Adani crisis : అదానీ వ్యవహారంపై నాయకుడి 'మౌనం'.. దేనికి సంకేతం?-adani crisis what prompts stoic silence of the nation s leadership ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Adani Crisis : అదానీ వ్యవహారంపై నాయకుడి 'మౌనం'.. దేనికి సంకేతం?

Adani crisis : అదానీ వ్యవహారంపై నాయకుడి 'మౌనం'.. దేనికి సంకేతం?

HT Telugu Desk HT Telugu
Feb 13, 2023 11:59 AM IST

PM Modi Adani crisis : పార్లమెంట్​లో ప్రధాని మోదీ ఇటీవలే చేసిన ప్రసంగంలో అదానీ వ్యవహారాన్ని ఒక్కసారిగా కూడా ప్రస్తావించలేదు. పైగా.. తనకు ప్రజల మద్దతు ఉందంటూ ఆయన మాట్లాడటం ఆశ్చర్యానికి గురిచేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అదానీ- మోదీకి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన
అదానీ- మోదీకి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన (AFP)

Adani Modi relationship : అదానీ గ్రూప్​ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినప్పటికీ.. భారత ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై సరైన రీతిలో ఇంకా స్పందించకపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయంపై పార్లమెంట్​ అట్టుడుకుతున్నప్పటికీ.. కేంద్రం, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిశ్శబ్దంగా ఉండిపోవడం చర్చలకు దారితీస్తోంది. పార్లమెంట్​లో ఇటీవల చేసిన ప్రసంగంలోనూ అదానీ అంశంపై మోదీ మౌనంగా ఉండిపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

ప్రజల మద్దతుతో.. ఎదురు దాడి!

పార్లమెంట్​లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం నేపథ్యంలో విపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శించారు ప్రధాని మదీ. అయితే.. ఆయన ప్రసంగంలో ఒక్కసారి కూడా అదానీ వ్యవహారాన్ని ప్రస్తావించలేదు. అదానీపై వస్తున్న ఆరోపణల గురించి మాట్లాడకుండా.. తనకు 140 కోట్ల భారతీయుల మద్దతు ఉందని మోదీ చెప్పుకోవడం ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది! '140కోట్ల ప్రజల మద్దతు ఉంటే.. అత్యంత కీలకమైన విషయంపై నిశ్శబ్దంగా ఉండిపోవచ్చా?' అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. పెట్టుబడిదారులకు అత్యంత ఆప్తుడైనందుకే ఆయన ఏం మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేస్తున్నాయి.

Adani group Hindenburg Research report : మోదీ ప్రసంగాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే మరో విషయం అర్థమవుతుంది. ఓవైపు ఆయన తన బలాన్ని చాటిచెబుతూనే.. విపక్షాలు చేస్తున్న కుట్రకు బాధితుడిగా తనని తాను మోదీ చెప్పుకుంటున్నారని రాజకీయ విశ్లేషకుల ఆరోపిస్తున్నారు.

అదానీ వ్యాపార సామ్రాజ్యంలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని హిన్​డెన్​బర్గ్​ బయటపెట్టిన నివేదికతో.. బడ్జెట్​ సెషన్​లో పార్లమెంట్​ అట్టుడికిపోతోంది. లోక్​సభలో మాట్లాడిన కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. బీజేపీ ప్రభుత్వం, మోదీపై విమర్శల వర్షం కురిపించారు. అనేక ప్రశ్నలను సంధించారు. విపక్షాల నిరసనలతో ఉభయ సభల్లో పలుమార్లు వాయిదాల పర్వం కొనసాగింది. ఇంత జరుగుతున్నా.. అదానీ పేరును ఒక్కసారి కూడా మోదీ ఎత్తకపోవడం, ఆ విషయంపై ఆయన నిశ్శబ్దంగా ఉండిపోవడం గమనార్హం. అదే సమయంలో రాజకీయ లబ్ధి కోసం దేశ ఆర్థిక వ్యవస్థను ముప్పులో పెట్టే విధంగా విపక్షాలు ప్రవర్తిస్తున్నాయని విరుచుకుపడ్డారు మోదీ.

Adani crisis Parliament : "అదానీ వ్యవహారం చాలా తీవ్రమైనది. ఆరోపణలు రుజువైతే.. నష్టం చాలా ఎక్కువే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో.. ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో అయితే వీటిని అత్యంత తీవ్రంగా పరిగణిస్తారు. ఆరోపణలపై స్పందించాలని ప్రభుత్వాన్ని పాలిస్తున్న నాయకుడిపై ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఇండియాలో అలా కాదు! అలా జరగడం లేదు కూడా! ఇక్కడి ప్రజలు నాయకుడిపై, నాయకుడికి లభిస్తున్న ఆకర్షణలో చిక్కుకుపోయారు. పైగా.. ఇండియాలో ఎప్పడూ లేనంత విధంగా అభివృద్ధి సాగుతోందని ప్రచారాలు జరగుతున్నాయి. "దేశం మారుతోంది", "దేశం ఎదుగుతోంది," నినాదాలతో ప్రజల్లో ఒక ఇమేజ్​ పడిపోయింది. ఈ సందర్భాల్లో విపక్షాలపై విమర్శలు, ఆరోపణలతో దాడులు చేయడం సులభమైపోతుంది," ఓ సీనియర్​ రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

సామాన్యుడిపై భారం పడకపోవడంతో..

అదానీ వ్యవహారంపై నాయకుడు నిశ్శబ్ధంగా ఉండిపోవడానికి ఇంకో బలమైన కారణం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి.. అదానీ- హిన్​డెన్​బర్గ్​ వల్ల పెట్టుబడిదారులు నష్టపోయారు. కానీ.. సామాన్యుడి ఆర్థికంపై ఎలాంటి ప్రభావం చూపించలేదు! 'దేశంలో ఇది ఎప్పుడూ జరిగే విషయమే,' అని మధ్యతరగి ప్రజలు అనుకుంటున్నారు. వీరి ఆలోచనలు ప్రభుత్వానికి కలిసివచ్చాయి.

Modi speech in Parliament : ప్రజల్లో తన నాయకత్వంపై మోదీకి చాలా నమ్మకం ఉన్నట్టు కనిపిస్తోంది. కీలకమైన అంశంపై మౌనంగా ఉండిపోయిన ఆయన.. తన మాటల్లో జాతీయవాదాన్ని అనేకమార్లు ప్రస్తావించారు. అదే సమయంలో కాంగ్రెస్​ హయాం నాటి స్కామ్​లు, అవినితి ఘటనలను ప్రస్తావించి ఎదురుదాడికి దిగారు. అదానీపై వచ్చిన అత్యంత తీవ్రమైన ఆరోపణలను 'అబద్ధాలు'గా మోదీ కొట్టిపారేయడాన్ని.. ప్రజలపై ఆయనకు ఉన్న నమ్మకం సూచిస్తోందని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఇటీవలి కాలంలో చైనా నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఇండియాలోకి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. కానీ వీటిపై అదానీ ఎఫెక్ట్​ ఉండే అవకాశం ఉంది. ఈ తరుణంలో.. తీవ్రమైన అంశాన్ని ప్రస్తావించకుండా.. రాజకీయంగా విమర్శలు చేసి, ప్రజల మద్దతు ఉంది అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఇది ఇండియా ఇమేజ్​ను దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Modi Adani friendship : వీటిని పరిశీలిస్తే.. "క్లిష్ట పరిస్థితులు, సమస్యలు ఎదురైన ప్రతిసారీ.. జాతీయవాదాన్ని, ప్రజల నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని లబ్ధిపొందుతూ వెళ్లిపోవచ్చా? ఇంకా ఎంత కాలం ఇలా సాగుతుంది?" అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మరి వీటికి కాలమే సమాధానం చెప్పాలి!

IPL_Entry_Point