అర్ధరాత్రి హైడ్రామా.. బుద్ధా అరెస్టును ఖండించిన తెదేపా నేతలు-tdp senior leader buddha venkanna arrest full story in telugu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  అర్ధరాత్రి హైడ్రామా.. బుద్ధా అరెస్టును ఖండించిన తెదేపా నేతలు

అర్ధరాత్రి హైడ్రామా.. బుద్ధా అరెస్టును ఖండించిన తెదేపా నేతలు

Maragani Govardhan HT Telugu
Jan 25, 2022 12:19 PM IST

నోటీసు లేకుండా బుద్ధా వెంకన్నను ఎలా అరెస్టు చేస్తారని తెదేపా నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం రాత్రి వరకు ఆయనను విచారించిన పోలీసులు అనంతరం బెయిల్‌పై విడిచిపెట్టారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనపై 34 కేసులు నమోదు చేశారు.

<p>బుద్ధా వెంకన్న</p>
బుద్ధా వెంకన్న (Facebook)

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోమవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేసి అర్ధరాత్రి 11 గంటల సమయంలో విడిచెపెట్టారు. రాష్ట్ర మంత్రి కోడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై విమర్శలు చేశారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నోటీసు లేకుండా బుద్ధా వెంకన్నను ఎలా అరెస్టు చేస్తారని తెదేపా నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం రాత్రి వరకు ఆయనను విచారించిన పోలీసులు అనంతరం బెయిల్‌పై విడిచిపెట్టారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనపై 34 కేసులు నమోదు చేశారు.

అసలు ఏం జరిగింది..

మంత్రి కోడాలి నాని తన కన్వెన్షన్ సెంటర్‌లో క్యాసినో నిర్వహించారనే ఆరోపణలతో పాటు ఈ వ్యవహారంలో రూ.250 కోట్లు చేతులు మారాయని బుద్ధా వెంకన్న సోమవారం ఉదయం విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఇందులో డీజీపీ వాటా ఎంతని ప్రశ్నించారు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ అంటూ మండిపడ్డారు. కోడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదని, ఆయన క్యాసినో నిర్వహించినట్లు ఆధారాలున్నాయని ధ్వజమెత్తారు. నాని రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని, అదే ఆయన చేసిన తప్పని అన్నారు. షర్మిల ఏపీలో పార్టీ పెడితే మొదట మారేది నానియే అని, తర్వాత చంద్రబాబుకు బదులు జగన్‌ను దూషిస్తారని జోస్యం చెప్పారు. నాని మాట్లాడే భాష సరిగా లేదని, 2024లో ఓడాక తన పరిస్థితి ఏంటో ఓ సారి అర్థం చేసుకోవాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

నాని, డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి విడుదల చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాను అసత్యాలు చెప్పలేదని, ఉన్న విషయాన్నే నిర్భయంగా చెప్పానని వెల్లడించారు.

బుద్ధా అరెస్టును ఖండించిన చంద్రబాబు..

గుడివాడలో మంత్రి కొడాలి క్యాసినో పై ప్రశ్నిస్తే తమ నేతలను అరెస్టు చేస్తారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్య దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు. క్యాసినోపై వాస్తవాలు వెల్లడించలేని పోలీసులు తెదేపా నేతలను అరెస్టు చెయ్యడం దారుణమని అన్నారు. ప్రభుత్వ చర్యలతో వారి తడబాటు స్పష్టంగా కనిపిస్తుందని, గుడివాడలో అసలు ఏమీ జరగకపోతే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. తమపై దాడి చేసిన వారిని వదిలేసి. నిలదీసిన ప్రతిపక్ష నేతలను అరెస్టు చెయ్యడం సిగ్గుచేటు అని చంద్రబాబు దుయ్యబట్టారు. బుద్దా వెంకన్న పై పెట్టిన కేసు పూర్తిగా కుట్రపూరితమని, తప్పు చేసిన పోలీసులు భవిష్యత్తులో విచారణ ఎదుర్కొనక తప్పదని పేర్కొన్నారు.

బుద్ధా అరెస్టును చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు ఖండించారు. వైసీపీ నేతలు ఏం మాట్లాడిన డీజీపీకి వినపించదని, తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికే ఆయన పనిచేస్తున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్ర డీజీపీ ఐపీఎస్ నుంచి వచ్చారా లేక వైసీపీ నుంచి వచ్చారా అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. బుద్ధా వెంకన్న బీసీ కావడం వల్లే అరెస్టు చేశారని, బీసీలు, దళితులే లక్ష్యంగా పోలీసులతో జగన్ వేధింపులకు పాల్పడుతున్నారని పలువురు తెదేపా నాయకులు ఆరోపించారు.

Whats_app_banner

సంబంధిత కథనం