Port Blair: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్రం.. కొత్త పేరు ఏంటంటే..?-centre renames port blair as sri vijaya puram ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Port Blair: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్రం.. కొత్త పేరు ఏంటంటే..?

Port Blair: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్రం.. కొత్త పేరు ఏంటంటే..?

Sudarshan V HT Telugu
Sep 13, 2024 08:00 PM IST

కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్రం మార్చింది. స్వాతంత్య్ర పోరాటంలో సాధించిన విజయానికి, స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్ నికోబార్ దీవుల ప్రత్యేక పాత్రకు ప్రతీకగా పోర్ట్ బ్లయర్ పేరును 'శ్రీ విజయ పురం' అని మార్చినట్లు హోం మంత్రి అమిత్ షా అన్నారు.

పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్రం
పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చిన కేంద్రం

Centre renames Port Blair: అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయ పురంగా మార్చాలని కేంద్రం నిర్ణయించిందని, ఇది స్వాతంత్య్ర పోరాటంలో సాధించిన విజయానికి చిహ్నమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు.

వలస పాలన నాటి పేర్ల స్థానంలో

వలస పాలన నాటి పేర్లను, నాటి గుర్తులను మార్చాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi) దార్శనిక నిర్ణయంలో భాగంగా పోర్ట్ బ్లెయిర్ పేరును ‘‘శ్రీ విజయపురం’’గా మార్చాలని నిర్ణయించామని అమిత్ షా వెల్లడించారు. మునుపటి పేరు వలసవాద గుర్తును కలిగి ఉందన్నారు. ‘‘శ్రీ విజయ పురం అనే పేరు మనం స్వాతంత్య్ర పోరాటంలో సాధించిన విజయానికి, ఆ స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్, నికోబార్ ద్వీపాల ప్రత్యేక పాత్రకు ప్రతీక’’ అని అమిత్ షా (amith shah) తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర

స్వాతంత్య్ర పోరాటంలో, చరిత్రలో అండమాన్ నికోబార్ దీవులకు తిరుగులేని స్థానం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నౌకాదళ స్థావరంగా పనిచేసిన ద్వీప భూభాగం నేడు మన వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన స్థావరంగా ఉందని తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీ మన తిరంగా మొదటి సారి ఎగురవేసింది ఇక్కడేనని, అలాగే, వీర్ సావర్కర్, ఇతర స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్రం కోసం పోరాడిన సెల్యులార్ జైలు ఉన్న ప్రాంతం ఇదేనని హోంమంత్రి తెలిపారు.

పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు

2023 జనవరిలో అండమాన్ నికోబార్లోని 21 పెద్ద ద్వీపాలకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ పెట్టారు. దక్షిణ అండమాన్ ద్వీపం తూర్పు తీరంలో ఉన్న పోర్ట్ బ్లెయిర్ (శ్రీ విజయ పురం) 500 కి పైగా పురాతన ద్వీపాలకు ప్రవేశ ద్వారం. ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రం. ఇక్కడే అండమాన్, నికోబార్ దీవులకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్, సీ క్రూయిజ్ వంటి నీటి అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి.

Whats_app_banner