Mutual fund NFO : మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసే ముందు ఇవి తెలుసుకోండి..
02 September 2024, 7:20 IST
- ఇన్వెస్టర్లు కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలపై భారీగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇన్వెస్టర్లు 25కి పైగా ఎన్ఎఫ్ఓల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం లభించింది.
మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకోవడంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు న్యూ ఫండ్ ఆఫర్స్ (ఎన్ఎఫ్ఓ)ని అందిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కూడా ఈ కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలపై భారీగానే ఆధారపడుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇన్వెస్టర్లు 25కి పైగా ఎన్ఎఫ్ఓల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం లభించనుంది. కానీ ఇందులోనూ రిస్క్ ఉంటుందని గుర్తించాలి. ఏదైనా కొత్త ఎన్ఎఫ్ఓలో పెట్టుబడి పెట్టే ముందు దాని స్ట్రాటజీ, రిస్క్, మేనేజ్మెంట్ని జాగ్రత్తగా మదింపు చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. సంబంధిత ఎన్‌ఎఫ్‌ఓని ఇన్వెస్టర్లు పూర్తిగా రీసెర్చ్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి.
ఎన్ఎఫ్ఓల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధర కలిగిన ఎన్ఎఫ్ఓల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అనుకోకూడదు అని సూచిస్తున్నారు. ధరకు సంబంధం లేకుండా పథకం పనితీరుపైనే లాభాలు ఆధారపడి ఉంటాయి. కొత్త ప్లాన్ ఆశించిన స్థాయిలో పనిచేయకపోతే ఈ పరిస్థితిలో నష్టపోయే అవకాశం ఉంది. మంచి పనితీరు కనబరిచే పథకంలో తక్కువ యూనిట్లు వచ్చినా, అది పెట్టుబడిదారులకు లాభాలను ఇస్తుంది.
ఇదీ చూడండి:- Goldman Sachs Layoffs : దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌లో ఉద్యోగాల కోత! ఏకంగా 8శాతం లేఆఫ్?
ఎన్ఎఫ్ఓ..
న్యూ ఫండ్ ఆఫర్ అంటే మార్కెట్లో ప్రవేశపెట్టిన కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాలు. దీని ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌ను నడుపుతున్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) ఇన్వెస్టర్లను తమ కొత్త పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తాయి. ఎన్ఎఫ్ఓలు స్టాక్ మార్కెట్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఒ) మాదిరిగానే ఉంటాయి. ఇక్కడ పెట్టుబడిదారులు మొదటి నుంచి పెట్టుబడి పథకంలో పాల్గొనడానికి ప్రత్యేకమైన అవకాశాన్ని పొందుతారు. ఇన్వెస్టర్లు సాధారణంగా మ్యూచువల్ ఫండ్ల యూనిట్లను యూనిట్‌కు రూ.10 ఆఫర్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాల ట్రాక్ రికార్డ్ అందుబాటులో లేనందున, భవిష్యత్తులో ఇది ఎలా పనిచేస్తుందో అంచనా వేయడం కష్టం. అటువంటి పరిస్థితిలో, పెట్టుబడిదారుడు కంపెనీ విశ్వసనీయతపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కంపెనీ పనితీరును పరిశీలించాలి. ఇతర పథకాల్లో మంచి లాభాలు ఇచ్చినట్లయితే, కొత్త పథకంలో పెట్టుబడి పెట్టేందుకు మనకి నమ్మకం పెరుగుతుంది.