Nio EV battery : వావ్.. 1000కి.మీ రేంజ్ ఇచ్చే బ్యాటరీని తయారు చేసిన ఈవీ కంపెనీ!
Nio EV battery : 1000కి.మీ రేంజ్‌ని ఇచ్చే బ్యాటరీని రూపొందించింది చైనాకు చెందిన ఓ ఈవీ కంపెనీ. 14 గంటలు నడిపినా.. ఛార్జింగ్ చేయాల్సిన అవసరం రాకపోగా.. ఇంకా 3శాతం బ్యాటరీ మిగిలి ఉండటం విశేషం!
Nio EV battery : ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో సంచలనం! ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతున్న వేళ.. ఏకంగా 1000 కి.మీ రేంజ్‌ని ఇచ్చే బ్యాటరీని తయారు చేసింది చైనాకు చెందిన ఈవీ సంస్థ నియో. అంతేకాకుండా.. బ్యాటరీ సామర్థ్యాన్ని గ్రాండ్‌గా ప్రదర్శించింది ఆ కంపెనీ. నియో సీఈఓ విలయమ్ లీ.. ఆ బ్యాటరీ ఉన్న కారులో 14 గంటలు పాటు.. ఏకంగా 1,044 కి.మీల దూరం ప్రయాణించడం విశేషం.
అతిపెద్ద రేంజ్ ఇచ్చే బ్యాటరీ..!
పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇండియాతో పాటు ప్రపంచం వ్యాప్తంగా ఈవీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఆటోమొబైల్ సంస్థలు పోటీపడి మరి కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ని లాంచ్ చేస్తున్నారు. అదే సమయంలో.. వెహికిల్ రేంజ్పైనా పరిశోధనలు జరుగుతున్నాయి.
Highest battery range car : చైనాలో నియో సంస్థకు మంచి పేరు ఉంది. ఎలాన్ మస్క్ టెస్లాకు ఈ నియో గట్టిపోటీనిస్తోంది. ఇక ఆ కంపెనీ సీఈఓ విలియమ్ లీని.. అక్కడి ప్రజలు.. చైనా ఎలాన్ మస్క్ అని పిలుచుకుంటారు.
డిసెంబర్ 17న షాంఘైలో.. నియో ఈటీ7 ఎలక్టరిక్ కారు ఎక్కి.. తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు విలియమ్ లీ. 14 గంటల పాటు.. 1044 కి.మీల దూరం ప్రయాణించారు. ఆ జర్నీని లైవ్ స్ట్రీమ్ చేశారు. 14 గంటల తర్వాత.. నియో ఈటీ7 ఈవీ.. షోమిన్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడితో విలియమ్ జర్నీ ముగిసినా.. బ్యాటరీ మాత్రం ఇంకో 3శాతం మిగిలే ఉండటం విశేషం.
NIO EV battery range : ఈ నియో ఈటీ7 ఈవీలో 150 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉందని తెలుస్తోంది. ఇది.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎనర్జీ డెన్సిటీ కలిగిన బ్యాటరీ సంస్థ చెబుతోంది. ఈ టెక్నాలజీ ద్వారా.. ఎలక్ట్రిక్ వెహికిల్ రేంజ్ భారీగా పెరిగిందని స్పష్టం చేస్తోంది.
2024 ఏప్రిల్ నాటికి ఈ 150 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ మాస్ ప్రొడక్షన్‌ని ప్రారంభించాలని నియో సంస్థ ప్లాన్ చేస్తోంది. అయితే.. ఇది భారీ ఖర్చుతో కూడిన వ్యవహారమే అని చెప్పుకోవాలి. ఈ విషయాన్ని నియో సంస్థ కూడా అంగీకరించింది. ఒక్క బ్యాటరీ విలువ సుమారు 42,100 డాలర్లు ఉంటుందని సంస్థ చెబుతోంది. ఇది.. మొత్తం టెస్లా వై మోడల్‌కు సమానం! కానీ ఈవీ విషయంలో దండయాత్ర చేయాలని గత కొన్నేళ్లుగా ప్లాన్ చేస్తున్న నియో.. ఖర్చు ఎంతవుతుంది? అన్నది పక్కనపెట్టి.. ఈ బ్యాటరీ టెక్నాలజీతో ముందుకెళ్లాలని చూస్తోంది.
EV battery with 1000km range : అయితే.. ఈ ఈటీ7 ఎలక్ట్రిక్ కారులో రెండో బ్యాటరీ కూడా ఉండే అవకాశం ఉంది. 1000 కి.మీల రేంజ్ ఇచ్చే బ్యాటరీ అంటే.. సాధారణంగా ధర ఎక్కువగానే ఉంటుంది. దానిని కొనుగోలు చేయలేని వారి కోసం ఆ బ్యాటరీ లేకుండానే కారును విక్రయించాలని చూస్తోంది నియో.
సంబంధిత కథనం