Online Shopping : పండగ చేసుకుంటున్న ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్.. 3 రోజుల్లో రూ.26,500 కోట్ల అమ్మకాలు.. వీటికి చాలా డిమాండ్
Online Shopping : ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఫెస్టివల్ సీజన్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో అందుబాటులో ఉన్న ఆఫర్లను ప్రజలు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అందుకే మూడు రోజుల్లో రూ.26,500 కోట్ల అమ్మకాలు జరిగాయి.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, మీషో వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కస్టమర్లకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పండుగ సీజన్ ప్రారంభమైంది. కేవలం 3 రోజుల్లోనే రూ.26,500 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. డేటా ప్రకారం చాలా మంది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించేసరికి జనాలు ఎగబడుతున్నారు.
పండుగలకు ముందు వినియోగదారులు డిస్కౌంట్ల ఆశతో ఈ అమ్మకాల్లో విపరీతంగా కొనుగోలు చేస్తుంటారు. ఈసారి కూడా అదే కంటిన్యూ అయింది. ఇది కంపెనీలకు లాభం చేకూరుస్తుంది. కంపెనీలకు కూడా ఇది ముఖ్యమైన సమయం. వార్షిక స్థూల వాణిజ్య విలువ(జీఎంవీ)లో ఎక్కువ భాగం ఈ కాలంలో వస్తుంది. మొత్తం అమ్మకాల్లో 60 శాతం మొదటి వారంలోనే వస్తాయి.
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం ఈ ఏడాది పండుగ సీజన్ అమ్మకాల్లో ఈ-కామర్స్ కంపెనీలు, రిటైలర్లు రూ .1 లక్ష కోట్ల జీఎంపీని ఆశిస్తున్నారు. అందులో మొదటి మూడు రోజుల్లోనే రూ.26,500 కోట్లు వచ్చాయి. ఈ కాలంలో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌తోపాటుగా నిత్యావసర గృహోపకరణాల విక్రయాల వాటా 79 శాతంగా ఉందని డాటమ్ ఇంటెలిజెన్స్ తన నివేదికలో పేర్కొంది. క్రెడిట్ కార్డులపై ఆఫర్ల కారణంగా డిమాండ్ కూడా పెరిగింది. ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలు ప్రారంభమైన తొలినాళ్లలో మొత్తం 330 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు.
పండుగ సీజన్ గొప్పగా ఉంటుందని ప్రారంభ కొనుగోళ్లు చూపిస్తున్నాయని ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబర్ 28న ఒక ప్రకటనలో తెలిపింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ ప్రొడక్ట్స్‌కు కస్టమర్ల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. మీషో కూడా ఇప్పటి వరకు మంచి అమ్మకాలు చేసింది. మునుపటిలానే ఇందులో ఫ్యాషన్ కేటగిరీకి ఎక్కువ డిమాండ్ ఉంది. మింత్రాకు 15 రెట్లు కొత్త కస్టమర్లు వచ్చారు. అదే సమయంలో ఆర్డర్లు పెరిగాయి.
అన్ని ప్లాట్‌ఫామ్‌లలో 50 నుంచి 60 శాతం కొనుగోళ్లు మెట్రో నగరాల నుంచే జరుగుతున్నాయి. మిగిలిన 40 నుంచి 45 శాతం కొనుగోళ్లు ద్వితీయ శ్రేణి నగరాల నుంచే అవుతున్నాయి. మెుత్తానికి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ పండగ చేసుకుంటున్నాయి.