PayTm FASTag: పేటీఎం ఫాస్టాగ్ ను డీయాక్టివేట్ చేసుకోవాలా? ఈ స్టెప్స్ ఫాలో కండి..
Deactivating PayTm FASTag: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన నేపథ్యంలో చాలా మంది పేటీఎం ఫాస్టాగ్ లను వాడుతున్న వినియోగదారులు.. ఆ పేటీఎం ఫాస్టాగ్ ను డీయాక్టివేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
Deactivating PayTm FASTag: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా వాలెట్లు, ఫాస్టాగ్ ఖాతాల్లో టాప్ అప్ చేసుకునే గడువును ఆర్బీఐ మార్చి 15వ తేదీ వరకు పొడిగించింది. మార్చ్ 15 తరువాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పేటీఎం ఫాస్టాగ్ లకు టాప్ అప్ చేసుకోవడం కుదరదు. అందువల్ల, వినియోగదారులు తమ ఫాస్టాగ్ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని ఆర్బీఐ (RBI) ఇప్పటికే సూచించింది. వాహన యజమానులకు ఫాస్టాగ్ లను జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎంను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తొలగించింది. ఫాస్టాగ్ వ్యక్తిగత ఖాతాల్లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు పేటీఎం ఫాస్టాగ్ లు పనిచేస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
మార్చి 15 వరకు
పేటీఎం ఫాస్టాగ్ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నంతవరకు ఆ ఫాస్టాగ్ లను వాహన యజమానులు వాడుకోవచ్చు. అయితే, అనవసర అసౌకర్యాన్ని నివారించడానికి పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులు మార్చి 15 లోపు వేరే అధీకృత బ్యాంకుల నుండి కొత్త ఫాస్టాగ్ ను కొనుగోలు చేయాలని ఆర్బీఐ సూచించింది.
పేటీఎం ఫాస్టాగ్ ఖాతాను డీయాక్టివేట్ చేయడం ఎలా?
పేటీఎం ఫాస్టాగ్ (PayTm FASTag) వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఫాస్టాగ్ ఐడిని ఉపయోగించి ఇప్పటికే ఉన్న ఖాతాలోకి లాగిన్ కావచ్చు. లేదా 1800-120-4210 కు కాల్ చేయడం ద్వారా కూడా లాగిన్ కావచ్చు. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ (వీఆర్ఎన్) కూడా పేర్కొనాలి. ఈ ప్రక్రియ ద్వారా మీకు సహాయం చేయడానికి పేటీఎం కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ మిమ్మల్ని సంప్రదిస్తారు. లేదా, ఆన్ లైన్ లో కూడా పేటీఎం ఫాస్టాగ్ ఖాతాను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఫోన్లో పేటీఎం యాప్ (PayTm app) ఓపెన్ చేసి పైన ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. డ్రాప్ మెన్యూలో హెల్ప్ & సపోర్ట్ విభాగానికి వెళ్లాలి. దీని కింద బ్యాంకింగ్ సేవలు మరియు చెల్లింపులు కనిపిస్తాయి. ఈ విభాగంలోనే ఫాస్టాగ్ విభాగం ఉంటుంది. ఖాతాను డీయాక్టివేట్ చేయడానికి పేటీఎం ఎగ్జిక్యూటివ్ లలో ఒకరిని సంప్రదించడానికి ‘మాతో చాట్’ పై క్లిక్ చేయండి.
పేటీఎం ఫాస్టాగ్ పోర్టల్ ద్వారా
పేటీఎం ఫాస్టాగ్ (PayTm FASTag) ను డీయాక్టివేట్ చేయడానికి మూడో మార్గం కూడా ఉంది. యూజర్ ఐడీ, వాలెట్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి ఫాస్టాగ్ పేటీఎం పోర్టల్లోకి లాగిన్ కావాలి. ఆ తరువాత, వెరిఫికేషన్ ప్రక్రియ కోసం ఫాస్టాగ్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇతర వివరాలను నమోదు చేయాలి. అనంతరం, హెల్ప్ & సపోర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. నాన్ ఆర్డర్ రిలేటెడ్ క్వైరీ’ లపై ట్యాప్ చేయండి. ఇక్కడ, ఫాస్టాగ్ ప్రొఫైల్ ను అప్డేట్ చేయడానికి సంబంధించిన క్వైరీలు అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ నేను నా ఫాస్టాగ్ ను మూసివేయాలనుకుంటున్నాను అనే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.
తాజా ఫాస్టాగ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
కొత్త ఫాస్టాగ్ కొనడానికి ముందు పాత ఫాస్టాగ్ ను డీయాక్టివేట్ చేయడం అవసరం. యాక్టివ్ ఫాస్టాగ్ ఖాతా ఉన్న ప్రస్తుత వాహనానికి ఏ బ్యాంకు కూడా కొత్త ఫాస్టాగ్ జారీ చేయదు. పాతది డీయాక్టివేట్ అయిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి మై ఫాస్టాగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లో ఫాస్టాగ్ కొనుగోలు ఆప్షన్ ను ఎంచుకోండి. ఇది కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చే ఇ-కామర్స్ లింక్ కు దారితీస్తుంది. కొత్త ఫాస్టాగ్ ను యాక్టివేట్ చేయడానికి యాప్ లో ఫాస్టాగ్ యాక్టివేట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఫాస్టాగ్ ఐడీ, వాహన వివరాలను ఎంటర్ చేసి యాక్టివేట్ చేసుకోవాలి. లేదా, కొత్త ఫాస్టాగ్ ను కొనుగోలు చేయడానికి మరొక మార్గం అధీకృత బ్యాంకులలో ఒకదాన్ని సంప్రదించడం. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి.