Virat Kohli Record in T20 World Cup: విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. గేల్ రికార్డు బ్రేక్ చేసిన రన్నింగ్ మెషిన్-virat kohli becomes second highest run scorer in t20 world cup history ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Record In T20 World Cup: విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. గేల్ రికార్డు బ్రేక్ చేసిన రన్నింగ్ మెషిన్

Virat Kohli Record in T20 World Cup: విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. గేల్ రికార్డు బ్రేక్ చేసిన రన్నింగ్ మెషిన్

Maragani Govardhan HT Telugu
Oct 27, 2022 08:12 PM IST

Virat Kohli Record in T20 World Cup: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్‌ను అధిగమించి రెండో స్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (ANI)

Virat Kohli Record in T20 World Cup: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో వరుస అర్ధశతకాలతో అదరగొడుతున్నాడు. ముందు పాకిస్థాన్‌తో జరిగిన టీ20లో ఆకట్టుకున్న విరాట్.. అనంతరం నెదర్లాండ్స్‌పై కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా టీ20 వరల్డ్‌ కప్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లు ఆడగా.. 89.90 సగటుతో 989 పరుగులు చేశాడు. ఇందులో 12 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధికంగా 89 పరుగులు చేశాడు. పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించడమే కాకుండా ఇప్పటి వరకు ఆస్థానంలో ఉన్న విండీస్ విధ్వంసకారుడు క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టాడు. గేల్.. 33 మ్యాచ్‌ల్లో 34.46 సగటుతో 965 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. ఇంక అందరికంటే అగ్రస్థానంలో శ్రీలంక మాజీ ప్లేయర్ మహేలా జయవర్ధనే ఉన్నాడు. ఇతడు 31 మ్యాచ్‌ల్లో 39.07 సగటుతో 1016 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ సహా ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి.

విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఇప్పటి వరకు రెండు సార్లు పొట్టి ప్రపంచకప్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు. మొదట 2014లో 319 పరుగులతో ఈ అవార్డు తీసుకోగా.. అనంతరం 2016లోనూ 273 పరుగులు చేసి గౌరవం అందుకున్నాడు. ఈ విధంగా రెండు సార్లు మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కోహ్లీ రికార్డు సాధించే అవకాశముంది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్‌లో భారత్ ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కావున జయవర్దనే రికార్డు బ్రేక్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

గురువారం నాడు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో విజృంభించిన విరాట్ కోహ్లీ(62).. మరోసారి బ్యాట్ ఝుళిపించాడు. ఈ సారి కూడా అర్ధశతకంతో ఆకట్టుకోగా.. అతడికి కెప్టెన్ రోహిత్ శర్మ(53), సూర్యకుమార్(51) అర్ధసెంచరీలతో తోడుగా నిలిచారు. అనంతరం లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 9 వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం