Paytm: ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం మరో కీలక నిర్ణయం; ఆ బ్యాంక్ తో తెగతెంపులు
Paytm Payments Bank: సంక్షోభంలో పడిన డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ పేటీఎం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన భాగస్వామ్య సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తో సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తో ఉన్న అన్ని ఇంటర్-కంపెనీ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
Paytm crisis: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తో అన్ని ఇంటర్-కంపెనీ ఒప్పందాలను నిలిపివేయాలని సంస్థ బోర్డు నిర్ణయించినట్లు పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ శుక్రవారం తెలిపింది. పేమెంట్స్ బ్యాంకుపై ఇటీవల ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్బీఐ ఆంక్షలు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) ఆర్థిక లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పీపీబీఎల్ లో అన్ని క్రెడిట్ లావాదేవీలు, డిపాజిట్లను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. అందుకు మార్చి 15 వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) పై ఆధార పడడాన్ని తగ్గించుకోవాలని పేటీఎం (Paytm) నిర్ణయించుకుంది. అందులో భాగంగానే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తో అన్ని ఇంటర్-కంపెనీ ఒప్పందాలను రద్దు చేసుకుంది.
పరస్పర అంగీకారంతో..
డిపెండెన్సీలను తగ్గించే ఉద్దేశంలో భాగంగా పేటీఎం, దాని గ్రూప్ సంస్థలతో వివిధ ఇంటర్-కంపెనీ ఒప్పందాలను నిలిపివేయడానికి పేటీఎం (Paytm), పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (Paytm Payments Bank) పరస్పరం అంగీకరించాయని వన్ 97 సంస్థ బీఎస్ఈకి తెలిపింది. మార్చి 15 తరువాత కూడా వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL), పేటీఎం యాప్, పేటీఎం క్యూఆర్, పేటీఎం సౌండ్ బాక్స్, పేటీఎం కార్డ్ మెషీన్లు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తాయని పేటీఎం (Paytm) తెలిపింది. పేటీఎం తన కస్టమర్ల కోసం మార్కెట్ లీడింగ్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ఆధారిత పరిష్కారాల అత్యున్నత ప్రమాణాలను నిలబెట్టడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
వేరే బ్యాంకులతో ఒప్పందాలు
పేటీఎం (Paytm) ఆర్థిక కార్యకలాపాల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడం కోసం ఇతర బ్యాంకులతో కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని, తమ కస్టమర్లు, వ్యాపారులకు నిరంతరాయంగా సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేటీఎం గతంలోనే ప్రకటించింది.