Vijayawada Politics : విజయవాడలో మారుతున్న లెక్కలు..! టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు-big shock for ycp in vijayawada three corporators joined tdp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Politics : విజయవాడలో మారుతున్న లెక్కలు..! టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు

Vijayawada Politics : విజయవాడలో మారుతున్న లెక్కలు..! టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 22, 2024 10:13 PM IST

విజయవాడలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లుగా ఉన్నారు.

టీడీపీలో చేరిన కార్పొరేటర్లు
టీడీపీలో చేరిన కార్పొరేటర్లు

విజయవాడలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ ఉన్నారు. వీరంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్పొరేటర్లగా ఉన్నారు.

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 64 కార్పొరేటర్‌ స్థానాలు ఉన్నాయి. వీరిలో 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాజీనామాకు ఆమోదం తెలపడంతో.. ప్రస్తుతం 63 మంది కార్పొరేటర్లు మిగిలారు. పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరటంతో… రాబోయే రోజుల్లో మరికొంత మంది కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే… బెజడవాడలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో అధికారం మారటంతో చాలా కార్పొరేషన్లలో సీన్ మారుతోంది. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వైసీపీ ప్రతినిధులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇక పంచాయతీలలో కూడా వైసీపీ బలహీనపడుతుంది.  విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన గూటికి చేరారు. 

ఇక ఒంగోలులో కూడా 11 మంది వైసీపీ కార్పొరేటర్లు… సైకిల్ ఎక్కారు.  ఎన్నికలకు ముందు ఐదుగురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరగా…ఇటీవలే 12 మంది కార్పొరేటర్లు మేయర్ టీడీపీ గూటికి చేరారు. ఒంగోలులో ఒకప్పుడు మాజీ మంత్రి బాలినేని చెప్పిందే చెల్లేది. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంతా తారుమారు చేసింది. ఓటమి తరువాత బాలినేని నియోజకవర్గం వైపు చూడకపోవడం, పార్టీ కేడర్ ను పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో వైసీపీ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు రాజీనామా చేసి టీడీపీలో చేరారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒంగోలు మేయర్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అనూహ్యంగా విజయం సాధించింది. దీంతో మున్సిపాలిటీల్లో వైసీపీ పట్టు సడలిపోయే పరిస్థితికి వచ్చేసింది. కార్పొరేటర్లు పార్టీని వీడటంతో… లెక్కలు మారిపోయాయి. ఫలితంగా ఒంగోలు మేయర్ పీఠం టీడీపీ కైవసం అయ్యింది.

టాపిక్