PMEGP Scheme : 35 శాతం సబ్సిడీతో రూ.25 లక్షల వరకు రుణాలు-కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి కేంద్రం గుడ్ న్యూస్-pmegp scheme eligibility application process loan and subsidy details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Pmegp Scheme : 35 శాతం సబ్సిడీతో రూ.25 లక్షల వరకు రుణాలు-కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి కేంద్రం గుడ్ న్యూస్

PMEGP Scheme : 35 శాతం సబ్సిడీతో రూ.25 లక్షల వరకు రుణాలు-కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి కేంద్రం గుడ్ న్యూస్

Bandaru Satyaprasad HT Telugu
Aug 11, 2024 01:57 PM IST

PMEGP Scheme : చేతి వృత్తి వారు, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంఈజీపీ స్కీమ్ అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు 15-35% సబ్సిడీపై రుణాలు అందిస్తున్నారు. తయారీ, సేవలు లేదా వ్యాపార రంగాల్లో స్వయం ఉపాధికి ఈ రుణాలు ఇస్తారు.

 35 శాతం సబ్సిడీతో రూ.25 లక్షల వరకు రుణాలు-కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి కేంద్రం గుడ్ న్యూస్
35 శాతం సబ్సిడీతో రూ.25 లక్షల వరకు రుణాలు-కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి కేంద్రం గుడ్ న్యూస్

PMEGP Scheme : ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బ్యాంకుల నుంచి సబ్సిడీకి రుణాలు అందిస్తారు. ప్రధానమంత్రి రోజ్‌గర్ యోజన (PMRY), గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం (REGP) ఈ రెండు పథకాలను కలిపి ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు. వ్యవసాయేతర రంగంలోని సూక్ష్మ వ్యాపార సంస్థల ద్వారా నిరుద్యోగ యువత, చేతివృత్తుల వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

ఈ పథకానికి ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఈ పథకంలో 15 శాతం నుంచి 35 శాతం సబ్సిడీతో రూ. 5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు లోన్లు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కేవీఐసీ డైరెక్టరేట్లు, జిల్లా పరిశ్రమల కేంద్రాలు, రాష్ట్ర ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డులు...బ్యాంకుల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద KVIC ప్రభుత్వ రాయితీతోని బ్యాంకుల లబ్దిదారులకు రుణాలు అందిస్తారు.

అర్హతలు

18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. స్వయం ఉపాధి ప్రాజెక్టులను బట్టి కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలి. ప్రాజెక్టు విలువ తయారీ రంగంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ, బిజినెస్ లేదా సేవా రంగంలో రూ. 5 లక్షలు కంటే ఎక్కువ ఉండాలి. ఈ పథకాన్ని కొత్త ప్రాజెక్టుల మంజూరు కోసం పరిగణిస్తారు. స్వయం సహాయక బృందాలు(SHG), సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం-1860 కింద నమోదైన సంస్థలు, ఉత్పత్తి ఆధారిత సహకార సంఘాలు, ఛారిటబుల్ ట్రస్ట్‌లు అర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏదైనా ఇతర పథకాల కింద ఇప్పటికే ప్రభుత్వ సబ్సిడీని పొందిన యూనిట్లు అనర్హులు.

మాన్యుఫాక్చరింగ్ రంగంలో ప్రాజెక్ట్ లేదా యూనిట్ గరిష్ట వ్యయం రూ.25 లక్షలు, బిజినెస్ లేదా సేవా రంగంలో గరిష్టంగా రూ.10 లక్షలు వరకు రుణాలు పొందవచ్చు. జనరల్ కేటగిరీ లబ్ధిదారులకు పట్టణ ప్రాంతాల్లో 15%, గ్రామీణ ప్రాంతాల్లో 25% సబ్సిడీ రుణాలు ఇస్తారు. ఇతర కేటగిరీ లబ్ధిదారులకు(ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఇతరలు) పట్టణ ప్రాంతాల్లో 25%, గ్రామీణ ప్రాంతాల్లో 35% సబ్సిడీకి రుణాలు అందిస్తారు.

PMEGP లోన్ దరఖాస్తుకు అవసరమయ్యే పత్రాలు

  • ఆధార్ కార్డు
  • పాన్ కార్డు
  • దరఖాస్తు ఫారమ్
  • నివాస ధృవీకరణ పత్రం
  • 8వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్
  • ప్రాజెక్ట్ రిపోర్ట్
  • బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు అవసరమైన అదనపు పత్రాలు
  • ఎంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ సర్టిఫికెట్
  • మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ID
  • పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు

PMEGP దరఖాస్తు విధానం

1. అర్హత- దరఖాస్తు చేయడానికి ముందు, ప్రభుత్వ పథకాల పోర్టల్ జన్ సమర్థ్ పోర్టల్‌ని ఉపయోగించి మీ అర్హతను ధృవీకరించండి. PMEGP లోన్ కోసం మీ అర్హతను అంచనా వేయడానికి వ్యాపారం, విద్యా అర్హతలు వంటి ప్రాథమిక వివరాలను ఇందులో నమోదు చేయండి.

2. ప్రాజెక్ట్ ఖర్చు, లోన్ అంచనా వేయండి - మీ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు, దానికి మీరు ఎంత సహాకారం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మీ మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ.25 లక్షలు అయితే, మీరు రూ.10 లక్షలు ఏర్పాటు చేసుకోగలగితే ఆ వివరాలు ముందుగా నమోదు చేసుకోండి.

3. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ- PMEGP లోన్ కోసం దరఖాస్తుకు ప్రభుత్వ పోర్టల్‌ https://www.kviconline.gov.in/pmegpeportal పై క్లిక్ చేయండి.

-ముందుగా "Application For New Unit" పై క్లిక్ చేసి మీ ఆధార్ వివరాలను నమోదు చేయండి.

- వ్యక్తిగత, వ్యాపార సమాచారాన్ని నమోదు చేయండి.

-స్పాన్సరింగ్ ఏజెన్సీని ఎంచుకోండి -KVIC, KVIB లేదా DIC

- మీ అడ్రస్ పూరించండి

- మీ ప్రాథమిక వివరాలను రిజిస్టర్ చేయండి

- మీ వ్యాపారం మాన్యుఫాక్చరింగ్, సర్వీస్ లేదా బిజినెస్ ఎంపిక చేయండి.

- మీరు ఏ రకమైన ఉత్పత్తులను తయారు చేస్తారో లేదా విక్రయిస్తారో తెలియజేయాలి.

4. శిక్షణ - మీ లోన్ మంజూరైన తర్వాత ఎంటర్‌ప్రెన్యూరియల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (EDP) శిక్షణకు తప్పనిసరిగా హాజరవ్వాలి. ఈ శిక్షణ మీ వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. మీ ప్రాజెక్ట్ ధర రూ.2 లక్షల కంటే తక్కువగా ఉంటే ఈడీపీ శిక్షణ అవసరం లేదు.

5. వ్యాపార ఖర్చులు, బ్యాంక్ వివరాలను నమోదు చేయండి.

6. వివరాలన్నీ పూర్తి చేసి దరఖాస్తును సబ్మిట్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ భద్రపరుచుకోండి. పాస్‌పోర్ట్ ఫొటోలు, ప్రాజెక్ట్ రిపోర్ట్, సర్టిఫికేట్‌లతో సహా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

7. స్కోరింగ్ ప్రక్రియ - మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, ఇంటి యాజమాన్యం, అర్హతలు, అనుభవం వంటి అంశాలు దరఖాస్తులో నమోదు చేయండి. 60 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌ను సాధించడం అప్లికేషన్ ఆమోదం పొందే అవకాశాలు పెరుగుతాయి.

8. అప్లికేషన్ ఆమోదం, తదుపరి దశలు - మీ దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత...వివరాలు సమీపంలోని KVIB లేదా మరొక ఏజెన్సీకి ఫార్వార్డ్ చేస్తారు. మీ ఖాతాకు నిధులు పంపిణీ చేయడానికి ముందు మీరు ఈడీపీ శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంబంధిత కథనం