Dead mouse in Hershey's syrup: జెప్టో డెలివరీ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుక; హడలిపోయిన కుటుంబం
ఆన్ లైన్ గ్రాసరీ డెలివరీ స్టోర్ జెప్టో ద్వారా ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుక ను చూసి ఆ కుటుంబం ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది. బాటిల్ లోపల చచ్చిన ఎలుక ఉన్న విషయం తెలియని ఆ కుటుంబ సభ్యులు ఆ సిరప్ ను వినియోగించి, అనారోగ్యం పాలయ్యారు.
ఆన్ లైన్ గ్రాసరీ డెలివరీ యాప్ ‘జెప్టో’(Zepto) ద్వారా ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్లో చనిపోయిన ఎలుకను చూసిన ఆ కుటుంబం ఒక్కసారిగా హడలిపోయింది. ఆ భయానక వీడియోను ఆ కుటుంబంలోని ఓ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కుటుంబంలో ముగ్గురు కలుషిత సిరప్ తాగారని, వారిలో ఒకరిని వైద్య చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చిందని ఆ వీడియోను షేర్ చేసిన ప్రమీ శ్రీధర్ తెలిపారు.
చాక్లెట్ సిరప్ లో చచ్చిన ఎలుక
హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్ లోపల చనిపోయిన ఎలుకకు సంబంధించిన భయానక వీడియోను ప్రమీ శ్రీధర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. బ్రౌనీ కేక్స్ తో తినడానికి తన కుటుంబం జెప్టో ద్వారా ఈ హెర్షే చాక్లెట్ సిరప్ ను ఆర్డర్ చేసిందని ఆమె చెప్పారు. అయితే, బాటిల్ లో నుంచి సిరప్ ను బయటకు పోస్తున్నప్పుడు, సిరప్ లో చిన్న వెంట్రుకలను గమనించామని, అయితే, అప్పటికే తన కుటుంబంలోని ముగ్గురు పిల్లలు ఆ సిరప్ ను వినియోగించారని ఆమె చెప్పారు.
ఆసుపత్రిలో చికిత్స
హెర్షే చాక్లెట్ సిరప్ బాటిల్ లోపల ఉన్నది చచ్చిన ఎలుకేనని నిర్ధారించుకోవడానికి వారు ఆ సిరప్ ను ఒక కప్ లో పోశారు. అందులో వారికి చచ్చిన ఎలుక కనిపించింది. అది చనిపోయిన ఎలుకేనని నిర్ధారించుకోవడానికి వారు ఆ ఎలుకను కడిగి కూడా చూశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించామని, అయితే, అటు జెప్టో (Zepto) నుంచి కానీ, ఇటు హెర్షే (Hershey) నుంచి కానీ స్పందన లేదని శ్రీధర్ తెలిపారు. ఆ సిరప్ తాగిన ముగ్గురు అమ్మాయిలు అస్వస్థతకు లోనయ్యారని, వారిలో ఒక బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుందని వివరించారు.
నెటిజన్ల ఆందోళన
ఈ భయానక వీడియోపై పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందించారు. ‘‘ఇది చాలా ఆందోళనకరం, ఆమోదయోగ్యం కాదు. నాణ్యత లేకపోవడం గురించి మేము ఆందోళన చెందుతున్నాము’’ అని శ్రీధర్ తన ఇన్స్టాగ్రామ్ లో రాశారు. ప్యాకేజ్డ్ ఫుడ్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, పిల్లలకు ఇచ్చే ఫుడ్ ను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని ఆమె హెచ్చరించారు. మే 29న షేర్ చేసిన ఈ వీడియో 5 మిలియన్లకు పైగా వ్యూస్ తో వైరల్ గా మారింది.
హెర్షే స్పందన
ఈ వీడియోకు వచ్చిన చాలా కామెంట్లలో శిరీష్ నుంచి ఒక కామెంట్ కూడా వచ్చింది. ‘‘హాయ్, ఇది చూసి మేము చాలా బాధపడుతున్నాము. దయచేసి మాకు యూపీసీ, తయారీ కోడ్ ను బాటిల్ నుండి రిఫరెన్స్ నంబర్ తో consumercare@hersheys.com పంపండి. మా టీమ్ సభ్యులలో ఒకరు మీకు సహాయపడగలరు’’ అని కంపెనీ హెర్షే కంపెనీ నుంచి శిరీష్ స్పందించాడు. కాగా, ఈ ఘటనపై వివరణ కోసం హిందుస్థాన్ టైమ్స్ హెర్షేను సంప్రదించింది. మరియు ప్రతిస్పందన వచ్చిన తర్వాత ఈ కాపీని అప్ డేట్ చేస్తుంది.