Adani crisis : 'అదానీ'తో పెట్టుబడిదారులకు రూ. 10 ట్రిలియన్ నష్టం!
14 February 2023, 7:45 IST
Adani group crisis : అదానీ గ్రూప్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మదుపర్లకు ఇప్పటికే రూ. 10 ట్రిలియన్ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.
'అదానీ'తో పెట్టుబడిదారులకు రూ. 10 ట్రిలియన్ నష్టం!
Adani group crisis : హిన్డెన్బర్గ్- అదానీ వ్యవహారం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రూప్‌పై దర్యాప్తు చేపట్టాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ పూర్తి వ్యవహారంలో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయినట్టు కనిపిస్తోంది! హిన్డెన్బర్గ్ నివేదిక బయటకి వచ్చిన నాటి నుంచి సోమవారం వరకు ఇన్వెస్టర్లు ఇప్పటికే రూ. 10 ట్రిలియన్ సంపదను పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది.
హిన్డెన్బర్గ్ ఎఫెక్ట్..
అదానీ గ్రూప్ కంపెనీల్లో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని, ఆ సంస్థ స్టాక్ మేన్యుపులేషన్కు పాల్పడుతోందని గత నెల 24న ఆరోపించింది హిన్డెన్బర్గ్ అనే యూఎస్ రీసెర్చ్ సంస్థ. తాము అదానీ స్టాక్స్‌ను షార్ట్ సెల్ చేసినట్టు పేర్కొంది. ఈ నివేదికతో అదానీ గ్రూప్ స్టాక్స్‌లో మొదలైన రక్తపాతం.. ఇప్పటికీ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి అదానీ గ్రూప్ మార్కెట్ వాల్యూ రూ. 8.98ట్రిలియన్కు పడిపోయింది. కొన్ని రోజుల క్రితం వరకు ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే మదుపర్ల నష్టం రూ. 10 ట్రిలియన్ దాటిందని సమాచారం.
ఇదీ చదవండి : అదానీ వ్యవహారంపై నాయకుడి 'మౌనం'.. దేనికి సంకేతం?
అదానీ గ్రూప్ స్టాక్స్‌కు సంబంధించిన వెయిటేజ్‌ను తగ్గించుకుంటున్నట్టు ఎంఎస్సీఐ ప్రకటించడంతో మదుపర్ల సెంటిమెంట్ మరింత నెగిటివ్‌గా మారింది. ఫలితంగా అదానీ స్టాక్స్‌లో అమ్మకాల తీవ్రత మరింత పెరిగింది. ఒక్క సోమవారం ట్రేడింగ్ సెషన్లోనే అదానీ ఎంటర్ప్రైజెస్ 7శాతం, అదానీ పోర్ట్స్ 5.27శాతం పతనమయ్యాయి. ఇక అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్మిషన్ స్టాక్స్.. 5శాతం లోవర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి.
"ఎంఎస్‌సీఐలో వెయిటేజ్ తగ్గడంతో అదానీ గ్రూప్ స్టాక్స్‌లో కరెక్షన్ వస్తుందని ముందే భావించాము. అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా పడ్డాయి. అదానీ పోర్ట్స్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌పై కొన్ని ఫండ్స్ ఫోకస్ చేస్తున్నాయి. వాటి వాల్యుయేషన్స్ ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయి. ఆయా స్టాక్స్ ఇంకాస్త పడితే.. ఫండ్స్ వాటిని కొనుగోలు చేయడం మొదలుపెట్టొచ్చు," అని ఓ ఫండ్ మేనేజర్ వివరించారు.
అదానీ స్టాక్స్.. ఢమాల్..!
Adani Group stocks crash : అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ప్రస్తుతం రూ. 1706 వద్ద ఉంది. నెల రోజుల వ్యవధిలో 52శాతం పతనమైంది. ఇక రూ. 553 వద్ద ఉన్న అదానీ పోర్ట్స్ స్టాక్.. నెల రోజుల్లో దాదాపు 30శాతం పడింది. అదానీ టోటల్ గ్యాస్ షేరు ధర రూ. 1,192 వద్ద ఉండగా.. నెల రోజుల్లో ఇది ఏకంగా 68శాతం నష్టపోయింది.