YS Jagan: ఆ రోజు నేను ప్రారంభించండం సంతోషంగా ఉంది: వైఎస్ జగన్
26 August 2024, 15:14 IST
- YS Jagan: మదర్ థెరిసా జయంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆసక్తిక ట్వీట్ చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన నిర్మల్ హృదయ్ భవన్ గురించి వివరించారు.
నిర్మల్ హృదయ్ భవన్‌ను ప్రారంభించిన జగన్
మదర్ థెరిసా జయంతి సందర్భంగా.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నివాళులర్పించారు. మదర్ థెరిసా మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అనాథ, పేద పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పించి.. వారి భవిషత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె అని కీర్తించారు.
'పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి.. వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిసా. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు.. అనాథ, పేద పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పించి వారి భవిషత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె. మన ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలోని నిర్మల్ హృదయ్ భవన్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా.. వారికి సహాయ సహకారాలు అందించాం. ఆ భవనం కాంప్లెక్స్‌ను ఆ రోజు నేను ప్రారంభించండం సంతోషంగా ఉంది. నేడు మదర్ థెరిసా జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
నిర్మల్ హృదయ్ భవన్‌లో జగన్ దంపతులు..
2023 మే 30వ తేదీన జగన్ దంపతులు నిర్మల్ హృదయ్ భవన్‌ను సందర్శించారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను పరిశీలించారు. దాదాపు 30 నిముషాల పాటు అనాథ పిల్లలతో ముచ్చటించారు. ఆ తర్వాత నిర్మల్ హృదయ్ భవన్ లో నూతనంగా నిర్మించిన భవనాన్ని చిన్నారులతో కలిసి ప్రారంభించారు. మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిర్మల్ హృదయ్ భవన్‌లోని అనాథలను ఆత్మీయంగా పలకరించారు.