WhatsApp : మీ పడకగదిలోని మాటలను వాట్సాప్ వింటోందట.. నిజమేనా?
12 May 2023, 10:34 IST
- WhatsApp microphone usage : ప్రైవసీ విషయంలో వాట్సాప్‌పై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక ఇప్పుడు.. మీరు పడుకున్నప్పుడు, లేచి ఉన్నా.. మీ మాటలను వాట్సాప్ వింటోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత?
మీ పడకగదిలోని మాటలను వాట్సాప్ వింటోంది.. జాగ్రత్త!
WhatsApp microphone usage : సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ లేకుండా ఒక్క రోజు కూడా గడవదు! మెసేజింగ్, ఆడియో- వీడియో.. ఇలా అన్నింటికీ ఈ ఫేస్బుక్ (మెటా) ఆధారిత యాప్‌ను వాడుతుంటాము. అయితే.. 'ప్రైవసీ' విషయంలో వాట్సాప్‌పై అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఆరోపణల జాబితాలో తాజాగా మరొకటి చేరింది. 'మీ పడకగది మాటలను వాట్సాప్ వింటోంది.. జాగ్రత్త!' అంటూ పలువురు ఆరోపిస్తున్నారు!
నిద్రపోతున్నప్పుడు కూడా..!
వాట్సాప్ మైక్రోఫోన్స్పై వివాదం కొనసాగుతోంది. యూజర్లు నిద్రపోతున్నప్పుడు కూడా ఇవి యాక్టివ్‌గా ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అపర కుబేరుడు ఎలాన్ మస్క్, భారత ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రకేశేఖర్లు సైతం ఇదే విధంగా స్పందిస్తున్నారు. "వాట్సాప్‌ను అస్సలు నమ్మలేము," అని ఎలాన్ మస్క్ అన్నారు. వాట్సాప్‌పై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్నామని రాజీవ్ స్పష్టం చేశారు.
WhatsApp microphone bug : యూజర్లకు సంబంధించిన అనేక ప్రైవసీ విషయాలు వాట్సాప్ వద్ద ఉంటాయి. యాప్‌నకు పర్మీషన్స్ ఇస్తుండటంతో.. కాంటాక్ట్స్, లొకేషన్, మైక్రోఫోన్, ఫొటోలు, వీడియోలు, కాల్ లాగ్స్, ఎస్ఎంఎస్లు, కెమెరాలపై వాట్సాప్‌కు పట్టు లభిస్తోంది. ఈ స్థాయిలో యాక్సెస్ లభిస్తుండటంతో ప్రజల ప్రైవసీకి ముప్పు ఉంటుందని పులువురు చెబుతున్నారు.
ట్విట్టర్ ఇంజినీర్ ఫోడ్ డబిరి ప్రకారం.. యూజర్లు పడుకున్నప్పుడు, మెలుకుని ఉన్నప్పుడు యాప్‌ను వాడకపోయినా ఆడియో రికార్డ్ అవుతోంది.
WhatsApp latest news : "మైక్రోఫోన్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో వాడుతోంది వాట్సాప్. నేను పడుకున్నప్పుడు, లేచినప్పుడు కూడా రికార్డు చేస్తోంది. అసలేం జరుగుతోంది?" అని ఫోడ్ డబిరి ట్వీట్ చేశారు.
ఫోడ్ ట్వీట్‌ను ఎలాన్ మస్క్ రీ ట్వీట్ చేస్తూ.. వాట్సాప్‌పై తన అంసతృప్తిని వ్యక్తం చేశారు. వాట్సాప్‌ను నమ్మలేమన్నారు.
ఈ ఆరోపణల్లో నిజమెంత..?
ఈ విషయంపై వాట్సాప్ స్పందించింది. ఈ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేసింది. ఈ తరహా ఇబ్బందులు.. ఫోన్‌పై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. పిక్సెల్ ఫోన్లో ఆడియో బాక్గ్రౌండ్లో రికార్డ్ అవుతోందని వివరించింది.
WhatsApp new features : "వాట్సాప్‌పై ఆరోపణలు చేసిన ట్విట్టర్ ఇంజినీర్‌ను మేము కాంటాక్ట్ అయ్యాము. పిక్సెల్ ఫోన్ వాడి ఆయన ట్వీట్ చేశారు. పిక్సెల్ ఫోన్లో బగ్ ఉందని మేము విశ్వసిస్తున్నాము. ప్రైవసీ డాష్‌బోర్డ్‌ను మైక్రోఫోన్‌గా భావిస్తోంది ఈ గ్యాడ్జెట్. దీనిని ఫిక్స్ చేయాలని గూగుల్‌కు చెప్పాము," అని వాట్సాప్ ట్వీట్ చేసింది.
"ఆండ్రాయిడ్‌కు సంబంధించిన బగ్ ఇది. వాట్సాప్‌తో సంబంధం లేదు. గూగుల్‌ను ఫిక్స్ చేయామని చెప్పాము. మీ కాల్స్, వాయిస్ నోట్స్‌కు పూర్తిస్థాయిలో రక్షణ ఉంది," అని మెటా డైరక్టర్- ఇండియా పబ్లిక్ పాలసీ హెడ్ శివ్‌నాథ్ థుక్రల్ స్పష్టం చేశారు.
మైక్ సెట్టింగ్స్‌పై వాట్సాప్ యూజర్లకు పూర్తి నియంత్రణ ఉంటుందని ఎఫ్బీ ఆధారిత సంస్థ స్పష్టం చేసింది. కాల్, రికార్డింగ్, వీడియో సందర్భాల్లోనే మైక్‌కు యాక్సెస్ లభిస్తుందని తెలిపింది. పైగా.. ఈ సంభాషణలకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సదుపాయం కూడా ఉందని గుర్తుచేసింది.