొరేట్‌ స్మాల్‌ బిజినెస్‌ సెగ్మెంట్‌ (ఎన్‌సీఎస్‌బీ) పరిధిలోని వారందరికీ ఇస్తారు. అంటే చిన్న చిన్న మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్స్, సర్వీస్‌ సెక్టార్‌ యూనిట్స్, షాప్‌లు నిర్వహించేవారు, పండ్లు, కూరగాయలు అమ్మేవారు, ట్రక్‌ ఆపరేటర్లు, ఫుడ్‌ సర్వీస్‌ యూనిట్లు, రిపేర్‌ షాపులు, మెషీన్‌ ఆపరేటర్లు, చిన్న పరిశ్రమలు, చేతివృత్తుల వారు, ఫుడ్‌ ప్రాసెసర్స్‌ ఇతరులు.

గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నా, పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నా అర్హులే. ఏ తరహా బిజినెస్‌ చేస్తున్నారన్న దానిని బట్టి రుణం రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు మంజూరవుతుంది.

PMMY రుణం తీసుకోవాలంటే ఏ అర్హతలు ఉండాలి?

భారతదేశ పౌరుడు అయి ఉండి, వ్యవసాయేతర ఆదాయం సృష్టించగలిగే యాక్టివిటీ.. అంటే తయారీ రంగం, ప్రాసెసింగ్, ట్రేడింగ్, సర్వీస్‌ సెక్టార్‌ వంటి రంగాల్లో నెలకొల్పే యూనిట్లకు ఇస్తారు. అలాగే ఆయా బ్యాంకులు నిర్దేశించే ఇతర నిబంధనలు కూడా అనుసరించాల్సి ఉంటుంది.

ఏయే బ్యాంకులు PMMY రుణం అందిస్తాయి?

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, ప్రయివేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్స్, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు ఈ ముద్ర రుణాలు మంజూరు చేస్తాయి.

సబ్సిడీ ఏమైనా ఉంటుందా?

ముద్ర యోజన రుణాలకు సబ్సిడీ ఉండదు. అయితే ఈ రుణ మొత్తం ఏదైనా ప్రభుత్వ స్కీమ్‌కు లింక్‌ చేసిన సందర్భంలో ప్రభుత్వం దానిలో క్యాపిటల్‌ సబ్సిడీ ఇస్తే పీఎంఎంవైకి కూడా వర్తిస్తుంది.

ఒకవేళ బ్యాంకు మంజూరు చేయనిపక్షంలో..

బ్యాంకులు ముద్ర రుణం మంజూరు చేయనిపక్షంలో ఆ బ్యాంకు ఉన్నతాధికారులు.. అంటే రీజనల్‌ మేనేజర్, జోనల్‌ మేనేజర్‌లను సంప్రదించవచ్చు.

PMMY దరఖాస్తులు ఎక్కడ లభిస్తాయి?

దరఖాస్తులు ముద్ర అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తాయి. శిశు కేటగిరీకి అయితే దరఖాస్తు ఒక పేజీ మాత్రమే ఉంటుంది. కిశోర్, తరుణ్‌ కేటగిరీ దరఖాస్తులు మూడు పేజీలు ఉంటాయి.

వడ్డీ రేట్లు ఎంత ఉంటాయి?

ముద్ర యోజన కింద ఇచ్చే రుణాలకు నిర్ధిష్ట వడ్డీ రేటు ఉండదు. రీజనబుల్‌ వడ్డీ రేట్లు ఉండాలని ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ సూచిస్తున్నాయి.

ముద్ర లోన్‌ రీపేమెంట్‌ ఎప్పుడు చేయాలి.

లోన్‌ రీపేమెంట్‌ ఎప్పుడు చేయాలన్నది బ్యాంకు నిర్దేశిస్తుంది. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌కు లోబడి బ్యాంకు నిబంధనలు ఉంటాయి.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం