Durgadevi Temple: దుర్గాదేవి ఆలయానికి రూ.38 లక్షలు విరాళమిచ్చిన ముస్లిం సోదరులు, అందుకే మన భారత్ గొప్ప దేశమైంది
Durgadevi Temple: మన దేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో కులాలు, మతాలు, భాషలు తనలో ఇముడ్చుకుని ఒకే తాటిపైకి నిలబెట్టే గొప్ప దేశం ఇండియా. హిందూ ఆలయానికి ముస్లిం సోదరులు భారీగా విరాళం ఇవ్వడం మన సామరాస్యతకు చిహ్నం.
Durgadevi Temple: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఇది ఎన్నో సంస్కృతులను, నాగరికతలను తనలో ఇముడ్చుకుంది, విలువైన చరిత్రను కలిగి ఉంది. మొదట్లో భరత వర్షంగా, భరతఖండంగా పిలుచుకున్న ఈ దేశం... తర్వాత భారతదేశంగా మారింది.
శతాబ్దాలుగా ఈ భూభాగంలో హిందువులే అధికంగా నివాసం ఉంటూ వచ్చారు. ఆ తర్వాత అన్ని మతస్తులకు నిలయంగా మారింది. భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉన్నది. రంగులు, మతాలు, కులాలు, ఆచార వ్యవహారాలు అన్నీ వేరువేరుగా ఉన్నవారు కోట్ల మంది నివసిస్తున్నా కూడా దేశం కోసం వారంతా ఒక్కటే అవుతారు. ఒకరికొకరు సాయం చేసుకోవడంలో ముందుంటారు.
మతపరమైన పండుగలను అందరూ ఆనందోత్సాహాలతోనే నిర్వహించుకుంటారు. హిందువుల పండుగకు ముస్లింలు, ముస్లింల పండుగలకు హిందువులు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అదే వారిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధాన్ని పెంచుతూ వస్తోంది. ఇప్పుడు మరొక సంఘటన మన దేశంలో హిందూ-ముస్లింల మధ్య ఉన్న అనుబంధాన్ని మరొక్కసారి చాటి చెబుతోంది.
ముస్లింల విరాళం
కేరళలో ఉన్న ఓ దుర్గాదేవి ఆలయానికి అక్కడున్న ముస్లిం సమాజం ఏకంగా 38 లక్షల రూపాయల విరాళాన్ని అందించింది. ఇది మన దేశంలోని ఐక్యతకు సామరాస్యతకు చిహ్నం అని చెప్పుకోవాలి. కేరళలోని మలప్పురం జిల్లాలో ముత్తువల్లూరు అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక దుర్గాదేవి ఆలయం ఉంది. అది 400 ఏళ్ల నాటిది. చారిత్రక ఆలయం శిథిలమవుతున్న దశలో ఉండడంతో దాన్ని తిరిగి పునరుద్ధరించాలని అనుకున్నారు. దీనికి హిందువులతో పాటు ముస్లిం సోదరులు కూడా చేతులు కలిపారు. తమ వంతు సాయాన్ని చేసేందుకు ముందుకు వచ్చారు.
ఆ గ్రామంలో హిందువుల కన్నా ముస్లింలే అధికంగా నివసిస్తున్నారు. అయినా కూడా వారు తమ తోటి సోదరులైన హిందువులకు తమ వంతు సాయం అందించేందుకు సిద్ధపడ్డారు. అందులో భాగంగా అందరూ విరాళాలు సేకరించారు. ఆ విరాళాన్ని కలిపితే 38 లక్షల రూపాయలకు పైగా వచ్చింది. ఆ డబ్బుతోనే ఆలయ నిర్మాణానికి కావలసిన సామాగ్రిని కొన్నారు. ఆలయాన్ని పూర్తి చేసి చక్కటి నందనవనంలా తీర్చిదిద్దారు. అంతేకాదు ఆలయ ఉత్సవాలకు వంటకాలకు తామే కూరగాయలను కూడా అందించారు.
ఈ ఏడాది మేలో మూడు రోజులపాటు దుర్గామాత విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో హిందువులు, ముస్లింలు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఆ ఆలయం మతసామరస్వతకు అద్భుతమైన చిహ్నంగా నిలిచింది.
హిందూ, ముస్లిం సోదరుల చేతుల మీదగా పునరుద్ధరణకు నోచుకున్న ఆలయం.. ఇప్పుడు చుట్టుపక్కల ఎంతో గౌరవాన్ని ప్రతిష్టను సంపాదించుకుంది. కేరళలోని ఎంతోమంది ఆలయాన్ని చూసేందుకు వస్తున్నారు. విచిత్రం ఏమిటంటే కేవలం హిందువులే కాదు, ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని చూసేందుకు వెళుతున్నారు.
ఏ దేశంలోనూ ఇంతలా రెండు ప్రధాన మతాలవారు కలిసి ఒకే తాటిపై నడవడం చాలా అరుదు. కానీ మన భారతదేశంలో చాలా చోట్లా... హిందూ ముస్లింలు అన్నదమ్ములుగా కలిసి జీవిస్తున్నారు. అందుకే ఆ విషయంలో మన భారతదేశం గొప్పతనం చెప్పుకోవాల్సిందే.
టాపిక్