తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Online Scams: స్మార్ట్ ఫోన్స్ లో చేసే ఈ ఐదు తప్పుల వల్లనే ఆన్ లైన్ స్కామ్స్ కు అవకాశం; హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ అలర్ట్

Online scams: స్మార్ట్ ఫోన్స్ లో చేసే ఈ ఐదు తప్పుల వల్లనే ఆన్ లైన్ స్కామ్స్ కు అవకాశం; హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ అలర్ట్

HT Telugu Desk HT Telugu

12 April 2024, 20:20 IST

  • స్మార్ట్ ఫోన్ యూజర్లు చేసే తప్పుల వల్లనే హ్యాకర్లు, స్కామర్లు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతుంటారని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్స్ లో చేయకూడని కొన్ని పనులను, హ్యాకర్ల నుండి సురక్షితంగా ఉండటానికి మీరు మార్చాల్సిన కొన్ని స్మార్ట్ ఫోన్ అలవాట్లను హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ వివరించింది.

ఈ టిప్స్ తో మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ సురక్షితం
ఈ టిప్స్ తో మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ సురక్షితం (HDFC Bank)

ఈ టిప్స్ తో మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ సురక్షితం

Online scams: హెచ్ డీఎఫ్ సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ను ఉపయోగించేటప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన భద్రతా చిట్కాలను హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) తన కస్టమర్లకు ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ కొత్త సైబర్ సెక్యూరిటీ అడ్వైజరీని జారీ చేసింది. సురక్షితమైన పాస్ వర్డ్ లను ఏర్పాటు చేసుకోవడం, విశ్వసనీయమైన సోర్సెస్ నుంచి మాత్రమే బ్యాంకింగ్ యాప్ లను డౌన్ లోడ్ చేయడం, ఫిషింగ్ మోసాల గురించి అవగాహన పెంచుకోవడం.. మొదలైనవి అందులో ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ యూజర్ల కొన్ని సాధారణ 'చెడు అలవాట్లు హ్యాకర్లు, స్కామర్ల పనిని మరింత సులభం చేస్తాయని ఈ కొత్త హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ (HDFC Bank) తెలిపింది.

బ్లూటూత్ ను ఎల్లప్పుడూ ఆన్ లో ఉంచవద్దు

చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ లలో బ్లూటూత్ (Bluetooth) కనెక్టివిటీపై దృష్టి పెట్టరు. చాలామంది వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ లలో బ్లూటూత్ ను ఎల్లప్పుడూ ఆన్ లో ఉంచుతున్నారు. స్మార్ట్ ఫోన్ లో బ్లూటూత్ హ్యాకర్లు, స్కామర్లకు చురుకైన యాక్సెస్ పాయింట్ అన్న విషయం గుర్తుంచుకోవాలి. కొత్త డివైజ్ ను స్మార్ట్ ఫోన్ లోని బ్లూ టూత్ కు మాన్యువల్ గా యాడ్ చేయాల్సిన అవసరం ఉన్నందున, సమస్య ఉండదని చాలా మంది భావిస్తుంటారు. కాని, వారు మర్చిపోయే విషయం ఏమిటంటే, యాక్టివ్ బ్లూటూత్ మీ స్మార్ట్ ఫోన్ ఇంతకు ముందు ఏ డివైజెస్ తో జత చేయబడిందో తెలుసుకోవడానికి హ్యాకర్లకు సహాయపడుతుంది. దంతో హ్యాకర్లు సులభంగా మీ ఫోన్ ని యాక్సెస్ చేయగలుగుతారు. అందువల్ల బహిరంగ ప్రదేశాల్లో సాధ్యమైనంత వరకు బ్లూ టూత్ ను ఆఫ్ లో ఉంచండి.

యాప్స్ ను 'ఫోర్స్ క్లోజింగ్' చేయవద్దు

స్మార్ట్ ఫోన్ యూజర్లు చాలామంది బ్యాక్ బటన్ ను ప్రెస్ చేసి, తాము ఉపయోగిస్తున్న యాప్ నుంచి బయటకు వస్తుంటారు. కానీ, అలా చేయడం సరికాదు. ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్స్ వాడేవారు అలా చేయకూడదు. యాప్ నుంచి బయటకు రావడానికి ‘లాగ్ ఔట్ (LOG OUT)’ ఆప్షన్ నే ఉపయోగించాలి. అలా చేయకపోతే, బ్యాంకింగ్ యాప్ కొద్దిసేపు లాగిన్ స్టేజ్ లోనే ఉండే అవకాశం ఉంది. దాంతో ఆ యాప్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.

పబ్లిక్ వైఫైని వాడవద్దు


ప్రయాణాల సమయంలో, బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు, రెస్టారెంట్స్, పబ్లిక్ ప్లేసెస్ కు వెళ్లినప్పుడు చాలా మంది పబ్లిక్ వైఫైని వాడుతుంటారు. అలా పబ్లిక్ వైఫై (public WiFi) ను వాడుతున్నట్లయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లోకి లాగిన్ అవ్వకండి. పబ్లిక్ వైఫై కనెక్షన్లు హ్యాకర్లకు ఆటస్థలాల వంటివి. వారు పబ్లిక్ వైఫై నెట్వర్క్ ను వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ ను ఈజీగా హ్యాక్ చేయగలుగుతారు. ఒకవేళ పబ్లిక్ వైఫై కనెక్షన్ ఉపయోగించవలసి వస్తే, రక్షణ కోసం ఎల్లప్పుడూ VPN యాప్స్ ను ఉపయోగించండి. ఇంకా మంచి విషయం ఏంటంటే, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ను వాడేటప్పడు ఎల్లప్పుడూ మొబైల్ డేటా లేదా మీకు నమ్మకమైన ఇంటి వైఫై నెట్వర్క్ ను ఉపయోగించండి.

బ్యాంకింగ్ యాప్ లను అన్ ఇన్ స్టాల్ చేయండి


మీరు మీ స్మార్ట్ ఫోన్ ను ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే, ముఖ్యంగా సర్వీసింగ్ లేదా రిపేరింగ్ కోసం ఇవ్వాల్సి వస్తే, అలా చేయడానికి ముందు మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లను అన్ ఇన్ స్టాల్ (uninstall mobile banking apps) చేయండి. వాస్తవానికి, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ను మళ్లీ ఇన్స్టాల్ చేయడం, యాక్టివేట్ చేయడం కష్టమైన ప్రక్రియగా అనిపించవచ్చు, కానీ ఇది మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. స్మార్ట్ ఫోన్ లో ఫ్యాక్టరీ రీసెట్ బటన్ నొక్కడానికి ముందు బ్యాంకింగ్ యాప్స్ సహా అన్ని ముఖ్యమైన యాప్స్ ను అన్ ఇన్ స్టాల్ చేయండి.

అన్ని యాప్స్ కు ఒకే పిన్/పాస్ వర్డ్ వద్దు


మీ స్మార్ట్ ఫోన్ లాక్ స్క్రీన్ కు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ కు ఒకే పాస్ వర్డ్ / పిన్ (same password/PIN) ఉపయోగించవద్దు. ముఖ్యంగా మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ కు కఠినమైన, సురక్షితమైన పిన్ లేదా పాస్ వర్డ్ లను ఉపయోగించండి. ఒకే పిన్ లేదా పాస్ వర్డ్ వాడడం వల్ల హ్యాకర్లు ఒక యాప్ పాస్ వర్డ్ ను హ్యాక్ చేస్తే చాలు.. మిగితా యాప్స్ ను ఈజీగా అన్ లాక్ చేయగలుగుతారు. మొబైల్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ లను ఎప్పటికప్పుడు మార్చుకోవడం మంచిది. ఈ 5 పాయింటర్లతో పాటు, పిన్ లు లేదా పాస్ వర్డ్ లను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ సూచించింది.

తదుపరి వ్యాసం