Karimnagar BRS : మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్..! గరంగరంగా కరీంనగర్ సిటీ పాలిటిక్స్-mayor vs deputy mayor disputes in karimnagar brs party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Brs : మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్..! గరంగరంగా కరీంనగర్ సిటీ పాలిటిక్స్

Karimnagar BRS : మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్..! గరంగరంగా కరీంనగర్ సిటీ పాలిటిక్స్

HT Telugu Desk HT Telugu
Aug 28, 2024 12:20 PM IST

బీఆర్ఎస్ పురుడు పోసుకున్న కరీంనగర్ లో వర్గ విబేధాలు బహిర్గతమయ్యాయి. మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్ గా రాజకీయాలు నడుస్తున్నాయి. స్వపక్షంలోనే విపక్షంగా మారి పరస్పర విమర్శలతో రచ్చ రాజకీయాలు చేస్తున్నారు.

కరీంనగర్ బిఆర్ఎస్ లో విబేధాలు..!
కరీంనగర్ బిఆర్ఎస్ లో విబేధాలు..!

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వై.సునీల్ రావు అమెరికా పర్యటన రాజకీయ దుమారం రేపింది. గడువులోగానే నగరానికి చేరేందుకు మేయర్ సిద్ధమవడంతో సమస్య టీ కప్పులో తుఫానులా మారిందని అందరూ భావించగా అనూహ్యంగా వివాదం ముదిరి బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. 

ఇంతకాలం చాప కింద నీరులా మేయర్, డిప్యూటీ మేయర్ మధ్యన కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధం ఒక్కసారిగా రచ్చకెక్కింది. కేవలం మేయర్ పర్యటన గురించే కాకుండా గడిచిన నాలుగున్నర ఏళ్ళ కాలంలో జరిగిన పరిణామాలన్నీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ దంపతులు ఏకరువు పెట్టడం రానున్న కాలంలో బీఆర్ఎస్ లో మరింత దుమారం చెలరేగక తప్పదనే సంకేతాలనిస్తోంది. 

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు సన్నిహితంగా ఉండే మేయర్, డిప్యూటీ మేయర్ మధ్యనే వివాదం చోటు చేసుకోవడంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఇతర ముఖ్య నేతలెవరూ కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

కుదించుకున్న మేయర్….

నెల రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్ళిన మేయర్ సునీల్ రావు రాజకీయ విమర్శల నేపథ్యంలో 15 రోజుల్లోనే తిరుగు ప్రయాణం అవుతున్నారు. మేయర్ అమెరికా వెళ్ళే విషయాన్ని ముందుగా ఎవరికి చెప్పకపోవడంతో పాటు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించకపోవడాన్ని అవమానంగా భావించిన డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళారు. 

అందుబాటులో లేని మేయర్ పై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్ నోటీసుతో స్పందించిన మేయర్ గడువులోగానే కరీంనగర్ లో అందుబాటులో ఉంటానని తేల్చి చెప్పారు. అయితే అనూహ్యంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక జరిగిన తీరు పట్ల మనస్తాపానికి గురైన డిప్యూటీ మేయర్ స్వరూపారాణి నగర బిఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ మేయర్ సునీల్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఇకపై తగ్గేదే లేదని అల్టిమేటం ఇచ్చారు. 

పార్టీ నాయకత్వం, ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అనుమతితోనే మీడియా ముందుకు వచ్చామంటూ స్పష్టత ఇచ్చిన చల్లా దంపతులు మేయర్ టార్గెట్ గా పలు విమర్శలు గుప్పించారు. 

కేవలం గంటల వ్యవధిలోనే అమెరికా నుంచి మేయర్ సునీల్ రావు దీనిపై స్పందించారు. డిప్యూటీ మేయర్, నగర పార్టీ అధ్యక్షుడి హోదాలో మీడియా ముందుకు వచ్చిన చల్లా దంపతులపై పలు విమర్శలు చేశారు. ఇరువురు ప్రజాప్రతినిధుల మధ్య సాగిన సవాళ్ళు…. ప్రతిసవాళ్ళ నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దశాబ్దకాలం తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితు ల్లో ఉన్న సమయంలో ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులు రచ్చకెక్కిన వైనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది. 

ఇరువురి మధ్య సమన్వయం కుదర్చాల్సిన స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కవితకు బెయిల్ లభించే అంశంపై ఢిల్లీలో ఉండిపోయిన నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు చిలికి చిలికి గాలివానలా ఎటు దారి తీస్తాయోనని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

మేయర్ బండారం బయటపెడుతాం: డిప్యూటీ మేయర్

బిసి మహిళను కావడంతోనే మేయర్ తనపై వివక్షత చూపుతున్నాడని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ఆరోపించారు. ఒకే పార్టీకి చెందిన వాళ్ళమైనప్పటికి ఏ సమాచారం ఇవ్వకుండా ఒంటెద్దు పోకడతో మేయర్ వ్యవహరించారని విమర్శించారు. ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించకుండా అమెరికా వెళ్ళాడని తెలిపారు.  మేయర్ తీరుపై అనుమానాలున్నాయని.. గత 55 నెలలుగా మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన పనులపై దృష్టి సారించి మేయర్ బండారం బయటపెడుతామని స్పష్టం చేశారు.

పార్టీ మారేందుకే పొగిడారు - హరి శంకర్

మేయర్ తీరుపై బిఆర్ఎస్ అదిష్టానంకు పిర్యాదు చేశామని బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తెలిపారు. స్మార్ట్ సిటీ కి మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిదులు తీసుకువస్తే తాజా ఎంపీ బండి సంజయ్ ని మేయర్ పొగిడారని గుర్తు చేశారు. పార్టీ మారే ఉద్దేశంతోనే స్వపక్షానికి చెందిన డిప్యూటీ మేయర్ తోపాటు కార్పోరేటర్ లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మేయర్ తీరుపై బిఆర్ఎస్ అదిష్టానం దృష్టి పెట్టిందన్నారు. త్వరలోనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

వెన్నుపోటు రాజకీయాలు చేయలేదు - మేయర్

మూడు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఏనాడూ పదవుల వెనుక పరుగెత్తలేదని.. ప్రజల మధ్యన ఉండి పని చేశానని మేయర్ సునీల్ రావు స్పష్టం చేశారు. అమెరికా నుంచి ఒక వీడియో ప్రకటన చేస్తూ చల్లా హరిశంకర్ దంపతులపై విరుచుకుపడ్డారు. 

చల్లా దంపతుల్లాగా వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడలేదని తేల్చిచెప్పారు. కేవలం పదవీకాంక్ష కోసం డిప్యూటీ మేయర్ పదవిని అడ్డం పెట్టుకొని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న చల్లా దంపతులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ను కోరుతున్నానని తెలిపారు.

వ్యక్తిగత పర్యటనలో భాగంగా రెండు వారాల పాటు అమెరికకు వెళుతున్నానని కార్పొరేటర్లకు, కమిషనర్ కు, మీడియాకు సమాచారం ఇచ్చానని చెప్పారు.మున్సిపల్ చట్టం ప్రకారంగానే తన పర్యటన షెడ్యుల్ ను రెండు వారాలకు రూపొందించుకున్నానని అన్నారు. 

నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో అందరిని కలుపుకుని ముందుకు పోతున్నామని తెలిపారు. చల్లా దంపతులపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నానని సునీల్ రావు పేర్కొన్నారు. పార్టీ పరువును ప్రజల్లో చులకన చేసినందుకు ఇద్దరి పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని మేయర్  స్పష్టం చేశారు.

రిపోర్టింగ్ ": కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు