Flight routes: 69 కిమీలు.. 35 నిమిషాలు; భారత్ లో అత్యంత తక్కువ దూరం ఉన్న ఈ విమాన మార్గం ఎక్కడ ఉందో తెలుసా?
29 October 2024, 19:14 IST
Flight routes: భారత్ లో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే నాన్ స్టాప్ విమాన మార్గం, అతి తక్కువ దూరం ప్రయాణించే నాన్ స్టాప్ విమాన మార్గం ఏంటో తెలుసా? ఈ శీతాకాలం షెడ్యూల్ కోసం విమానాల రాకపోకలకు ఏవియేషన్ రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. అందులో ఈ నాన్ స్టాప్ మార్గాలపై వివరణ ఉంది.
భారత్ లో అత్యంత తక్కువ దూరం ప్రయాణించే విమాన మార్గం
Flight routes: ఈ శీతాకాలం షెడ్యూల్ కోసం విమానాల రాకపోకలకు ఏవియేషన్ రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. భారత్ లో విమానయాన శీతాకాల షెడ్యూల్ అక్టోబర్ చివరి ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. మార్చి చివరి శనివారం వరకు అమలులో ఉంటుంది.
మొత్తం 25007 వీక్లీ ఫ్లైట్స్
ఈ ఏడాది, భారత విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) 25007 వీక్లీ ఫ్లైట్స్ ప్రయాణాలను ఆమోదించింది. వాటిలో సగటున 3572 రోజువారీ డిపార్చర్స్ ఉన్నాయి. శీతాకాల షెడ్యూల్ మొదటి రోజున, భారత్ లో అన్ని విమానయాన సంస్థలు కలిసి 3204 విమానాలను నడిపాయి. అవి ఆమోదించిన షెడ్యూల్లో 89.7%. కాగా, ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ సిరియం వెల్లడించిన డేటా ఆధారంగా చేసిన విశ్లేషణలో దేశంలోని అతి చిన్న, పొడవైన దేశీయ మార్గాల గురించి కొన్ని ఆసక్తికరమైన గణాంకాలు వెల్లడయ్యాయి.
భారతదేశంలో అతి చిన్న విమాన మార్గం
భారతదేశంలోని ఏకైక ప్రభుత్వ విమానయాన సంస్థ అయిన అలయన్స్ ఎయిర్, ఇటానగర్, జీరో ల మధ్య దేశంలో అతి చిన్న విమాన మార్గాన్ని నడుపుతుంది. ఈ మార్గంలో డోర్నియర్ 228 విమానం ప్రయాణిస్తుంది. ఇది వారానికి రెండుసార్లు ఉంటుంది. ఈ విమానం మొత్తం ప్రయాణ సమయం కేవలం 35 నిమిషాల బ్లాక్ టైమ్ మాత్రమే. అలాగే, ఇది ప్రయాణించే దూరం 69 కిలోమీటర్ల దూరం మాత్రమే. బ్లాక్ టైమ్ అంటే విమానం ప్రయాణించే మొత్తం సమయం. ఇందులో డిపార్చర్ సమయంలో పుష్ బ్యాక్ నుండి అరైవల్ తరువాత పార్కింగ్ బేకు చేరుకునే వరకు సమయం ఉంటుంది.
భారతదేశంలో అతి పొడవైన విమాన మార్గం
ఢిల్లీ నుండి పోర్ట్ బ్లెయిర్ మార్గం భారత్ లో అత్యంత పొడవైన విమాన మార్గం. ఈ రూట్ లో ఎయిరిండియా ఎయిర్ బస్ ఎ 320 ని నడుపుతుంది. ఈ విమానం న్యూ ఢిల్లీ నుండి పోర్ట్ బ్లెయిర్ కు 2,467 కిలోమీటర్లు ప్రయాణించడానికి, సాధారణ సమయాల్లో మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు పడుతుంది. ఆ తరువాత, భారత్ లో అతి పొడవైన విమాన మార్గం బెంగళూరు - శ్రీనగర్ మార్గం. ఈ రెండు నగరాల మధ్య 2321 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రూట్ లో విమాన ప్రయాణ సమయం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల బ్లాక్ టైమ్ ఈ మార్గంలో భారత్ లోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ ఏ320 నియో విమానాన్ని నడుపుతోంది.
ఇతర చిన్న విమాన మార్గాలు
కేరళలోని కోజికోడ్, కొచ్చి మధ్య కూడా అతి చిన్న విమనాయాన మార్గం ఉంది. ఇక్కడ ఏటిఆర్ 72- విమానం 119 కిలోమీటర్ల దూరాన్ని నలభై నిమిషాల్లో కవర్ చేస్తుంది. అలాగే, విజయవాడ నుండి షిర్డీకి ప్రయాణ దూరం 764 కిలోమీటర్లు కాగా, ఈ దూరాన్ని కవర్ చేయడానికి రెండు గంటల పదిహేను నిమిషాలు తీసుకుంటుంది. అలాగే, మరో అతి చిన్న ఎయిర్ బస్ మార్గం శ్రీనగర్, జమ్మూ మధ్య ఉంది. ఇది 145 కిలోమీటర్లు ఉంటుంది.
స్పైస్ జెట్ విమానాల్లో..
స్పైస్ జెట్ విమానయాన సంస్థ నడిపే మార్గాల్లో పొడవైన మార్గం ముంబై నుండి బాగ్డోగ్రా మధ్య ఉంది. దీని దూరం 1794 కిలోమీటర్లు. అకాసా ఎయిర్ విమానం ప్రయాణించే అతి చిన్న మార్గం గౌహతి, అగర్తలా (154 కిలోమీటర్లు)ల మధ్య ఉంది. అలాగే, ఆకాసా ఎయిర్ లైన్ పొడవైన మార్గం ముంబై, గౌహతిల మధ్య 2074 కిలోమీటర్లుగా ఉంది. అలాగే, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ కు కన్నూర్ నుండి మంగళూరుకు 50 నిమిషాల 135 కిలోమీటర్ల చిన్న మార్గం, 2041 కిలోమీటర్ల వద్ద ఢిల్లీ - కొచ్చి సెక్టార్ అతి పెద్ద మార్గంగా ఉన్నాయి.
కొత్త విమానాశ్రయాలు
భారత్ లోని పలు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో అనేక విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయి. యూపీలో లక్నో నుండి శ్రావస్తికి 140 కిలోమీటర్ల దూరం అతి చిన్న విమాన మార్గం కాగా, హిండన్ నుండి భటిండాకు 304 కిలోమీటర్లు అతి పొడవైన విమాన మార్గం.
అంతర్జాతీయంగా ఎలా ఉంది?
బెంగళూరు (Bengaluru) నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు వారానికి మూడుసార్లు నడిచే ఎయిరిండియా సర్వీసు భారతదేశం నుండి పొడవైన అంతర్జాతీయ విమానంగా కొనసాగుతోంది. ఇది 13,987 కిలోమీటర్ల దూరాన్ని 16 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేసి షెడ్యూల్ ప్రకారం 18 గంటల్లో తిరిగి వస్తుంది. భారతదేశం నుండి అతి చిన్న అంతర్జాతీయ విమానాన్ని ద్రుక్ ఎయిర్ సంస్థ బాగ్డోగ్రా నుండి పారోకు నడుపుతుంది. ఇది 137 కిలోమీటర్ల దూరంలో ఉంది.