Honda Electric SUV : హోండా నుంచి సరికొత్త ఈవీ.. రేంజ్, లాంచ్ వివరాలివే!
02 October 2023, 16:01 IST
- Honda Electric car : ఓ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసే పనిలో ఉంది హోండా సంస్థ. లాంచ్ టైమ్, రేంజ్ వంటి వివరాలు బయటకి వచ్చాయి. అవేంటంటే..
హోండా నుంచి సరికొత్త ఈవీ.. రేంజ్ ఎంతంటే..!
Honda Electric SUV : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా.. ఈవీవైపు వేగంగా అడుగులు వేస్తోంది. సంస్థ చరిత్రలోనే తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. దీని పేరు హోండా ప్రొలాగ్! 2024 తొలినాళ్లల్లో ఇది లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
హోండా కొత్త ఈవీ రేంజ్ ఎంతంటే..!
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా సీఆర్-వీ ఎస్‌యూవీతో పోల్చుకుంటే ఈ హోండా ప్రొలాగ్ ఈవీ.. పెద్దగా ఉంటుందని సమాచారం. ఇంటీరియర్ కూడా పెద్దగా ఉంటుందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ హోండా కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్‌లో 85 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉండొచ్చు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 482 కి.మీల దూరం ప్రయాణించవచ్చు. సింగిల్ మోటార్ లేదా డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ఉండొచ్చు. ఈ ఇంజిన్ 288 బీహెచ్పీ పవర్‌ను, 451 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేసే విధంగా ఉంటుంది.
Honda Prologue EV : కేవలం ఎలక్ట్రిక్ వాహనాల కోసమే ఓ కొత్త ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది హోండా సంస్థ. ఈ ప్రొలోగ్ ఎస్‌యూవీని ఇందులోనే తయారు చేస్తోంది. రానున్న సంవత్సరాల్లో మరిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఈ ప్లాట్‌ఫామ్‌పై తయారయ్యే అవకాశం లేకపోలేదు!
ఇదీ చూడండి:- Skoda new electric vehicle : స్కోడా నుంచి సరికొత్త ఈవీ.. తక్కువ ధరకే క్రేజీ ఫీచర్స్!
ఇక ఈ హోండా ప్రొలాగ్ ఇంటీరియర్, ఫీచర్స్పై పెద్దగా డేటా లేదు. అయితే ఇందులో పానోరమిక్ సన్‌రూఫ్ ఉంటుందని తెలుస్తోంది. రేర్‌లో హెచ్- మార్క్ బ్యాడ్జ్ ఉండనుంది. 21 ఇంచ్ వీల్స్ రానున్నాయి. నార్త్ షోర్ పర్ల్ రంగులో ఇది అందుబాటులోకి రావొచ్చు.
ఇండియా లాంచ్ ఎప్పుడు..?
Honda Prologue EV price in India : హోండా నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా గుర్తింపు పొందనున్న ఈ ప్రొలాగ్.. ఇండియాలో ఇప్పట్లో లాంచ్ అవ్వకపోవచ్చు. ఇండియాలో సంస్థ ఫ్యూచర్ ప్లాన్స్‌లో ఈ ఎస్యూవీ పేరు లేకపోవడం ఇందుకు కారణం.
ఇక ఈ మోడల్ లాంచ్ డేట్, పూర్తి ఫీచర్స్, ధర వంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. లాంచ్ టైమ్ సమీపించే కొద్ది.. వీటిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.