Adani stocks crash : మదుపర్లను ముంచేసిన అదానీ స్టాక్స్.. ఒక్క రోజులో రూ. 3.19 ట్రిలియన్ సంపద ఉఫ్!
28 January 2023, 8:01 IST
Adani stocks crash : అదానీ గ్రూప్ స్టాక్స్.. మదుపర్లకు నిద్రలేని రాత్రిని మిగిల్చాయి! ఒక్క శుక్రవారం ట్రేడింగ్ సెషన్లోనే మదుపర్లు రూ. 3.19 ట్రిలియన్ సంపదను కోల్పోయారు. మొత్తం మీద ఇప్పటివరకు రూ. 4.4 ట్రిలియన్ సంపద ఆవిరైపోయింది!
అదానీ స్టాక్స్‌లో రక్తపాతం.. రూ. 3.19 ట్రిలియన్ సంపద ఆవిరి!
Adani stocks crash : హిన్డెన్బర్గ్ రీసెర్చ్ సృష్టించిన అలజడితో.. దేశీయ స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ స్టాక్స్ దారుణంగా పతనమయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో.. అదానీ గ్రూప్‌నకు చెందిన స్టాక్స్ 5శాతం- 20శాతం వరకు నష్టపోయాయి. శుక్రవారం ఒక్క రోజే.. అదానీ గ్రూప్ స్టాక్స్‌తో రూ. 3.19 ట్రిలియన్ మదుపర్ల సంపద ఆవిరైపోయింది!
పడుతూనే ఉన్నాయి.. పడుతూనే ఉన్నాయి..!
అదానీ గ్రూప్ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి.. ఓ సంచలన నివేదికను బయటపెట్టింది అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ హిన్డెన్బర్గ్ రీసెర్చ్. అదానీ గ్రూప్‌లో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వివరించింది. అంతా బాగానే ఉందని బయట ప్రపంచానికి చూపించుకునేందుకు.. అదానీ సిబ్బంది తప్పుడు మార్గాల్లో అడుగులు వేసిందని వివరించింది. ఫలితంగా.. అదానీ గ్రూప్ స్టాక్స్‌పై తాము షార్ట్- సెల్లింగ్వైపు ఉంటామని స్పష్టం చేసింది.
Adani stocks falling : ఈ నివేదిక నేపథ్యంలో.. బుధవారం డీలా పడిన అదానీ స్టాక్స్‌లో శుక్రవారం రక్తపాతమే కనిపించింది! అదానీ గ్రూప్‌నకు చెందిన 10 స్టాక్స్‌లో 6.. లోయర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి. ఆ తర్వాత వీటిల్లో కొన్ని స్వల్పంగా తేరుకున్నాయి. ప్రైజ్ బ్యాండ్ నిబంధన లేని అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ షేర్లు.. 12శాతం- 18శాతం మేర పతనమయ్యాయి.
అదానీ గ్రూప్ ఎఫెక్ట్.. మొత్తం స్టాక్ మార్కెట్లనే నెగిటివ్‌గా మార్చేసింది! శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 874 పాయింట్లు కోల్పోయి 59331 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 288 పాయింట్ల నష్టంతో 17,604 వద్ద ముగిసింది. అదానీ గ్రూప్‌నకు అప్పులు ఇచ్చిన ప్రభుత్వ ఆధారిత, ప్రైవేట్ బ్యాంక్‌లకు సంబంధించిన స్టాక్స్ కూడా భారీగా పతనమయ్యాయి! బ్యాంక్ నిఫ్టీ 3.1శాతం నష్టపోయి 40,345 వద్దకు చేరింది.
Adani stocks today : ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ.. 7వ స్థానానికి పడిపోయారు. అంతేకాకుండా.. ఆసియాలోనే అపర కుబేరుడి స్థానాన్ని సైతం కోల్పోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ముకేశ్ అంబానీ.. ఇప్పుడు ఆ సీటును దక్కించుకున్నారు. ఏడాది క్రితం వరకు ఆ స్థానంలో ఉన్న అంబానీని వెనక్కి నెట్టారు అదానీ. ఇప్పుడు పరిస్థితులు మళ్లీ అక్కడికే చేరుకున్నాయి!
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో.. శుక్రవారం ఒక్క రోజే మదుపర్ల సంపద రూ. 3.9 ట్రిలియన్ పోగొట్టుకోగా.. బుధవారాన్ని కలుపుకుంటే.. ఆ సంఖ్య రూ. 4.4 ట్రిలియన్కు చేరుతుంది!
ఇప్పుడు పరిస్థితేంటి?
Hindengurg Research Adani : హిన్డెబర్గ్ రీసెర్చ్ రిపోర్టును అదానీ గ్రూప్ ఇప్పటికే ఖండించింది. కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం అనుమానాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మరో ప్రకటన చేసింది అదానీ సిబ్బంది. తమ సంస్థకు చెందిన ఆర్థిక వ్యవస్థను దేశంలోనే 6 అతిపెద్ద సంస్థలు ఆడిట్ చేశాయని పేర్కొంది. తమ ఆర్థికంగా ఆరోగ్యంగానే ఉందని వివరించింది.
ఈ వ్యవహారంపై సెబీ అధికారులు స్పందించారు. అదానీ గ్రూప్ నుంచి ఈ విషయంపై క్లారిటీ రావాలని.. ఆ తర్వాత తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.