Gautam Adani: ఆ విషయంలో అసంతృప్తి ఉంది: ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ
Gautam Adani: తన జీవిత ప్రయాణాన్ని ఓ కార్యక్రమంలో ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ పంచుకున్నారు. తాను చింతించే ఓ విషయం, తన మొదటి ఉద్యోగం, తొలి వ్యాపారం లాంటి అంశాల గురించి మాట్లాడారు. వివరాలివే..
Gautam Adani: వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ.. ప్రస్తుతం ఆసియాలోనే అత్యంత ధనికుడిగా (Asia's richest man Gautam Adani) ఉన్నారు. ప్రపంచంలో అత్యధిక ధనికుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. వివిధ రంగాల్లో వ్యాపారంలో దూసుకువెళుతున్నారు. అయితే ఆయన ఓ విషయంలో చింతిస్తుంటారట. దీంతో పాటు తన తొలి వ్యాపార సంపాదనతో ఇంకా గుర్తుందని కూడా చెప్పారు. గుజరాత్‍లోని పాలన్‍పూరిలో ఉన్న విద్యామందిర్ ట్రస్ట్ 75వ వార్షికోత్సవంలో పాల్గొన్న గౌతమ్ ఆదానీ చాలా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వివరాలివే..
16ఏళ్లకే చదువు ఆపేశా..
Gautam Adani on His Education: 1978లో 16 ఏళ్ల వయసులోనే తాను చదువు ఆపేశానని గౌతమ్ అదానీ చెప్పారు. అప్పుడే గుజరాత్ నుంచి రైలు ఎక్కి ముంబైకి వచ్చానని అన్నారు. కాలేజీ విద్యను పూర్తి చేయలేదనే అసంతృప్తి తనలో ఉంటుందని అన్నారు. కళాశాలలో చదవలేదని చింతిస్తుంటానని చెప్పారు. అయితే, ప్రారంభ అనుభవాలు తనకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాయని అదానీ తెలిపారు. కానీ, ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎంతో విస్తార జ్ఞానాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.
“చదువును వదిలిపెట్టి నేను ముంబైకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు నా వయసు 16 ఏళ్లు. నా కుటుంబంతో కలిసి ఎందుకు పని చేయడం లేదు? ముంబైకి ఎందుకు వచ్చాను? అని నన్ను నేను ప్రశ్నించుకునే వాడిని. టీనేజ్‍లో ఉన్నప్పుడు స్వేచ్ఛను, ఆశావాదాన్ని కోరుకోవడాన్ని ఎవరూ ఆపలేరు. ఈ విషయాన్ని చాలా మంది అంగీకరిస్తారని అనుకుంటున్నా. నేను ఏదైనా విభిన్నంగా చేయాలనుకున్నా, నా శైలిలో సొంతంగా చేయాలనుకున్నా.. అదే అప్పట్లో నాకు అనిపించింది” అని గౌతమ్ అదానీ అన్నారు. జేబులో అతితక్కువ డబ్బుతో అదానీ.. గుజరాత్ నుంచి ముంబైకి వచ్చారు.
తొలి వ్యాపారం ఇంకా గుర్తుంది
“నేను ముంబై చేరుకున్నాక.. మా బంధువు ప్రకాశ్ భాయ్ దేశాయ్ నన్ను మహేంద్రా బ్రదర్స్ లో చేర్పించారు. అక్కడే వజ్రాల అమరిక (Diamond Assort) ను నేర్చుకున్నా. నేను అక్కడ బిజినెస్‍ను బాగా వృద్ధి చేశా. మహేంద్రా బ్రదర్స్ వద్ద మూడు సంవత్సరాలు పని చేశాక.. జావేరీ బజార్లో డైమండ్ వ్యాపారంలో సొంత బ్రోకరేజ్‍ను ప్రారంభించా” అని గౌతమ్ అదానీ గుర్తు చేసుకున్నారు. “నా తొలి వ్యాపారం నాకు ఇంకా గుర్తుంది. ఓ జపనీస్ కొనుగోలుదారుడితో మొదటి వ్యాపారం చేశా. రూ.10,000 నాకు కమిషన్‍గా వచ్చింది. అది నాకు ఇప్పటికీ గుర్తుంది” అని అదానీ అన్నారు. పారిశ్రామిక వేత్తగా తన ప్రయాణానికి అదే నాంది అని చెప్పారు.