Budget 2024 PMAY : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి 10 లక్షల కోట్లు.. ఈసారైనా లక్ష్యం నెరవేరుతుందా?
Budget 2024 PMAY Allocation : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేశారు. రూ.10 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టుగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాలకు గృహనిర్మాణంపై దృష్టి సారించి రూ. 10 లక్షల కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్ 2.0 కింద ఒక కోటి పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాల గృహ అవసరాలకు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడితో పరిష్కరిస్తాం.' అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్లను కొనుగోలు చేయడంలో సహాయపడుతుంది. అంటే ప్రభుత్వం మీకు భారీగా గృహ రుణ రాయితీలు ఇస్తోంది. తక్కువ ఆదాయం ఉన్నవారు, పట్టణ పేదలు, గ్రామీణ పేదలకు సరసమైన గృహాలను అందించాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించారు.
అందరికీ గృహాలను అందించాలనే లక్ష్యంతో వడ్డీ రాయితీని కూడా అందించాలని యోచిస్తున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు గృహాలను ప్రకటించారు. అందుకు అవసరమైన కేటాయింపులు జరుగుతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ఒకటి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కార్యక్రమం కింద కోటి మంది పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాల గృహ అవసరాలకు రూ. 10 లక్షల కోట్లు కేటాయించారు.
2015లో ఈ పథకం ప్రారంభించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదు. ప్రభుత్వం ప్రకారం PMAY పథకం (PMAY-U) కింద 118.64 లక్షల గృహాలు మంజూరు చేసింది. ఇప్పటివరకు 85.04 లక్షల గృహాలను పూర్తి చేసి ప్రజలకు అప్పగించారు. ప్రభుత్వం 2016లో PMAY-గ్రామ్ (PMAY-G) పథకాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యంతో గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, మార్చి 2024 నాటికి 2.95 కోట్ల ఇళ్లు నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2024 ఫిబ్రవరి నాటికి 2.94 కోట్ల ఇళ్లు మంజూరు చేశామని, అందులో 2.55 కోట్ల ఇళ్లను 2024 ఫిబ్రవరి నాటికి పూర్తి చేశామని తెలిపింది.
దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల అదనపు ఇళ్ళు ప్రకటించారు. దీనికి అవసరమైన కేటాయింపులు జరుగుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.