తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Paytm Payments Bank: పేటీఎంకు మరో షాక్; పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు రూ. 5.49 కోట్ల జరిమానా

Paytm Payments Bank: పేటీఎంకు మరో షాక్; పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు రూ. 5.49 కోట్ల జరిమానా

HT Telugu Desk HT Telugu

01 March 2024, 20:01 IST

  • Paytm Payments Bank: డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ పేటీఎం వరుస షాక్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా, పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ రూ.5.49 కోట్ల జరిమానా విధించింది. మనీ లాండరింగ్ కు పాల్పడిన నేరానికి గానూ ఆ బ్యాంక్ కు ఈ శిక్ష విధించింది.

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ (Bloomberg)

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ

Paytm Payments Bank: మనీ లాండరింగ్ కు పాల్పడిన నేరానికి గానూ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ శుక్రవారం రూ.5.49 కోట్ల జరిమానా విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నాటి నుంచి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో మార్చి 15 తరువాత ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపకూడదని జనవరి 31 ఆర్బీఐ నిషేధం విధించింది. కాగా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తో తమకు ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు పేటీఎం యాజమాన్య సంస్థ వన్ 97 శుక్రవారం ప్రకటించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం.. రెండూ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మనీ లాండరింగ్

పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న సంస్థలు ఈ మొత్తాన్ని అక్రమ పద్ధతుల్లో మళ్లించాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆన్ లైన్ జూదాన్ని నిర్వహించడం సహా అనేక చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన కొన్ని సంస్థలకు, వాటి వ్యాపారాల నెట్ వర్క్ కు సంబంధించి వచ్చిన విశ్వసనీయ సమాచారంతో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలపై దృష్టి పెట్టింది.

ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకటన

‘‘ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా (ఎఫ్ఐయూ-ఐఎన్డీ),... పిఎంఎల్ఎ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) ఉల్లంఘనలకు సంబంధించి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పై ఫిబ్రవరి 15వ తేదీన రూ .5.49 కోట్ల జరిమానా విధించింది’’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ పదవికి విజయ్ శేఖర్ శర్మ ఫిబ్రవరి 27న రాజీనామా చేశారు.

తదుపరి వ్యాసం