Virat Kohli Angry: ఇది నా ప్రైవసీపై జరిగిన దాడి: తన రూమ్‌ వీడియోపై విరాట్ కోహ్లి సీరియస్‌-virat kohli angry over his hotel room video leakage ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli Angry Over His Hotel Room Video Leakage

Virat Kohli Angry: ఇది నా ప్రైవసీపై జరిగిన దాడి: తన రూమ్‌ వీడియోపై విరాట్ కోహ్లి సీరియస్‌

Hari Prasad S HT Telugu
Oct 31, 2022 02:17 PM IST

Virat Kohli Angry: ఇది నా ప్రైవసీపై జరిగిన దాడి అంటూ తన హోటల్‌ రూమ్‌ వీడియో లీక్‌ కావడంపై విరాట్ కోహ్లి సీరియస్‌ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోమవారం (అక్టోబర్‌ 31) ఓ పోస్ట్ చేశాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (AFP)

Virat Kohli Angry: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లి ఉంటున్న హోటల్‌ రూమ్‌ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అయితే దీనిపై కోహ్లి తీవ్రంగా మండిపడ్డాడు. సోమవారం (అక్టోబర్‌ 31) ఓ ఇన్‌స్టా పోస్ట్‌లో తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ వీడియో తనకు భయం కలిగించిందని, మతి పోయినంత పనైందని విరాట్‌ చెప్పాడు.

కోహ్లి వరల్డ్‌కప్‌లో ఆడేందుకు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ విరాట్‌ ఉంటున్న హోటల్‌ రూమ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. "కింగ్‌ కోహ్లి ఉంటున్న హోటల్‌ రూమ్‌" అంటూ ఆ వీడియోను ఎవరో పోస్ట్‌ చేశారు. హోటల్‌ సిబ్బందే ఎవరో ఈ వీడియోను తీసినట్లు స్పష్టమవుతోంది.

ఈ వీడియోకు కొన్ని నిమిషాల్లోనే 25 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ ఫేవరెట్‌ ప్లేయర్స్‌ను చూడటానికి, వాళ్లను కలవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతారని, ఎంతో సంతోషిస్తారని.. అయితే ఇలాంటి వీడియోలు మాత్రం తన ప్రైవసీపై జరిగిన దాడిగానే భావిస్తానని కోహ్లి స్పష్టం చేశాడు.

"తమ ఫేవరెట్‌ ప్లేయర్స్‌ను చూడటానికి, వాళ్లను కలవడానికి అభిమానులు ఎంతో సంతోషిస్తారని నాకు తెలుసు. నేనెప్పుడూ దానిని గౌరవించాను. కానీ ఈ వీడియో మాత్రం భయం కలిగిస్తోంది. నా ప్రైవసీ విషయంలో మతి పోయినట్లయింది. నా హోటల్‌ రూమ్‌లోనే నాకు ప్రైవసీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఇలాంటివి సరికావు. ఇది నా ప్రైవసీపై జరిగిన దాడి. వ్యక్తుల ప్రైవసీని గౌరవించండి. వాళ్లను వినోద వస్తువుగా చూడకండి" అని విరాట్‌ కోహ్లి తన ఇన్‌స్టాలో ఈ వీడియో పోస్ట్‌ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కోహ్లి షేర్‌ చేసిన ఈ పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ స్పందిస్తూ.. ఇది దారుణమైన ప్రవర్తన అని అన్నాడు. ఇందులో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ తప్పిదం కూడా ఉందని మరో యూజర్‌ కామెంట్ చేశాడు. మరికొందరు కోహ్లికి ఈ విషయంలో అండగా నిలుస్తామని చెప్పారు.

WhatsApp channel