Zepto: యువతిని అవమానించేలా ‘జెప్టో’ నుంచి దారుణమైన మెసేజ్; మండిపడ్తున్న నెటిజన్లు
15 October 2024, 15:41 IST
Zepto: గ్రోసరీ సహా అన్ని నిత్యావసరాలను వేగంగా డెలివరీ చేసే ప్లాట్ ఫామ్ ‘జెప్టో’ బెంగళూరుకు చెందిన ఒక యువతికి పంపిన మెసేజ్ వివాదాస్పదమైంది. ఒక అత్యవసర గర్భనిరోధక పిల్ ‘మిస్ యూ పల్లవి..’ అంటున్నట్లుగా ఉన్న ఆ మెసేజ్ ను పల్లవి అనే ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
యువతిని అవమానించేలా ‘జెప్టో’ నుంచి దారుణమైన మెసేజ్
Zepto inappropriate message: క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ కు అవాంఛిత, అనుచితమైన నోటిఫికేషన్ పంపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'ఐ మిస్ యూ పల్లవి' అంటూ ఐ-పిల్ ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్ర చెబుతున్నట్లుగా ఆ కస్టమర్ పల్లవి పరీక్ కు మెసేజ్ ను పంపించారు. ఆ మెసేజ్ పక్కన మూడు కన్నీటితో కూడిన ఎమోటికాన్స్ ను కూడా జత చేశారు. తనకు జెప్టో నుంచి వచ్చిన ఆ మెసేజ్ తో కస్టమర్ పల్లవి పరీక్ షాక్ కు గురయ్యారు.
లింక్డ్ఇన్ లో ఘాటు పోస్ట్
వెంటనే, ఈ మెసేజ్ ను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లింక్డ్ఇన్ లో ఈ మెసేజ్ ను షేర్ చేసిన పల్లవి.. జెప్టో కంపెనీ నైతిక ప్రమాణాలను ప్రశ్నించారు. జెప్టో నుంచి వచ్చిన ఆ నోటిఫికేషన్ స్క్రీన్ షాట్ ను లింక్డ్ఇన్ లో షేర్ చేసి, జెప్టో, దాని సహాయక బృందాన్ని ట్యాగ్ చేసింది. ఆమె తన పోస్ట్ లో ఆ సందేశం అనుచిత, అవాంఛిత ధోరణిని ప్రశ్నించారు. ‘‘డియర్ జెప్టో అండ్ జెప్టో కేర్స్ టీమ్, ఇందులో చాలా విషయాలు తప్పు’’ అని జెప్టోను ఉద్దేశించి ఆమె రాసుకొచ్చారు. ‘‘నేనెప్పుడూ మీ దగ్గర్నుంచి ఎమర్జెన్సీ పిల్ ఆర్డర్ చేయలేదు. ఒకవేళ నేను అలా చేసినా, ఇది నన్ను మిస్ అవ్వాల్సిన విషయం కాదని లేదా నేను దానిని మిస్ అవడం లేదని మీరు తెలుసుకోవాలి’’ అని వివరించారు. అలాగే, జెప్టో పంపిన ఆ సందేశం వెనుక ఉన్న అంతరార్థాన్ని ఆమె ప్రశ్నించారు. ‘‘నేను అత్యవసర గర్భనిరోధకం తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారా? అన్నిటికంటే ముఖ్యంగా, నేను ఇంతవరకు అలాంటి ఎమర్జెన్సీ గర్భనిరోధక పిల్ ఆర్డర్ ను మీ దగ్గర పెట్టలేదు. కదా, అలాంటప్పుడు, ఆ మెసేజ్ నాకు ఇది ఎందుకు వస్తుంది?’’ అని పల్లవి ఘటుగా ప్రశ్నించారు.
నైతిక హద్దులను దాటేశారు
మీ సందేశం నైతిక హద్దులను దాటేసిందని పల్లవి జెప్టోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సందేశం సున్నితంగా లేదా హాస్యభరితంగా ఉంటే లేదా దానికి కొంత లాజిక్ ఉంటే ఓకే. కానీ, ఇలా నైతిక హద్దులను దాటేలా ఉండకూడదు’’ అని మందలించింది. అయితే, ఈ మెసేజ్ తో నిరాశ చెందినప్పటికీ, జెప్టో సేవలను ఇప్పటికీ అభినందిస్తున్నానని పల్లవి పేర్కొంది. తన దైనందిన జీవితంలో తరచుగా జెప్టో వంటి శీఘ్ర వాణిజ్య వేదికలపై ఆధారపడతానని పేర్కొంది.
జెప్టో స్పందన
పల్లవి పోస్ట్ పై జెప్టో స్పందించింది. తమ తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పింది. "హే పల్లవి, మేము గందరగోళానికి గురయ్యాము. మమ్మల్ని క్షమించండి. ఇది ఎంత అనాలోచితమైనది, హానికరమైనదో మేము అర్థం చేసుకున్నాము" అని కంపెనీ లింక్డ్ఇన్ (LinkedIn) లో పేర్కొంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించామని, తమ నోటిఫికేషన్ ప్రక్రియలను అప్డేట్ చేయడానికి, తమ బృందానికి శిక్షణ ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. "ఈ తప్పు మళ్ళీ జరగదు" అని జెప్టో హామీ ఇచ్చింది.
సోషల్ మీడియా రియాక్షన్
పల్లవి పోస్ట్ సోషల్ మీడియా (social media) యూజర్లలో జోరుగా చర్చకు దారితీసింది. "పల్లవి పరీక్ వాదనను 100% అంగీకరిస్తున్నాం" అని మెజారిటీ యూజర్లు స్పందించారు. ‘‘కంపెనీలు కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence)పైనే ఆధారపడినప్పుడు ఎదురయ్యే సవాలు ఇది. దీనిని పర్యవేక్షించడానికి అన్ని బ్రాండ్లకు మానవ ఉనికి అవసరం!’’ అని ఒక నెటిజన్ స్పందించారు. ‘‘ఇది ఎలా సాధ్యమైంది? కంపెనీలకు మెరుగైన శిక్షణ అవసరం. ఇది సరైనదే అని వారు ఎలా అనుకున్నారు?’ అని మరొకరు వ్యాఖ్యానించారు.