తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysrcp: ప్రస్తుతం మీ అవసరం పార్టీకి ఎంతో ఉంది: వైఎస్ జగన్

YSRCP: ప్రస్తుతం మీ అవసరం పార్టీకి ఎంతో ఉంది: వైఎస్ జగన్

22 August 2024, 17:29 IST

google News
    • YSRCP: అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ చీఫ్ జగన్ వివిధ వర్గాలతో వరుసు సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. పార్టీకి సపోర్ట్ చేసే లాయర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో న్యాయం, ధర్మం లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ సమయంలో లాయర్లు పార్టీకి సపోర్ట్‌గా ఉండాలని సూచించారు.
లాయర్ల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్
లాయర్ల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్

లాయర్ల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎం అయ్యాక.. ఎక్కడా ధర్మం, న్యాయం కనిపించడం లేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని తన నివాసంలో గురువారం లాయర్లతో సమావేశమైన జగన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసుల ఎదుటే క్రైమ్ జరుగుతోందన్నారు. బాధితులను కాపాడాల్సిన పోలీసులు.. తిరిగి వారిపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఎక్కడో ఆఫీసులో పేపర్లు కాలిపోతే.. రామచంద్రారెడ్డికి ఏం సంబంధం. ఎవరు అధికారంలో ఉన్నారు.. ఏవరి హయాంలో పేపర్లు కాలిపోయాయి. ఒక ఆఫీసులో పేపర్లు కాలిపోతే.. ఇంకో ఆఫీసులో ఉండవా.. ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ అయ్యింది కదా. ఏదో ఒక కారణంగా వైసీపీ సానుభూతిపరులపై కేసులు పెడుతున్నారు. తాడిపత్రిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి వస్తే.. రాళ్లు, కర్రలతో దాడులు చేస్తున్నారు. భయాందోళనకు గురి చేస్తున్నారు. మళ్లీ వారే రివర్స్‌గా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు' జగన్ ఆరోపించారు.

'ప్రస్తుత పరిస్థితుల్లో లాయర్ల అవసరం పార్టీకి చాలా ఉంది. పార్టీ కేడర్‌ను కాపాడుకోవడంలో మీ పాత్ర చాలా ఉంది. అందరం ఒకతాటి మీదకు వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. టీడీపీ చేసే అరాచకాలను కోర్టుల దృష్టికి తీసుకెళ్లాలి. జిల్లాల్లో లీగల్ సెల్ ఇంకా పటిష్టం కావాలి. ప్రతీ కార్యకర్తకు అండగా నిలవాలి. వారికి ఆపదల్లో తోడుగా ఉండాలి. గతంలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల రూపాయలు కేటాయించాం. గతంలో ఏ ప్రభుత్వం లాయర్ల గురించి ఆలోచించలేదు. కేవలం మనవే తోడుగా ఉన్నాం' అని జగన్ వ్యాఖ్యానించారు.

అనంతరం ముస్లిం మైనారిటీ ప్రతినిధులతోను జగన్ భేటీ అయ్యారు. ప్రస్తుత ప్రభుత్వంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని జగన్ వారికి సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ సరిళిపైనా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పొరపాట్లను ముస్లిం, మైనారిటీ నేతలు జగన్‌కు వివరించారు.

తదుపరి వ్యాసం