Jagan UK Trip: జగన్ విదేశీ పర్యటనకు అనుమతించొద్దన్న సీబీఐ, 27కు విచారణ వాయిదా
Jagan UK Trip: వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విదేశాలకు వెళ్లేందుకు అనుమతించొద్దని సీబీఐ కోర్టుకు తెలిపింది.యూకే పర్యటనకు వెళ్లేందుకు జగన్ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది.
Jagan UK Trip: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతించొద్దని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. లండన్‌లో ఉంటున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు జగన్ సీబీఐ కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జగన్‌పై ఉన్న కేసుల విచారణ సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది.
పదేళ్లుగా జగన్ బెయిల్‌పైనే ఉన్నారంటూ సీబీఐ అభ్యంతరం తెలిపింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని సర్వోన్న న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో జగన్‌కు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. సీబీఐ అభ్యంతరాలను జగన్ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. గతంలో కూడా పలుమార్లు కోర్టు విదేశీ పర్యటనలకు అనుమతించి ఇచ్చిందని గుర్తు చేశారు. కోర్టు ఆదేశాలను జగన్ ఎప్పుడు ఉల్లంఘించలేదని గుర్తు చేశారు.
ఏళ్ల తరబడి సాగుతున్న విచారణ..
వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి సొంత రాజకీయ పార్టీనివ ఏర్పాటు చేసుకున్న సమయంలో జగన్‌పై క్విడ్ ప్రో కో కేసులు నమోదు అయ్యాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో 11 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణ దాదాపు పదిహేనేళ్లుగా సాగుతోంది. 2011 తర్వాత పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో జగన్ 16నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది.
ఆస్తుల కేసుల్లో జగన్‌పై ఉన్న కేసులపై విచారణ సాగదీయడంపై మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పెండింగ్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని సీబీఐ ఒత్తిడి చేస్తోంది. మరోవైపు లండన్‌లో ఉంటున్న కుమార్తె దగ్గరకు వెళ్లేందుకు జగన్ మంగళవారం నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
యూకేలో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. సెప్టెంబరు మొదటి వారంలో లండన్ వెళ్లేందుకు పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురాం సీబీఐ వివరణ కోరుతూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం విచారణ సందర్భంగా సీబీఐ అభ్యంతరం తెలిపింది. అనుమతి ఇవ్వొద్దని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది.
మరోవైపు యూరప్‌లో పర్యటించేందుకు అనుమతి కోరుతూ ఇదే కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 6 నెలల్లో 60 రోజుల పాటు విదేశీ పర్యటనలకు అనుమతి కావాలని అభ్యర్థించారు. గతంలో కూడా విదేశాలకు వెళ్లిరావడానికి సీబీఐ కోర్టు అనుమతించిందని సాయిరెడ్డి తరపు న్యాయవాది అశోక్ రెడ్డి తెలిపారు. దీనికి సీబీఐ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
సాయిరెడ్డి పిటిషన్ ను అనుమతిస్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందన్నారు. ఇప్పటికే కేసుల విచారణ ముందుకు సాగడం లేదని, అనుమతిని నిరాకరించాలని కోరారు. సాయిరెడ్డి పిటిషన్‌పై నిర్ణయాన్ని ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.
జగన్‌కు సాధారణ పాస్‌పోర్ట్..
ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్ల పాటు డిప్లొమాట్ పాస్‌పోర్ట్ వినియోగించుకున్న జగన్మోహన్ రెడ్డి తాజాగా సాధారణ పాస్‌పోర్ట్‌గా మార్చుకున్నారు. ఆగస్ట్ 1న విజయవాడలో ఆయన పాస్‌పోర్ట్‌ను మార్చుకున్నారు. కొద్ది రోజులుగా బెంగుళూరులో ఉంటున్న జగన్ మంగళవారం తాడేపల్లి చేరుకున్నారు. జూన్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు సార్లు జగన్ బెంగుళూరు వెళ్లొచ్చారు.