YSRCP : కేసులకు భయపడొద్దు.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్ జగన్
03 October 2024, 15:33 IST
- YSRCP : వైసీపీ చీఫ్ జగన్.. జిల్లాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. తన పార్టీ నాయకులకు ధైర్యం కల్పించారు. మళ్లీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు.
వైఎస్ జగన్
కేసులకు భయపడొద్దు. .వ్యక్తిత్వం చాలా ముఖ్యం.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. అని వైఎస్సార్సీపీ చీఫ్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో.. ఏలూరు జిల్లా పార్టీ నేతలు, నాయకులతో జగన్ సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పనితీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంట్‌కు పోటీ చేసిన కారుమూరి సునీల్‌తో ప్రత్యేకంగా మాట్లాడి దిశానిర్దేశం చేశారు.
'నాలుగు నెలల్లోనే.. అన్నింటా విఫలం అయ్యారు. చంద్రబాబు అబద్ధాలు, మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో పూర్తి విఫలమైంది. మూడు నెలల్లోనే లక్షన్నర పెన్షన్లు తొలగించి.. పేదలకు అన్యాయం చేస్తున్నారు' అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
'విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. జరిగిన నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు. వాళ్లకు నచ్చిన వారికే పరిహారం ఇస్తున్నారు. బాధితులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రతిపక్షంపై అదేపనిగా కేసులు పెడుతూ.. డ్రైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా.. బడ్జెట్ ప్రవేశపెట్టలేదు' అని జగన్ విమర్శించారు.
'బడ్జెట్ ప్రవేశపెడితే.. ఏ పథకానికి ఎంత ఇస్తున్నారు.. ఇచ్చిన హామీలకు దేనికెంత కేటాయింపులో చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకపోతే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అందుకే వీళ్ల పనులకు దేవుడు మొట్టికాయలు వేస్తున్నాడు. గ్రామాల్లో పార్టీ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మన హయాంలో జరిగిన మంచిని.. ఇప్పుడు జరుగుతున్న తీరును ప్రజలకు వివరించాలి' అని వైఎస్ జగన్ సూచించారు.
'గతంలో పేద ప్రజలకు ఏ కష్టం రాకుండా.. అన్ని పథకాలను ఇంటి వద్దకే పంపాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాటను తప్పలేదు. మన ప్రభుత్వం వచ్చాక రెండేళ్లు కోవిడ్ కష్టం వచ్చింది. అయినా.. ఎక్కడా వెనకడుగు వేయకుండా పథకాలు అందించాం. సాకులు చెప్పకుండా సంక్షేమాన్ని కొనసాగించాం. కానీ.. ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. వాళ్లకు నచ్చినవారికే పథకాలు ఇచ్చి.. పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు' అని జగన్ ఆరోపించారు.