IIT Guwahati Student : ఐఐటీ గౌహతిలో చదువుతున్న తెలంగాణ విద్యార్థిని మృతి, న్యూ ఇయర్ వేడుకలకు హోటల్ కి వెళ్లి!
IIT Guwahati Student : ఐఐటీ గౌహతిలో చదువుతున్న తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. ఐఐటీ క్యాంపస్ కు దగ్గర్లోని ఓ హోటల్ లో విద్యార్థిని విగత జీవిగా కనిపించింది.
IIT Guwahati Student : ఐఐటీ గౌహతిలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తెలంగాణకు చెందిన పుల్లారి ఐశ్వర్య అనే విద్యార్థిని హోటల్ లో అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నూతన సంవత్సర వేడుకల కోసం ఐశ్వర్యతో పాటు తన ముగ్గురు స్నేహితులు ఐఐటీ క్యాంపస్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ హోటల్ లో రెండు గదులను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు. డిసెంబర్ 31న ఐశ్వర్యతో పాటు తన ముగ్గురు స్నేహితులు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. జనవరి 1న ఉదయం ఐశ్వర్య స్నేహితురాలు వాష్ రూమ్ కు వెళ్లగా ఐశ్వర్య అపస్మారక స్థితిలో ఉండటాన్ని ఆమె గమనించింది. వెంటనే మిగతా స్నేహితులకు సమాచారం అందించి... గౌహతిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి ఐశ్వర్యను తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
విద్యార్థిని మృతి బాధాకరం
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం వారు బుక్ చేసుకున్న గదిని పరిశీలించి....ఐశ్వర్య స్నేహితులను, హోటల్ సిబ్బందిని పోలీసులు విచారించారు. కాగా డిసెంబర్ 31న అర్ధరాత్రి హోటల్ తనిఖీల కోసం వెళ్లినప్పుడు ఐశ్వర్యతో పాటు తన వెంట ఉన్న స్నేహితులు అందరూ మత్తులో ఉన్నారని హోటల్ సిబ్బంది పోలీసులకు వివరించారు. ఐశ్వర్య మృతి గురించి ఐఐటీ గౌహతి యాజమాన్యం ఆమె తల్లితండ్రులకు సమాచారం అందించారు. ఐశ్వర్య మృతి పట్ల ఐఐటీ గౌహతి సంతాపం తెలిపింది. విద్యార్థిని మృతి బాధాకరమని, ఆమె మృతిపై పోలీసులు విచారణ చేపట్టాలని యాజమాన్యం పేర్కొంది.
తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు
సోమవారం తెల్లవారుజామున విద్యార్థిని తీవ్రమైన శ్వాసకోశ సమస్యల గురించి ఫిర్యాదు చేయడంతో స్నేహితులు ఆమెను గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తీసుకెళ్లారని పోలీసు అధికారి తెలిపారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పార్టీ సమయంలో కూడా శ్వాస తీసుకోవడంలో విద్యార్థిని ఇబ్బంది పడిందని ఆమె స్నేహితులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సెంట్రల్ పోలీస్ డిస్ట్రిక్ట్ అమితాబ్ బసుమతరీ తెలిపారు. గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ నుంచి మరణం గురించి సమాచారం అందిందని డీసీపీ తెలిపారు. ఆస్పత్రికి తరలించేలోపే విద్యార్థని మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాత మరణానికి కారణాలపై స్పష్టత వస్తుందని డీసీపీ పేర్కొన్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా