Laptop Tips : ల్యాప్‌టాప్‌ని క్లీన్ చేసి ఎంత కాలమైంది? ఈ టిప్స్ పాటించకపోతే మీ డివైజ్ పనిచేయదు!
20 September 2024, 12:10 IST
- Laptop Tips in telugu : మీకు ల్యాప్‌టాప్ క్లీన్ చేసే అలవాటు లేదా? ల్యాప్‌టాప్ మీద బరువు పెడుతున్నారా? బ్యాటరీని ఛార్జ్‌లో పెట్టి గంటలు గంటలు వదిలేస్తున్నారా? అయితే మీ ల్యాప్‌టాప్ ఎక్కువ రోజులు పనిచేయదు! ఈ టిప్స్ పాటిస్తే మీరు మీ ల్యాప్‌టాప్‌ని చాలా కాలం పాటు ఎలాంటి సమస్యలు లేకుండా వాడుకోవచ్చు.
ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ల్యాప్టాప్స్ అనేవి ఇప్పుడు మనిషి జీవితంలో ఒక భాగం! ఆఫీస్ పనులకైనా, వ్యక్తిగత పనులకైనా ప్రతి ఇంట్లో ల్యాప్టాప్స్ ఇప్పుడు ఒక తప్పనిసరి డివైజ్‌లుగా మారిపోయాయి. అయితే ఒక మంచి ల్యాప్‌టాప్ కొనాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే! దీనికి ముందు నుంచే బడ్జెట్ వేసుకోవాల్సి వస్తుంది. తీరా మంచి ల్యాప్‌టాప్ కొన్న తర్వాత కొన్ని తప్పుల కారణంగా అది కొంతకాలానికై పాడైపోతుంది. మీకు ఇలా జరగకూడదంటే.. ల్యాప్‌టాప్‌ని సరిగ్గా చూసుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో కింద చెప్పే టిప్స్‌ని పాటిస్తే, చాలా కాలం పాటు ఎలాంటి సమస్యలు రాకుండా మీరు మీ ల్యాప్‌టాప్‌ని వాడుకోవచ్చు. అవేంటంటే..
ల్యాప్‌టాప్స్‌ని ఇలా జాగ్రత్తగా చూసుకోండి..
ల్యాప్‌టాప్‌ని క్లీన్ చేస్తూ ఉండండి:- ల్యాప్‌టాప్స్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా అవసరం. కానీ చాలా మంది మర్చిపోతుంటారు. కీబోర్డులో ఉన్న దుమ్ము, మట్టిని దులిపి ఎంత కాలమైంది? ఇది కరెక్ట్ కాదు! కీబోర్డ్, టచ్‌ప్యాడ్, డిస్ప్లేని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఇలా చేయకపోతే ల్యాప్‌టాప్‌లు ఫిజికల్‌గా డామేజ్ అవొచ్చు. కీబోర్డ్‌లో కీలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఓవర్‌హీటింగ్ వల్ల సమస్యలు తలెత్తొచ్చు. మైక్రోఫైబర్ క్లాత్‌తో క్లీన్ చేయాలి. చిన్న బ్రష్‌లు, కాటన్ కూడా పనికొస్తాయి.
బ్యాటరీ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయండి:- ల్యాప్‌టాప్స్‌లో బ్యాటరీ అనేది చాలా ముఖ్యమైనది. బ్యాటరీ లైఫ్‌ని పెంచేందుకు మీరు కొన్ని టిప్స్ పాటించడం చాలా అవసరం. ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత కూడా బ్యాటరీని ఛార్జ్‌లో పెట్టి వదిలేస్తున్నారా? అయితే ముందు మీరు మీ ల్యాప్‌టాప్‌లో ఆటోమెటిక్ ఓవర్ఛార్జింగ్ ప్రొటెక్షన్ సెటప్ ఉందో లేదో తెలుసుకోండి. ఒకవేళ లేకపోతే.. బ్యాటరీని ఎక్కువ ఛార్జ్ చేయడంతో ప్రమాదాలు తలెత్తొచ్చు.
మరోవైపు బ్యాటరీని 80శాతం ఛార్జ్ చేయడం ఉత్తమం. ప్రతిసారీ ఫుల్ ఛార్జ్ చస్తే బ్యాటరీ పాడైపోవచ్చు. అదే సమయంలో ల్యాప్‌టాప్ బ్యాటరీ 0 అయ్యేంత వరకు వెయిట్ చేయకండి. ఛార్జింగ్ తక్కువ ఉంటే లిథియం బ్యాటరీలు తొందరగా పాడైపోవచ్చు.
వెంటిలేషన్ చాలా ముఖ్యం:- ల్యాప్‌టాప్‌లోని ఫ్యాన్స్, వెంట్స్ బాగా పనిచేస్తేనే డివైజ్‌లు ఎక్కువ కాలం బాగుంటాయి. చాలా ల్యాప్‌టాప్స్‌లో ఇవి కిందవైపు ఉంటాయి. ఫలితంగా వెంటిలేషన్ అందక ఇబ్బందులు ఎదురవుతాయి. అదే సమయంలో ల్యాప్‌టాప్ కింద క్లాత్, పిల్లోలు పెట్టకండి. వాటి వల్ల డివైజ్ ఓవర్ హీట్ అవుతుంది. ల్యాప్‌టాప్ స్టాండ్ ఒకటి కొనుక్కోండి.
ల్యాప్‌టాప్‌ని 'సేఫ్'గా చూసుకోండి:- ల్యాప్‌టాప్ వాడిన తర్వాత దాన్ని ఎక్కడ పెడుతున్నాము అన్నది కూడా ముఖ్యమే! వేడి వాతావరణంలో వాటిని వదిలేయకూడదు. దీని వల్ల పరికరంలోని భాగాలు దెబ్బతినొచ్చు. నీరు ఉన్న చోట కూడా పెట్టకూడదు. తేమ ఎక్కవ ఉన్న చోట కూడా పెట్టకపోవడం బెటర్. ఇంకో విషయం! ల్యాప్టాప్స్ మీద ఎలాంటి వస్తువులు పెట్టకండి. చిన్న బరువు ఉండే వస్తువులు కూడా పెట్టకూడదు.
మంచి ల్యాప్‌టాప్ బ్యాగ్ ఎంచుకోండి:- ఇప్పుడు ప్రపంచం 'వర్క్ ఫ్రం ఎనీవేర్'గా మారిపోయింది. ఫలితంగా ఎక్కడికి వెళ్లినా ల్యాప్‌టాప్ పట్టికెళ్లాల్సి వస్తోంది. అందుకే ఒక మంచి ల్యాప్‌టాప్ బ్యాగ్‌ని కొనుక్కోవాల్సిన అవసరం చాలా ఉంది. మీ ల్యాప్‌టాప్ దెబ్బతినకుండా ఉండాలంటే.. మంచి బ్యాగ్ అవసరం.