TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. విద్యుత్ శాఖ డీఈ అరెస్ట్‌తో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కమిషన్ కార్యదర్శి పిఏ ప్రవీణ్ ద్వారా ప్రశ్నాపత్రం దక్కించుకున్న డీఈ వాటిని పెద్ద మొత్తానికి పలువురికి విక్రయించినట్లు గుర్తించారు.
ఎలక్ట్రికల్ డీఈ రమేశ్ కనుసన్నల్లో పెద్దఎత్తున ప్రశ్నపత్రాలు చేతులు మారినట్టు సిట్ గుర్తించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఏఈఈ/డీఏఓ పరీక్షలకు హాజరయ్యే కొందరు అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకొని సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పరీక్షకు హాజరైన ఏడుగురు అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్లు సిట్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.
ఇప్పటివరకూ ప్రశ్నపత్రాలను విక్రయించి సొమ్ము చేసుకున్నట్లుగా సాగుతున్న కేసులో తొలిసారి నిందితులు ఎలక్ట్రానిక్ డివైజ్ పరికరాలను ఉపయోగించినట్లు వెల్లడైంది. సోమవారం వరంగల్‌కు చెందిన డీఈ రమేశ్‌తో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా పరీక్ష రాసిన ప్రశాంత్, నరేష్, మహేశ్, శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన మరో 20 మంది అభ్యర్థులను పోలీసులు గుర్తించారు.
ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్ టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు దొంగలించిన తర్వాత తనకు పరిచయమున్న టీఎస్‌పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ సురేశ్‌ను దళారిగా మార్చాడు. సురేష్ ద్వారా ఏఈఈ/డీఏవో ప్రశ్నపత్రాలను 25 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. సురేశ్ ద్వారా డీఈ రమేశ్ కొన్ని ప్రశ్నపత్రాలు తీసుకొని అమ్మినట్లు గుర్తించారు.
ఏఈఈ, డీఏఓ ప్రశ్నపత్రాలు కావాలంటూ మరికొందరు అభ్యర్థుల నుంచి ఒత్తిడి రావటంతో వాటి కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జవాబులు చేరవేసేలా ఏడుగురు అభ్యర్థులతో ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు డీఈ ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి ముందుగానే మైక్రోఫోన్ ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఇచ్చాడు.
అభ్యర్థులు వాటిని బెల్ట్‌లో భద్రపరచుకుని పరీక్ష హాలుకు చేరారు. అక్కడి ఎగ్జామినర్ సహాయంతో అభ్యర్థులు ప్రశ్నపత్రాల ఫొటోలు తీసుకున్నారు. వాటిని పరీక్ష ప్రారంభమయ్యే 10 నిమిషాల ముందు రమేశ్ వాట్సప్‌కు చేరవేశారు. చాట్ జీపీటీ ద్వారా సమాధానాలను సేకరించి వాట్సప్ ఫోన్‌కాల్ ద్వారా పరీక్ష హాలులోని ఏడుగురు అభ్యర్థులకు జవాబులు చేరవేశాడు. ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన ఎగ్జామినర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఎన్పీడీసీఎల్ డీఈఈ రమేశ్ కోచింగ్ సెంటర్ ద్వారా పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో పాటు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, దిల్‌సుఖ్‌నగర్‌లోని మరో మూడు కోచింగ్ సెంటర్స్‌కు పేపర్ లీకేజీతో సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. డీఈఈ రమేశ్ తన భార్య పేరిట ఓ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తమ వద్ద కోచింగ్ తీసుకునే అభ్యర్ధులకు జాబ్ గ్యారింటీ ఆఫర్ చేశారు.
అభ్యర్దులకు జాబ్ రాకపోతే ఫీజ్ వాపస్ చేస్తామని ప్రచారం కూడా చేసుకున్నాడు. ఈ తరహాలో నగరంలోని పలు కోచింగ్ సెంటర్స్ నిర్వాహకులకు నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రేణుక ద్వారా డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నట్లు తేలింది. ప్రవీణ్ గ్యాంగ్ అందించిన మాస్టర్ పేపర్స్‌తో కోచింగ్ సెంటర్స్‌లో ట్రైనింగ్ ఇచ్చినట్లు సిట్ గుర్తించింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి లీకైన ఆరు మాస్టర్ పేపర్స్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మినహా ఏఈ, ఏఈఈ, డీవోవో పేపర్స్‌ను రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు విక్రయించారు. నిందితులు నాలుగు ముఠాలుగా ఏర్పడి టిఎస్‌పిఎస్సీ పేపర్స్ అమ్మకానికి పెట్టారు. ప్రవీణ్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రాసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ బీ నర్సింగ్‌రావును ఆదివారం అరెస్ట్ చేశారు.
టీఎస్‌పీఎస్‌సీ మాజీ టెక్నిషియన్ సురేశ్ నుంచి డీఈ రమేశ్ ఏఈఈ క్వశ్చన్ పేపర్స్ కొనుగోలు చేశాడు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ కావడంతో అదే అసిస్టెంట్ ఇంజినీర్ పేపర్‌ను మార్కెట్‌లో పెట్టాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని తన కోచింగ్ సెంటర్‌లో దాదాపు 20 మందికి పైగా మాస్టర్ పేపర్‌తో కోచింగ్ ఇచ్చాడు. పరీక్షకు సరిగ్గా రెండు రోజుల ముందు అభ్యర్ధులకు పేపర్స్ అందించినట్లు పోలీసులు గుర్తించారు.
సైదాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ అడ్డాగా ఏఈఈ పేపర్ లీకేజీ జరిగినట్టు సిట్ గుర్తించింది. అదే అపార్ట్‌మెంట్‌లో నిందితుడు సురేష్, ఎలక్ట్రికల్ జూనియర్ అసిస్టెంట్ పూల రవికిశోర్, డీఈ రమేశ్ నివాసం ఉంటున్నారు. ఇక్కడి నుంచే ఏఈ పేపర్స్ సప్లయ్ చేశారు. సైదాబాద్‌లోని ఓ జిరాక్స్ సెంటర్‌లో ఏఈ మాస్టర్ పేపర్స్ జిరాక్స్ తీశారని, వాటిని రవికిశోర్ బావమరిది విక్రమ్, అతని మరదలు దివ్యలకు అందించాడని నిందితులు సిట్ దర్యాప్తు బృందానికి వెల్లడించారు.
వీరితో పాటు డీఈ రమేశ్ వరంగల్‌కు చెందిన వాడు కావడంతో ఆ జిల్లాకు చెందిన అభ్యర్ధులు, తన కోచింగ్ సెంటర్ అభ్యర్ధులకు పేపర్ సేల్ చేశాడు. ఒక్కో అభ్యర్ధి వద్ద డిమాండ్‌ను బట్టి రూ.75 వేల నుంచి రూ.3లక్షల వరకు విక్రయించారు. రమేశ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కోచింగ్ సెంటర్స్‌పై సిట్ గురి పెట్టింది. పేపర్స్ కొనుగోలు చేసిన అభ్యర్ధులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.