YS Jagan Tirumala Tour : వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు..!
27 September 2024, 15:11 IST
- వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దైంది. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. తిరుమల పర్యటన గురించి మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో జిల్లాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు.
వైఎస్ జగన్
వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన రద్దయ్యింది. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. వైసీపీ నేతలకు పోలీసుల ముందస్తు నోటీసులు, తిరుపతి జిల్లావ్యాప్తంగా ఆంక్షలు, డిక్లరేషన్ అంశంపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు తిరుపతి జిల్లాలో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి.
తిరుమల లడ్డూ వివాదంలో తిరుపతి జిల్లాలో పలు హిందూ సంఘాలతో పాటు ఎన్డీఏ కూటమిలోని రాజకీయపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలను అపవిపత్రం చేశారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు.. తిరుమలను వాడుకుంటున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల ప్రతిష్టను అపవిత్రం చేసేలా చంద్రబాబు వ్యవహారించారని జగన్ కూడా ఆరోపించారు. ఇందులో భాగంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు చేయాలని పిలుపునిచ్చారు.
పూజల కార్యక్రమంలో భాగంగా జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. ఇవాళ తిరుమలకు చేరుకోనున్న ఆయన… రేపు శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. కానీ జిల్లాలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో…. పలువురు వైసీపీ నేతలకు ముందస్తు నోటీసులు జారీ అయ్యాయి. మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు జగన్ ను అడ్డుకుంటామని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన చర్చనీయాంశంగా మారింది.
జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలు…
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసులు ప్రకటన కూడా విడుదల చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అమల్లో వచ్చిందని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. అక్టోబర్ 24వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరని అని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివిధ పార్టీ నాయకులు, సంస్థలు, వివిధ సమూహాలు, ప్రజలు పోలీస్ వారి ఉత్తర్వులను పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ చేయడానికి పోలీస్ వారికి సహకరించాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. ఎట్టిపరిస్థితుల్లో నిబంధనలను ఉల్లంఘించవద్దని స్పష్టం చేశారు.