Target Jagan : తిరుమల చుట్టూ రాజకీయం.. జగన్ టార్గెట్‌గా టీడీపీ నేతల పంచ్‌లు!
Target Jagan : ఇప్పుడు ఏపీ రాజకీయం అంతా తిరుమల చుట్టూ తిరుగుతోంది. ముఖ్యంగా జగన్ తిరుమల టూర్ రద్దు చేసుకోవడంతో.. టీడీపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేస్తూ.. విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. హోంమంత్రి అనిత, బుద్ధా వెంకన్న జగన్‌పై ఫైర్ అయ్యారు. అటు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా జగన్‌ను టార్గెట్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తిరుమల వెళ్లడం జగన్‌కు ఇష్టం లేదు. అందుకే తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. నోటీసులు ఇచ్చారని అబద్ధాలు చెబుతున్నారు. ఒక్క వైసీపీ నేతనూ మేం హౌస్ అరెస్ట్ చేయలేదు. జగన్‌కు డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు. ప్రసాదం ఇస్తే పక్కన పెట్టేవాళ్లు.. రుచి గురించి మాట్లాడడం విడ్డూరం' అని హోంమంత్రి అనిత వ్యాఖ్యానించారు.
'డిక్లరేషన్‌పై జగన్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. తిరుమలపై జగన్ స్వార్థ రాజకీయాలు మానుకోవాలి. తిరుమల సాక్షిగా తప్పు చేయలేదని జగన్ చెప్పగలరా. వెంకన్న అనుగ్రహిస్తేనే ఎవరన్నా తిరుమల వెళ్తాం. వెంకన్న అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్లలేకపోయారు. జగన్ ఇప్పటికైనా బురద చల్లడం మానాలి' అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న హితవు పలికారు.
'జగన్ అన్యమతస్తుడే. డిక్లరేషన్‌పై జగన్ సంతకం ఎందుకు పెట్టరు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమే. లడ్డూ వ్యవహారంతో జగన్ రాజకీయ పతనం ప్రారంభమైంది. జగన్ ఇంకా భక్తులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు' అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వ్యాఖ్యానించారు.
టీడీపీ, ఇతర పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై.. వైసీపీ లీడర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. 'తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీశారు. స్వామివారి ప్రసాదంపై అపవాదు వేశారు. సీఎం హోదాలో ఉండి తప్పుడు వ్యాఖ్యలు చేశారు. మా హయాంలో ఎలాంటి తప్పూ జరగలేదు. ధైర్యంగా సీబీఐ విచారణకు మేం డిమాండ్ చేశాం. మాజీ సీఎంను తిరుమల రాకుండా అడ్డుకున్నారు. రోజుకు 700 మంది అన్యమతస్తులు తిరుమలకు వస్తారు. మేం ఏనాడూ డిక్లరేషన్ తీసుకోలేదు' అని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
అటు ఏపీ వ్యాప్తంగా ఆలయాల్లో వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధురై మీనాక్షి టెంపుల్లో మాజీ మంత్రి రోజా పూజలు చేశారు. ఈ సందర్భంగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. 'చంద్రబాబు ఏ పూజలు చేసినా షూ వేసుకుంటారు. ఆయనకు దేవుడంటే భయం, భక్తి లేవు. పవన్ భార్య క్రిస్టియన్, పిల్లలు బాప్టిజం తీసుకున్నారు. పవన్ కూడా బాప్టిజం తీసుకున్నానని చెప్పారు. వీళ్లు సనాతనధర్మం గురించి మాట్లాడడం షాకింగ్ గా ఉంది. మేము సీబీఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం' అని రోజా స్పష్టం చేశారు.
డిక్లరేషన్ వివాదంపై వైసీపీ నేత నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. 'జగన్‌ను గతంలో డిక్లరేషన్ అడగలేదు.. ఇప్పుడెందుకు అడుగుతున్నారు. సోనియాగాంధీ డిక్లరేషన్ ఇచ్చే తిరుమల వచ్చారా? క్రిస్టియన్‌గా చెప్పుకున్న పవన్‌ను డిక్లరేషన్ అడిగే దమ్ముందా? బాప్టిజం తీసుకున్నానని పవన్ చెప్పారు కదా' అని నారాయణ స్వామి ప్రశ్నించారు.