Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్-19 పాజిటివ్; ఎన్నికల ప్రచారానికి విరామం-us president joe biden tests covid 19 positive with mild symptoms ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్-19 పాజిటివ్; ఎన్నికల ప్రచారానికి విరామం

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్-19 పాజిటివ్; ఎన్నికల ప్రచారానికి విరామం

HT Telugu Desk HT Telugu
Jul 18, 2024 03:13 PM IST

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కొరోనా వైరస్ సోకింది. బుధవారం లాస్ వెగాస్ లో పర్యటిస్తున్న సమయంలో ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్ల డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్న బైడెన్ కోవిడ్ 19 కారణంగా కొన్ని రోజులు ప్రచారానికి విరామం ఇస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కొరోనా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కొరోనా

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం లాస్ వెగాస్ కు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సాధారణ అనారోగ్యంతో పాటు తేలికపాటి లక్షణాలతో కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ ధ్రువీకరించింది. సెల్ఫ్ ఐసోలేషన్ కోసం బైడెన్ డెలావర్ లోని తన ఇంటికి వెళ్తారని, అక్కడి నుంచే తన విధులను కొనసాగిస్తారని ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియరీ తెలిపారు. "నేను అనారోగ్యంతో ఉన్నాను" అని అమెరికా అధ్యక్షుడు ‘ఎక్స్’ లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.

కోవిడ్ 19 పాజిటివ్

81 ఏళ్ల బైడెన్ కు బుధవారం జలుబు, దగ్గుతో సహా ఎగువ శ్వాసకోశ సమస్యలు కనిపించాయి. దాంతో, ఆయనకు కొరోనా వైరస్ పరీక్షలు జరిపారు. ఆ పరీక్షల్లో ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జో బైడెన్ కు కోవిడ్ 19 కు సంబంధించి స్వల్పలక్షణాలే ఉన్నాయని, చికిత్స ప్రారంభించామని అధ్యక్షుడి వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ కెవిన్ ఓ'కానర్ చెప్పారు. బైడెన్ వ్యాక్సిన్ తీసుకున్నారని, అలాగే, వార్షిక కోవిడ్ -19 బూస్టర్ ను కూడా తీసుకున్నారని వెల్లడించారు. కొరోనా కారణంగా అమెరికాలో 2020 నుంచి 10 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

పోటీపై ప్రభావం

బైడెన్ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న నేపథ్యంలో, ఇప్పటికే ఆయన అధ్యక్ష అభ్యర్థిత్వంపై సొంత పార్టీ లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ తో పోటీలో బైడెన్ వెనుకబడి పోతున్నారని, బైడెన్ పోటీ నుంచి తప్పుకుంటే మంచిదని సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతలు సైతం బహిరంగంగా చెబుతున్నారు. ఇప్పుడు కోవిడ్ 19 బారిన పడడం ఆయనకు మరో దెబ్బగా భావిస్తున్నారు. కొన్ని రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2022లో బైడెన్ కు రెండుసార్లు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది.

డబ్ల్యూహెచ్ఓ సూచనలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe biden) కు కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన నేపథ్యంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. కోవిడ్ ఇంకా ముగియలేదని, ఈ వ్యాధి ఇప్పటికీ విస్తృతంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి వారం 1700 మందిని చంపుతోందని, ఈ విషయం ప్రజలు మర్చిపోవద్దని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.

Whats_app_banner