Anantapur Chariot Burned : రాములోరి రథానికి నిప్పు పెట్టిన ఘటన, వైసీపీ నేత అరెస్ట్- చందాలు వసూలు చేయలేదని!
Anantapur Chariot Burned : అనంతపురం జిల్లాలో రాములోరి రథానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత ఈశ్వర్ రెడ్డి ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. రథం తయారీకి చందాలు వసూలు చేయలేదని ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Anantapur Chariot Burned : అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాళ్ గ్రామంలోని రథానికి నిప్పంటించిన ఘటనను పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బొడిమల్ల ఈశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఈ ఘటనపై విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి సమయంలో కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథ మండపంలోని రథానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.
రథ మండపం తాళాలను పగులగొట్టి రథంపై పెట్రోల్/కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. మంటలను గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రథం ముందు భాగం కాలిపోయింది. ఈ ఘటనపై కనేకల్ పోలీసు స్టేషన్ లో ఈ నెల 24న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్, క్ల్యూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి. అంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ నేరస్థలాన్ని పరిశీలించాయి.
పోలీసు దర్యాప్తులో కీలక విషయాలు తెలిశాయి. హనకనహాల్ గ్రామంలో శ్రీరాముల వారి రథాన్ని 2022లో గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డి అన్నదమ్ములు సుమారుగా రూ.20 లక్షలు వెచ్చించి తయారు చేయించారు. ఈ రథం తయారుచేసే సమయంలో ఎర్రిస్వామి రెడ్డి కుటుంబ సభ్యులు గ్రామంలోని ఎవరిని వద్ద చందాలు తీసుకోకుండా స్వయంగా తయారు చేయించారు. దీంతో గ్రామస్తుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ కారణంగా మరో వర్గం రథాన్ని నిప్పు పెట్టింది.
ఇంకా ఎవరి పాత్ర ఉందోనని ఆరా
ఇవాళ ఉదయం 6.00 గంటలకు పోలీసులు వైసీపీకి చెందిన బొడిమల్ల ఈశ్వర రెడ్డి(35)ను అరెస్టు చేశారు. నిందితుడు అదే గ్రామానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. ముద్దాయి బొడిమల్ల ఈశ్వర రెడ్డిని పోలీస్ కస్టడీ కి తీసుకొని ఈ నేరంలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అని విచారణ చేస్తామన్నారు. ఎస్పీ పి. జగదీశ్ సూచనలతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి కేసును ఛేదించారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ జగదీశ్ అభినందించారు.
అనంతపురం జిల్లాలో రాములోరి రథానికి గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి నిప్పుపెట్టారు. అర్ధరాత్రి సమయంలో మంటలను గమనించిన స్థానికులు వెంటనే వాటిని అదుపుచేశారు. అయితే అప్పటికే సగానికి పైగా రథం కాలిపోయింది. స్థానికుల సమాచారంలో కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు... ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతోనే రథం కాలిపోయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజాగా ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు...లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తా అంటే, మక్కెలు ఇరగిదీస్తాన్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి రథాలు తగలబెడతా, ప్రకాశం బ్యారేజీని బోట్లు పెట్టి కొట్టేస్తా అంటే, చొక్కా పట్టుకుని బోనులో వేయిస్తానన్నారు. వైసీపీ క్రిమినల్ చరిత్రతో వస్తే..ప్రభుత్వం పవర్ ఏంటో చూపిస్తామన్నారు.
సంబంధిత కథనం