Ban OnePlus, iQoo, Poco: ‘‘వన్ ప్లస్, ఐక్యూ, పోకోలను భారత్ లో బ్యాన్ చేయాలి’’: రిటైలర్ల డిమాండ్
03 October 2024, 19:35 IST
అనైతిక వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతున్న చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలైన వన్ ప్లస్, ఐక్యూ, పోకోలపై నిషేధం విధించాలని భారతదేశంలోని మొబైల్ రిటైలర్లు కోరుతున్నారు. అలాగే, స్థానిక కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తున్న ఫ్లిప్ కార్ట్, అమెజాన్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వన్ ప్లస్, ఐక్యూ, పోకోలను భారత్ లో బ్యాన్ చేయాలని రిటైలర్ల డిమాండ్
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లైన ఐక్యూ, పోకో, వన్ ప్లస్ ల అమ్మకాలను భారత దేశంలో నిషేధించాలని భారతదేశంలోని మొబైల్ రిటైలర్లు మరోసారి డిమాండ్ చేశారు. అలాగే, ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తమ ప్లాట్ ఫామ్ లలో నిర్దిష్ట అమ్మకందారులకు అనుకూలంగా ఉండటం ద్వారా స్థానిక పోటీ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ-కామర్స్ దిగ్గజాలపై ఆరోపణలు
ఐక్యూ (IQOO), పోకో, వన్ ప్లస్ బ్రాండ్లతో పాటు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలు స్థానిక వ్యాపారాలకు హాని కలిగించే, ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించే అన్యాయమైన పద్ధతులకు పాల్పడుతున్నాయని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AMRA) ఆరోపించింది. ఏఎంఆర్ఏ భారత్ లో 1.5 మిలియన్లకు పైగా మొబైల్ రిటైలర్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఐక్యూ, పోకో (poco), వన్ ప్లస్ (ONEPLUS) కంపెనీలు ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లతో ప్రత్యేక ఒప్పందాల ద్వారా.. ఆయా ప్లాట్ ఫామ్ లపై తమ ప్రొడక్ట్ లకు ప్రాధాన్యత లభించేలా చూసుకుంటున్నాయని, రిటైల్ స్టోర్స్ లో తమ ఉత్పత్తుల లభ్యతను పరిమితం చేశాయని రిటైలర్లు ఆరోపిస్తున్నారు. ఈ విధానం మొబైల్ ఫోన్లకు గ్రే మార్కెట్ ను పెంపొందిస్తుందని, స్థానిక రిటైలర్లను బలహీనపరుస్తుందని, ప్రభుత్వానికి లభించే పన్ను ఆదాయం తగ్గుతుందని వివరిస్తున్నారు.
ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లపై నిషేధం
ఫ్లిప్ కార్ట్ (flipkart), అమెజాన్ (AMAZON)కార్యకలాపాలను నిలిపివేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)ను కోరింది. ఈ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్ లు ఉపయోగించే ధరల వ్యూహాలు, లోతైన డిస్కౌంట్లు చివరికి సాంప్రదాయ రిటైలర్లకు హాని కలిగిస్తున్నాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ఈ-కామర్స్ సంస్థలు, బ్రాండ్లు, బ్యాంకుల మధ్య సహకారంపై ఖండేల్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ పై ఆధిపత్యం చెలాయించడమే లక్ష్యంగా కార్టెల్ తరహా ప్రవర్తనను సూచిస్తున్నారు. తాము ఈ కామర్స్ (e commerce) కు వ్యతిరేకం కాదని, అయితే సమన్యాయం, నిష్పాక్షిక వ్యాపార విధానాలు కోరుకుంటున్నామని, మార్కెట్లో సమానమైన పోటీ ఉండాలని అన్నారు.