Kia Seltos facelift : జులై 4న సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను రివీల్ చేయనున్న కియా..
20 June 2023, 9:16 IST
- Kia Seltos facelift launch : కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను జులై 4న రివీల్ చేయనుంది సంస్థ. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
జులై 4న సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను రివీల్ చేయనున్న కియా..
Kia Seltos facelift launch : ఇండియా మార్కెట్లో.. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఎప్పుడు లాంచ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్! వచ్చే నెల 4న.. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా రివీల్ చేయనుంది కియా మోటార్స్ ఇండియా. కొరియాలో లాంచ్ అయిన సరిగ్గా ఏడాది కాలానికి.. ఈ 2023 కియా సెల్టోస్‌ను ఇండియాలో రివీల్ చేస్తోంది ఆ సంస్థ. ఇక కియా మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న ఈ ఎస్యూవీ లేటెస్ట్ వర్షెన్.. ఈ ఏడాది ఆగస్ట్‌లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మోడల్ బుకింగ్స్‌ను సంస్థ ప్రారంభించింది. రూ. 25వేల రీఫండెబుల్ టోకెన్ అమౌంట్‌తో సంస్థకు చెందిన డీలర్షిప్ షోరూమ్స్‌లో ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.
కియా సెల్టోస్ ఎస్‌యూవీకి డిమాండ్ ఎక్కువే..
2019లో సెల్టోస్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది కియా. అప్పటి నుంచి సంస్థకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతోంది. ఇటీవలే.. 5లక్షల సేల్స్ మార్క్‌ను సైతం అందుకుంది. ఇంకా చెప్పాలంటే.. ఇండియాలో సంస్థ సేల్స్‌లో సెల్టోస్ వాటా 55శాతం ఉందంటే.. ఈ మోడల్‌కు ఏ రేంజ్లో డిమాండ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు.
ఇక 2023 కియా సెల్టోస్ లుక్ మరింత బోల్డ్‌గా మారింది. ఇందులో స్కల్ప్టెడ్ బానెట్, క్రోమ్ సరౌండెడ్ టైగర్ నోస్ గ్రిల్, ఇంటిగ్రేడెట్ డీఆర్ఎల్స్తో కూడిన స్లీక్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, రివైజ్డ్ బంపర్స్, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్, ఓఆర్వీఎంలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, డిజైనర్ డ్యూయెల్- టోన్ అలాయ్ వీల్స్ వంటి ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి.
ఇక రేర్‌లో రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, వ్రాప్ అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, షార్క్ ఫిన్ యాంటీనాలు వస్తున్నాయి.
ఇంటీరియర్‌లో మార్పులు ఇలా..!
ఈ ఎస్‌యూవీలోని 5 సీటర్ కేబిన్.. స్పెషియస్గా ఉంటుంది. ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డ్యూయెల్ 10.25 ఇంచ్ స్క్రీన్ సెటప్ వంటివి వస్తున్నాయి. సెంట్రల్ ఏసీ వెంట్స్.. ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ కింద వస్తాయి. హెచ్‌వీఏసీ కంట్రోల్స్ లుక్ కూడా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టాప్ ఎండ్ వేరియంట్లో కూడా లేని పానోరమిక్ సన్‌రూఫ్‌ను ఈసారి తీసుకోస్తోంది సంస్థ.
6 ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్ టెక్నాలజీతో పాటు హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికిల్ స్టెబులిటీ మేనేజ్మెంట్ వంటి ఫీచర్స్ ఇందులో ఉండొచ్చు.
ఇంజిన్ వివరాలు ఇలా..
త్వరలో లాంచ్‌కానున్న 2023 కియా సెల్టోస్ ఎస్‌యూవీలో సరికొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇవి.. 160 హెచ్‌పీ పవర్- 253 ఎన్ఎం టార్క్, 113.4 హెచ్‌పీ పవర్- 244 ఎన్ఎం టార్క్, 113.4 హెచ్‌పీ పవర్- 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తాయి.
ఇక ఈ మోడల్ సంబంధించిన ధరతో పాటు ఇతర వివరాలు లాంచ్ సమయంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ ప్రీమియం కారు ఎక్స్‌షోరూం ధర రూ. 10.89లక్షలు- రూ. 19.65లక్షల మధ్యలో ఉండొచ్చని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
ఇక లాంచ్ అనంతర 2023 కియా సెల్టోస్.. హ్యుందాయ్ క్రేటా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, హ్యుందాయ్ అల్కజార్, వెన్యూకు గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.